Cooperative Department
-
16 మంది పీఏసీఎస్‌ల కార్యదర్శులపై వేటు
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీ లబ్ధిదారుల ఎంపిక విషయంలో అవకతవకలకు పాల్పడిన ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్‌లు) కార్యదర్శులపై.. రాష్ట్ర సహకార శాఖ చర్యలు చేపడుతోంది. పంట రుణాల మంజూరు, వాటి రెన్యువల్‌కు సంబంధించిన సమాచారాన్ని అసంబద్ధంగా పంపారనే కారణంతో 16 మంది పీఏసీఎస్‌ల కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇందులో 11 పీఏసీఎస్‌లు వాణిజ్య బ్యాంకుల ఆర్థిక సహకారంతో కొనసాగు తుండగా, మిగతా 5 పీఏసీఎస్‌లు డీసీసీబీ ఆర్థిక సాయంతో కొనసాగు తున్నాయి. మరో 13 పీఏసీఎస్‌ల కార్యదర్శులపైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సహకార శాఖ డైరెక్టరేట్.. వారిపై క్రమశిక్షణ చర్యలకు సిఫారసు చేసింది. అదేవిధంగా మరో 92 పీఏసీఎస్‌లకు సంబంధించి కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తక్షణమే స్పందించాలని ఆదేశించింది. బకాయిలు, వడ్డీ లెక్కల్లో తప్పులు!రాష్ట్ర వ్యాప్తంగా 105 పరపతి సంఘాల్లో రుణాలు తీసుకున్న రైతుల వివరాల్లో పెద్ద ఎత్తున తప్పులు దొర్లినట్లు అధికారులు గుర్తించారు. పంట రుణమాఫీ మార్గదర్శకాల ప్రకారం.. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9వ తేదీ మధ్యలో రుణాలు పొందిన రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు. అయితే 16 పీఏసీఎస్‌లు నిర్ణీత వ్యవధి మధ్యలో లేని వారిని కూడా పంట రుణమాఫీకి అర్హులుగా గుర్తించి పంపినట్లు వెల్లడైంది. పలు పీఏసీఎస్‌ల్లో రైతుల రుణ బకాయిలు, వడ్డీ లెక్కించడంలో పెద్ద ఎత్తున పొరపాట్లు దొర్లినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే సహకార శాఖ ఉన్నతాధికారులు ఆయా పీఏసీఎస్‌ల కార్యదర్శుల సంజాయిషీ కోరారు. వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా సహకార అధికారులను సహకార శాఖ డైరెక్టరేట్ ఆదేశించింది. ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా భవిష్యత్తులో అప్రమత్తంగా ఉండాలని, పీఏసీఎస్‌ల కార్యదర్శులను సహకార శాఖ రిజిస్ట్రార్ ఆదేశించారు. -
'ఢీ'సీసీబీ
సాక్షి, హైదరాబాద్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) పాలక మండళ్లకు శనివారం ఎన్నిక జరిగి ఫలితాలు వెలువడగా, కొత్తగా ఎన్నికైన డైరెక్టర్లు ఆదివారం సొసైటీలకు చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకున్నారు. పీఏసీఎస్ స్థాయిలో ఎన్నికలు ముగియడంతో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) పాలక మండలి ఎన్నిక నిర్వహణకు సహకార శాఖ కసరత్తు చేస్తోంది. సహకార శాఖ కమిషనర్ అధ్యక్షతన సోమవారం జరిగే సమావేశంలో డీసీసీబీ పాలక మండలి ఎన్నిక షెడ్యూలు విడుదల కానుంది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పాలక మండలి ఎన్నికలో ఏ క్లాస్ (పీఏసీఎస్ చైర్మన్లు), బీ క్లాస్ (గొర్రెల కాపరులు, మత్స్య తదితర సహకార సంఘాలు) సొసైటీల చైర్మన్లకు ఓటు హక్కు అవకాశం ఉంటుంది. దీంతో పూర్వపు ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన హైదరాబాద్‌ను మినహాయించి మిగతా తొమ్మిది జిల్లాల్లోనూ ఏ, బీ క్లాస్ సొసైటీ చైర్మన్ల జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పీఏసీఎస్ చైర్మన్లుగా గెలిచి డీసీసీబీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ తదితర పాలక మండలి పోస్టులను ఆశిస్తున్న టీఆర్ఎస్ ఆశావహ నేతలు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అన్నీ టీఆర్ఎస్ ఖాతాలోకే? సహకార ఎన్నికల్లో 90%కు పైగా పీఏసీఎస్ డైరెక్టర్ స్థానాల్లో టీఆర్ఎస్ మద్దతుదారులే గెలుపొందారు. దీంతో ఆదివారం జరిగిన పీఏసీఎస్ చైర్మన్ పదవులు కూడా 90% మేర టీఆర్ఎస్ మద్దతుదారులకే దక్కాయి. దీంతో పూర్వపు ఉమ్మడి జిల్లా పరిధిలో మెజారిటీ సొసైటీ పీఠాలు టీఆర్ఎస్ మద్దతుదారులకు దక్కడంతో తొమ్మిది డీసీసీబీలు టీఆర్ఎస్ మద్దుతుదారులకే దక్కుతాయని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో డీసీసీబీ పీఠాలను ఆశిస్తున్న టీఆర్ఎస్ ఆశావహ నేతలు పీఏసీఎస్ సొసైటీ చైర్మన్లుగా ఎంపికై ఉమ్మడి జిల్లా స్థాయి పదవిపై కన్నేసి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. పీఏసీఎస్ డైరెక్టర్, చైర్మన్ అభ్యర్థులను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జులు ఖరారు చేయగా, డీసీసీబీ చైర్మన్ అభ్యర్థుల పేర్లను మాత్రం సీఎం కేసీఆర్ ఖరారు చేయనున్నారు. ఈ నేపథ్యంలో పూర్వపు ఉమ్మడి జిల్లాల వారీగా డీసీసీబీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న నేతల జాబితాను ఇవ్వాల్సిందిగా సంబంధిత జిల్లా మంత్రులను ఆదేశించారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో చర్చించి ఆశావహుల జాబితాను సిద్ధం చేయాలని మంత్రులను ఆదేశించినట్లు సమాచారం. డీసీసీబీ అధ్యక్ష పదవి దక్కని నేతలు కొందరికి జిల్లా కేంద్ర సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) చైర్మన్ పదవిని ఇవ్వడం ద్వారా సంతృప్తి పరచాలనే యోచనలో పార్టీ ఉన్నట్లు సమాచారం. కరీంనగర్లో కొండూరుకు! టెస్కాబ్ తాజా మాజీ చైర్మన్ కొండూరు రవీందర్రావు కరీంనగర్ డీసీసీబీ అధ్యక్ష పదవికి దాదాపు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. టెస్కాబ్ చైర్మన్ పదవిని ఆశిస్తూ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తనయుడు పోచారం భాస్కర్‌రెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారు. వీరితో పాటు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా తండ్రి కృష్ణమూర్తి గుప్తా, రమేశ్‌రెడ్డి, గిర్దావర్ గంగారెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఆదిలాబాద్ నుంచి రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు అడ్డి బోజారెడ్డితో పాటు డీసీసీబీ తాజా మాజీ అధ్యక్షులు దామోదర్‌రెడ్డి, గోవర్దన్‌రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. వరంగల్ డీసీసీబీ పీఠాన్ని మార్నేని రవీందర్‌రావుతో పాటు గుండేటి రాజేశ్వర్‌రెడ్డి, చల్లా రాంరెడ్డి, మోటపోతుల జీవన్ ఆశిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో తుళ్లూరు బ్రహ్మయ్య, సత్వాల శ్రీనివాస్‌రావు (ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్రావు మేనల్లుడు), తాజా మాజీ డీసీసీబీ అధ్యక్షులు మువ్వా విజయ్‌బాబు, కూరాకుల నాగభూషణం ప్రయత్నాలు సాగిస్తున్నారు. జిల్లాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి అందే ప్రతిపాదనలను పరిశీలించి సామాజిక సమీకరణాలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని డీసీసీబీ అధ్యక్షుల పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేయనున్నారు. టెస్కాబ్ బరిలో.. రాష్ట్ర సహకార సంఘాల సమాఖ్య (టెస్కాబ్) చైర్మన్ పదవిని ఆశిస్తున్న కొందరు నేతలు డీసీసీబీ చైర్మన్ పదవి కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. టెస్కాబ్ చైర్మన్ పదవిని ఆశిస్తున్న టీఆర్ఎస్ నేతల జాబితాలో ప్రధానంగా కొండూరు రవీందర్రావు (కరీంనగర్), పోచారం భాస్కర్‌రెడ్డి (నిజామాబాద్), పల్లా ప్రవీణ్‌రెడ్డి (నల్లగొండ) ఉన్నారు. డీసీసీబీ చైర్మన్ పీఠాల విషయానికి వస్తే నల్లగొండ నుంచి పల్లా ప్రవీణ్‌రెడ్డి, గొంగిడి మహేందర్‌రెడ్డి (ఆలేరు ఎమ్మెల్యే సునీత భర్త), మల్లేశ్ గౌడ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మహబూబ్‌నగర్ నుంచి గురునాథ్‌రెడ్డి పేరు వినిపిస్తోంది. మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి, జూపల్లి భాస్కర్‌రావు పేర్లను పార్టీ ఎమ్మెల్యేలు కొందరు ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. డీసీసీబీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ పాత జిల్లాల ప్రాతిపదికనే ఎన్నికలు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) అధ్యక్షుల ఎన్నికకు సోమవారం నోటిఫికేషన్ జారీ కానుందని రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ వర్గాలు వెల్లడించాయి. డీసీసీబీ అధ్యక్షుల ఎన్నిక ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికనే జరగనుంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు (ప్యాక్స్) ఎన్నికైన చైర్మన్లు డీసీసీబీ అధ్యక్షులను ఎన్నుకుంటారు. ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం డీసీసీబీ, డీసీఎంఎస్‌లకు ఒక్కో వ్యవస్థకు 20 మంది డైరెక్టర్లను ఎన్నుకుంటారు. ఈ ప్రక్రియను ఈ నెల 24వ తేదీకల్లా పూర్తి చేయనున్నట్లు రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ వర్గాలు తెలిపాయి. -
మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల్లో సగం మహిళలకే
సాక్షి, అమరావతి: వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్ పదవుల్లో మహిళలకు సగం ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. మార్కెట్ కమిటీ సభ్యుల్లో కూడా సగం వారికే కేటాయించాలని స్పష్టం చేశారు. మార్కెటింగ్, సహకార శాఖలపై గురువారం ఆయన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ధరల స్థిరీకరణ, మార్కెట్ యార్డుల్లో కనీస సదుపాయాలు, చిరు ధాన్యాల బోర్డు ఏర్పాటు, సహకార రంగం పటిష్టత అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవుల్లో సగం మహిళలకు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ నెలాఖరులోగా మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. కాగా, ఇప్పటికే జారీ చేసిన జీవో మేరకు ఈ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. ఈ సమీక్షలో మంత్రులు కన్నబాబు, మోపిదేవి వెంకటరమణతో పాటు సంబంధిత ఉన్నతాధికారులు పాల్లొన్నారు. -
ముందే 'మద్దతు'
ప్రభుత్వం జోక్యం చేసుకున్న తర్వాత పరిస్థితి కచ్చితంగా మారాల్సిందేనని, రైతులకు భరోసా ఇచ్చామన్న నమ్మకం కలగాలని స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయి వరకు అది జరగాలని చెప్పారు. ఆరు నెలల్లోగా దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు అధికారులు సవాలుగా తీసుకుని పని చేయాలని ఆదేశించారు. రైతుల ప్రయోజనమే లక్ష్యంగా మార్కెటింగ్ విధానాలు ఉండాలని, గ్రామ సచివాలయాల్లోనే క్రాప్ వివరాలు, ధరలు ప్రకటించాలని.. రైతులు నేరుగా ఫోన్ చేసి సహాయం అడిగే అవకాశం ఉండాలని చెప్పారు. దీనివల్ల ప్రైవేట్ వ్యక్తులు కూడా మంచి ధరలకు రైతుల నుంచి పంట కొనుగోలు చేస్తారని, ఇ–క్రాప్ నమోదుపై వలంటీర్ల ద్వారా రైతులకు సమాచారం ఇవ్వాలని, గ్రామ సచివాలయాల్లో డిస్ప్లే బోర్డులు ఉంచాలని సీఎం సూచించారు. కనీస మద్దతు ధర లేని పంటలకు ధరలు ప్రకటించాలని, రైతుకు నష్టం రాకుండా ఈ ధరలు నిర్ణయించాలని స్పష్టం చేశారు. పంటల దిగుబడి ఏ స్థాయిలో ఉంటాయన్న దానిపై అంచనాలు రూపొందించాలని, గత ఏడాదితో పోల్చి ఈ వివరాలు తయారు చేయాలని ఆదేశించారు. మార్కెట్లపై నిరంతర సమాచారం మూడు మార్గాల్లో వ్యవసాయ ఉత్పత్తులు, వాటికున్న డిమాండ్, వివిధ ప్రాంతాల్లో ధరలపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలని, ఇప్పుడున్న అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలు, అగ్రివాచ్ సహా మరో ఏజెన్సీ ఏర్పాటుకు గత సమీక్షలో తీసుకున్న నిర్ణయంపై ప్రతిపాదనలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వ్యవసాయ ఉత్పత్తుల భవిష్యత్ ధరలు, బిజినెస్ కన్సల్టెన్సీ, ధరల స్థిరీకరణ నిధి నిర్వహణ, వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువ జోడించడం ఈ ఏజెన్సీ విధులుగా ఉండాలని ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. ఇందులోనూ నిపుణులు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ కోసం ఇప్పుడున్న గోడౌన్లు, కోల్డ్ స్టోరేజీలపై సమగ్ర పరిశీలన చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న అవసరాలు, వాటిని తీర్చేలా గోడౌన్లు, కోల్డ్ స్టోరేజీలపై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. చేపలు, ఇతర సముద్ర ఉత్పత్తుల కోసం ఎన్ని కోల్డ్ స్టోరేజీలు ఉండాలన్న దానిపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. ఇందుకు ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ఆలోచించాలని సూచించారు. సహకార రంగాన్ని పునర్ వ్యవస్థీకరించాలి జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల నష్టాలను అధ్యయనం చేసేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులను తిరిగి బలోపేతం చేయడంపై కార్యాచరణ ప్రణాళిక ఇవ్వాలన్నారు. ప్రస్తుతం ఉన్న సమస్యలు, వాటిని పరిష్కరించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి అందులో సమగ్రంగా ఉండాలని సూచించారు. అవినీతి, పక్షపాతానికి తావులేని విధానం ఉండాలని, సహకార రంగాన్ని పూర్తి స్థాయిలో పునర్ వ్యవస్థీకరించాలని స్పష్టం చేశారు. ఈ వ్యవస్థను బాగు చేయడానికి ఏం చేయాలో అది చేద్దామని, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను కంప్యూటరీకరించే దిశగా చర్యలు తీసుకుంటామని, ప్రతిష్టాత్మక సంస్థతో సమగ్ర పరిశీలన, అధ్యయనం చేయించాలని సీఎం పేర్కొన్నారు. ఆప్కో పునరుద్ధరణ, బలోపేతంపై కూడా అధ్యయనం చేయించాలని, ఆరు నెలల్లో సిఫార్సుల అమలు ప్రారంభంకావాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షలో మంత్రులు కన్నబాబు, మోపిదేవి వెంకటరమణతో పాటు సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ జోక్యంతో మార్కెట్లో ధరల స్థిరీకరణ రాష్ట్రంలో 85 రైతు బజార్లలో కిలో రూ.25 చొప్పున ఉల్లిపాయలు విక్రయిస్తున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. 660 మెట్రిక్ టన్నులు వినియోగదారులకు ఇచ్చామని, కిలో ఉల్లి ధరను రూ.32కు అదుపు చేయగలిగామని వివరించారు. మళ్లీ ధరలు పెరిగిన క్రమంలో ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. రాష్ట్రంలో ఇప్పుడు సరిపడా నిల్వలు ఉన్నాయా? లేదా? అని ఆరా తీయగా సరిపడా నిల్వలు ఉన్నాయని అధికారులు తెలిపారు. టమాటా రైతులను కూడా ఆదుకున్నామని, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో మార్కెటింగ్ అవకాశాలు చూసి ఆ మేరకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. పప్పు ధాన్యాల కొనుగోళ్లపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. రైతులు ఈ నెల 10వ తేదీ నుంచి అన్ని ఆరు తడి పంటల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయించుకోవాలని అధికారులు తెలిపారు. ఈ నెల 15 నుంచి కొనుగోలు ప్రారంభిస్తామని చెప్పారు. చిరు ధాన్యాల బోర్డు ఏర్పాటు రాయలసీమ ప్రాంతాన్ని చిరు ధాన్యాల హబ్‌గా రూపొందించాలని, ఈ నెలాఖరులోగా చిరు ధాన్యాల బోర్డును ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. వచ్చే 9 నెలల పాటు గ్రీన్ కవర్ ఉండేలా చూడాలని సూచించారు. చిరుధాన్యాల బోర్డులో సంబంధిత రంగాలకు చెందిన నిపుణులకు పెద్దపీట వేయాలన్నారు. వ్యవసాయ విధానాలు, మార్కెటింగ్, ప్రాసెసింగ్ తదితరాలను బోర్డు పరిధిలోకి తీసుకురావాలన్నారు. బోర్డు విధి విధానాలపై కూడా చర్చించారు. ►రైతుల ప్రయోజనమే లక్ష్యంగా మార్కెటింగ్ విధానాలు ఉండాలి. దళారులకు పంటలను తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి రైతులకు రాకూడదు. దళారులు లేకుండా వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలు జరగాలి. అరటి, చీని, మామిడి, కమల, బొప్పాయి సహా ఏ పంట విషయంలోనైనా దళారులు లేకుండా చూడాలి. సీఎం వైఎస్ జగన్ -
కొత్త డీసీసీబీల ఏర్పాటుకు కసరత్తు!
► ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న సహకార శాఖ ► లాభనష్టాల అంచనా ఆధారంగానే ఏర్పాటు! సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాలకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)లను ఏర్పాటు చేయాలని సహకార శాఖ యోచిస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలు తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించింది. కొత్త డీసీసీబీలు ఏర్పాటు చేయాలంటే ప్రస్తుత మున్న వాటి ఆస్తులు, డిపాజిట్లు, రుణాలు, రికవరీ, వ్యాపారం ఆధారంగా విభజించాలి. రిజర్వుబ్యాంకుకు కూడా ప్రతిపాదనలు పంపి దాని ఆమోదం కూడా తీసుకోవాలని భావిస్తు న్నారు. ప్రస్తుతం కొన్ని డీసీసీబీల్లో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కొత్తవాటిని ఏర్పాటు చేయడానికి రిజర్వు బ్యాంకు అంగీకరిస్తుందా లేదా అన్న అను మానాలున్నాయి. జిల్లాల విభజన జరిగి నందున విభజన తప్పనిసరని, విభజనకు తోడ్పడాలని సహకారశాఖ రిజర్వుబ్యాంకును కోరే అవకాశముంది. ఫిబ్రవరికి ముగియనున్న పదవీకాలం సహకార సంఘాలకు ప్రస్తుతమున్న పాలక వర్గాల పదవీకాలం వచ్చే ఫిబ్రవరి నాటికి ముగియనుంది. తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్(టెస్కాబ్) పదవీ కాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 26తో ముగియ నుంది. జిల్లా సహకార మార్కెటింగ్ సమాఖ్య (డీసీఎంఎస్)లు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)ల పదవీకాలం అదే నెల 18న ముగియనుంది. ఇక 906 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(ప్యాక్స్)ల పదవీకాలం అదే నెల మొదటివారంలో ముగియనుంది. 2013లో ఉమ్మడి రాష్ట్రంలో సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించి నప్పుడు తెలంగాణలో 10 జిల్లాలే ఉన్నాయి. ఇప్పుడు వాటి సంఖ్య 31కి పెరిగినందున వాటి ప్రకారం జిల్లా సహకార మార్కెటింగ్ సమాఖ్య(డీసీఎంఎస్), జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)లు ఏర్పాటు చేయాలి. ఈ ప్రక్రియను ఇప్పుడు ప్రారంభిస్తే వచ్చే జనవరి నాటికి పూర్తవుతుంది. విభజన ప్రక్రియ చేపట్టి ఎన్నికలకు వెళ్లకుండా చూడాలన్న అభిప్రా యమూ సర్కారులో ఉన్నట్లు సమాచారం. 2019లో అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నం దున సరిగ్గా ఏడాదిలోపు సహకార సంఘాల ఎన్నికలు నిర్వహిస్తే రాజకీయంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోన్న చర్చ ఉంది. కాబట్టి పర్సన్ ఇన్చార్జులను నియమిస్తేనే బాగుంటుందన్న భావన ప్రభుత్వ వర్గాల్లో నెలకొంది.