
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీ లబ్ధిదారుల ఎంపిక విషయంలో అవకతవకలకు పాల్పడిన ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్‌లు) కార్యదర్శులపై.. రాష్ట్ర సహకార శాఖ చర్యలు చేపడుతోంది. పంట రుణాల మంజూరు, వాటి రెన్యువల్‌కు సంబంధించిన సమాచారాన్ని అసంబద్ధంగా పంపారనే కారణంతో 16 మంది పీఏసీఎస్‌ల కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు వేసింది.
ఇందులో 11 పీఏసీఎస్‌లు వాణిజ్య బ్యాంకుల ఆర్థిక సహకారంతో కొనసాగు తుండగా, మిగతా 5 పీఏసీఎస్‌లు డీసీసీబీ ఆర్థిక సాయంతో కొనసాగు తున్నాయి. మరో 13 పీఏసీఎస్‌ల కార్యదర్శులపైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సహకార శాఖ డైరెక్టరేట్.. వారిపై క్రమశిక్షణ చర్యలకు సిఫారసు చేసింది. అదేవిధంగా మరో 92 పీఏసీఎస్‌లకు సంబంధించి కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తక్షణమే స్పందించాలని ఆదేశించింది.
బకాయిలు, వడ్డీ లెక్కల్లో తప్పులు!
రాష్ట్ర వ్యాప్తంగా 105 పరపతి సంఘాల్లో రుణాలు తీసుకున్న రైతుల వివరాల్లో పెద్ద ఎత్తున తప్పులు దొర్లినట్లు అధికారులు గుర్తించారు. పంట రుణమాఫీ మార్గదర్శకాల ప్రకారం.. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9వ తేదీ మధ్యలో రుణాలు పొందిన రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు. అయితే 16 పీఏసీఎస్‌లు నిర్ణీత వ్యవధి మధ్యలో లేని వారిని కూడా పంట రుణమాఫీకి అర్హులుగా గుర్తించి పంపినట్లు వెల్లడైంది. పలు పీఏసీఎస్‌ల్లో రైతుల రుణ బకాయిలు, వడ్డీ లెక్కించడంలో పెద్ద ఎత్తున పొరపాట్లు దొర్లినట్లు గుర్తించారు.
ఈ నేపథ్యంలోనే సహకార శాఖ ఉన్నతాధికారులు ఆయా పీఏసీఎస్‌ల కార్యదర్శుల సంజాయిషీ కోరారు. వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా సహకార అధికారులను సహకార శాఖ డైరెక్టరేట్ ఆదేశించింది. ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా భవిష్యత్తులో అప్రమత్తంగా ఉండాలని, పీఏసీఎస్‌ల కార్యదర్శులను సహకార శాఖ రిజిస్ట్రార్ ఆదేశించారు.