సాక్షి, హైదరాబాద్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) పాలక మండళ్లకు శనివారం ఎన్నిక జరిగి ఫలితాలు వెలువడగా, కొత్తగా ఎన్నికైన డైరెక్టర్లు ఆదివారం సొసైటీలకు చైర్మన్, వైస్ చైర్మన్‌లను ఎన్నుకున్నారు. పీఏసీఎస్ స్థాయిలో ఎన్నికలు ముగియడంతో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) పాలక మండలి ఎన్నిక నిర్వహణకు సహకార శాఖ కసరత్తు చేస్తోంది. సహకార శాఖ కమిషనర్ అధ్యక్షతన సోమవారం జరిగే సమావేశంలో డీసీసీబీ పాలక మండలి ఎన్నిక షెడ్యూలు విడుదల కానుంది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పాలక మండలి ఎన్నికలో ఏ క్లాస్ (పీఏసీఎస్ చైర్మన్లు), బీ క్లాస్ (గొర్రెల కాపరులు, మత్స్య తదితర సహకార సంఘాలు) సొసైటీల చైర్మన్లకు ఓటు హక్కు అవకాశం ఉంటుంది. దీంతో పూర్వపు ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన హైదరాబాద్‌ను మినహాయించి మిగతా తొమ్మిది జిల్లాల్లోనూ ఏ, బీ క్లాస్ సొసైటీ చైర్మన్ల జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పీఏసీఎస్ చైర్మన్లుగా గెలిచి డీసీసీబీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ తదితర పాలక మండలి పోస్టులను ఆశిస్తున్న టీఆర్‌ఎస్ ఆశావహ నేతలు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
అన్నీ టీఆర్‌ఎస్ ఖాతాలోకే?
సహకార ఎన్నికల్లో 90%కు పైగా పీఏసీఎస్ డైరెక్టర్ స్థానాల్లో టీఆర్‌ఎస్ మద్దతుదారులే గెలుపొందారు. దీంతో ఆదివారం జరిగిన పీఏసీఎస్ చైర్మన్ పదవులు కూడా 90% మేర టీఆర్‌ఎస్ మద్దతుదారులకే దక్కాయి. దీంతో పూర్వపు ఉమ్మడి జిల్లా పరిధిలో మెజారిటీ సొసైటీ పీఠాలు టీఆర్‌ఎస్ మద్దతుదారులకు దక్కడంతో తొమ్మిది డీసీసీబీలు టీఆర్‌ఎస్ మద్దుతుదారులకే దక్కుతాయని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో డీసీసీబీ పీఠాలను ఆశిస్తున్న టీఆర్‌ఎస్ ఆశావహ నేతలు పీఏసీఎస్ సొసైటీ చైర్మన్లుగా ఎంపికై ఉమ్మడి జిల్లా స్థాయి పదవిపై కన్నేసి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
పీఏసీఎస్ డైరెక్టర్, చైర్మన్ అభ్యర్థులను టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జులు ఖరారు చేయగా, డీసీసీబీ చైర్మన్ అభ్యర్థుల పేర్లను మాత్రం సీఎం కేసీఆర్ ఖరారు చేయనున్నారు. ఈ నేపథ్యంలో పూర్వపు ఉమ్మడి జిల్లాల వారీగా డీసీసీబీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న నేతల జాబితాను ఇవ్వాల్సిందిగా సంబంధిత జిల్లా మంత్రులను ఆదేశించారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో చర్చించి ఆశావహుల జాబితాను సిద్ధం చేయాలని మంత్రులను ఆదేశించినట్లు సమాచారం. డీసీసీబీ అధ్యక్ష పదవి దక్కని నేతలు కొందరికి జిల్లా కేంద్ర సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) చైర్మన్ పదవిని ఇవ్వడం ద్వారా సంతృప్తి పరచాలనే యోచనలో పార్టీ ఉన్నట్లు సమాచారం.
కరీంనగర్‌లో కొండూరుకు!
టెస్కాబ్ తాజా మాజీ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు కరీంనగర్ డీసీసీబీ అధ్యక్ష పదవికి దాదాపు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. టెస్కాబ్ చైర్మన్ పదవిని ఆశిస్తూ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తనయుడు పోచారం భాస్కర్‌రెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారు. వీరితో పాటు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా తండ్రి కృష్ణమూర్తి గుప్తా, రమేశ్‌రెడ్డి, గిర్దావర్ గంగారెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఆదిలాబాద్ నుంచి రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు అడ్డి బోజారెడ్డితో పాటు డీసీసీబీ తాజా మాజీ అధ్యక్షులు దామోదర్‌రెడ్డి, గోవర్దన్‌రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు.
వరంగల్ డీసీసీబీ పీఠాన్ని మార్నేని రవీందర్‌రావుతో పాటు గుండేటి రాజేశ్వర్‌రెడ్డి, చల్లా రాంరెడ్డి, మోటపోతుల జీవన్ ఆశిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో తుళ్లూరు బ్రహ్మయ్య, సత్వాల శ్రీనివాస్‌రావు (ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు మేనల్లుడు), తాజా మాజీ డీసీసీబీ అధ్యక్షులు మువ్వా విజయ్‌బాబు, కూరాకుల నాగభూషణం ప్రయత్నాలు సాగిస్తున్నారు. జిల్లాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి అందే ప్రతిపాదనలను పరిశీలించి సామాజిక సమీకరణాలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని డీసీసీబీ అధ్యక్షుల పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేయనున్నారు.
టెస్కాబ్ బరిలో..
రాష్ట్ర సహకార సంఘాల సమాఖ్య (టెస్కాబ్) చైర్మన్ పదవిని ఆశిస్తున్న కొందరు నేతలు డీసీసీబీ చైర్మన్ పదవి కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. టెస్కాబ్ చైర్మన్ పదవిని ఆశిస్తున్న టీఆర్‌ఎస్ నేతల జాబితాలో ప్రధానంగా కొండూరు రవీందర్‌రావు (కరీంనగర్), పోచారం భాస్కర్‌రెడ్డి (నిజామాబాద్), పల్లా ప్రవీణ్‌రెడ్డి (నల్లగొండ) ఉన్నారు. డీసీసీబీ చైర్మన్ పీఠాల విషయానికి వస్తే నల్లగొండ నుంచి పల్లా ప్రవీణ్‌రెడ్డి, గొంగిడి మహేందర్‌రెడ్డి (ఆలేరు ఎమ్మెల్యే సునీత భర్త), మల్లేశ్ గౌడ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మహబూబ్‌నగర్ నుంచి గురునాథ్‌రెడ్డి పేరు వినిపిస్తోంది. మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి, జూపల్లి భాస్కర్‌రావు పేర్లను పార్టీ ఎమ్మెల్యేలు కొందరు ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం.
డీసీసీబీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్
పాత జిల్లాల ప్రాతిపదికనే ఎన్నికలు
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) అధ్యక్షుల ఎన్నికకు సోమవారం నోటిఫికేషన్ జారీ కానుందని రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ వర్గాలు వెల్లడించాయి. డీసీసీబీ అధ్యక్షుల ఎన్నిక ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికనే జరగనుంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు (ప్యాక్స్) ఎన్నికైన చైర్మన్లు డీసీసీబీ అధ్యక్షులను ఎన్నుకుంటారు. ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం డీసీసీబీ, డీసీఎంఎస్‌లకు ఒక్కో వ్యవస్థకు 20 మంది డైరెక్టర్లను ఎన్నుకుంటారు. ఈ ప్రక్రియను ఈ నెల 24వ తేదీకల్లా పూర్తి చేయనున్నట్లు రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment