కొత్త డీసీసీబీల ఏర్పాటుకు కసరత్తు!
► ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న సహకార శాఖ
► లాభనష్టాల అంచనా ఆధారంగానే ఏర్పాటు!
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాలకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)లను ఏర్పాటు చేయాలని సహకార శాఖ యోచిస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలు తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించింది. కొత్త డీసీసీబీలు ఏర్పాటు చేయాలంటే ప్రస్తుత మున్న వాటి ఆస్తులు, డిపాజిట్లు, రుణాలు, రికవరీ, వ్యాపారం ఆధారంగా విభజించాలి.
రిజర్వుబ్యాంకుకు కూడా ప్రతిపాదనలు పంపి దాని ఆమోదం కూడా తీసుకోవాలని భావిస్తు న్నారు. ప్రస్తుతం కొన్ని డీసీసీబీల్లో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కొత్తవాటిని ఏర్పాటు చేయడానికి రిజర్వు బ్యాంకు అంగీకరిస్తుందా లేదా అన్న అను మానాలున్నాయి. జిల్లాల విభజన జరిగి నందున విభజన తప్పనిసరని, విభజనకు తోడ్పడాలని సహకారశాఖ రిజర్వుబ్యాంకును కోరే అవకాశముంది.
ఫిబ్రవరికి ముగియనున్న పదవీకాలం
సహకార సంఘాలకు ప్రస్తుతమున్న పాలక వర్గాల పదవీకాలం వచ్చే ఫిబ్రవరి నాటికి ముగియనుంది. తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్(టెస్కాబ్) పదవీ కాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 26తో ముగియ నుంది. జిల్లా సహకార మార్కెటింగ్ సమాఖ్య (డీసీఎంఎస్)లు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)ల పదవీకాలం అదే నెల 18న ముగియనుంది. ఇక 906 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(ప్యాక్స్)ల పదవీకాలం అదే నెల మొదటివారంలో ముగియనుంది.
2013లో ఉమ్మడి రాష్ట్రంలో సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించి నప్పుడు తెలంగాణలో 10 జిల్లాలే ఉన్నాయి. ఇప్పుడు వాటి సంఖ్య 31కి పెరిగినందున వాటి ప్రకారం జిల్లా సహకార మార్కెటింగ్ సమాఖ్య(డీసీఎంఎస్), జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)లు ఏర్పాటు చేయాలి. ఈ ప్రక్రియను ఇప్పుడు ప్రారంభిస్తే వచ్చే జనవరి నాటికి పూర్తవుతుంది. విభజన ప్రక్రియ చేపట్టి ఎన్నికలకు వెళ్లకుండా చూడాలన్న అభిప్రా యమూ సర్కారులో ఉన్నట్లు సమాచారం. 2019లో అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నం దున సరిగ్గా ఏడాదిలోపు సహకార సంఘాల ఎన్నికలు నిర్వహిస్తే రాజకీయంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోన్న చర్చ ఉంది. కాబట్టి పర్సన్ ఇన్‌చార్జులను నియమిస్తేనే బాగుంటుందన్న భావన ప్రభుత్వ వర్గాల్లో నెలకొంది.