రైతుల ఆస్తులు వేలం | KDCCB is preparing to auction farmers properties | Sakshi
Sakshi News home page

రైతుల ఆస్తులు వేలం

Published Sat, Jan 11 2025 6:06 AM | Last Updated on Sat, Jan 11 2025 6:06 AM

KDCCB is preparing to auction farmers properties

ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నిర్ణయం

కూటమి ప్రభుత్వం వచ్చీ రావడంతోనే స్వాదీనానికి శ్రీకారం 

రైతులకు ముమ్మరంగా సెక్షన్‌–71 కింద నోటీసులు 

మరోవైపు.. ఎగ్జిక్యూషన్‌ పిటిషన్‌లు ఫైల్‌ చేస్తున్న డీసీసీబీ, పీఏసీఎస్‌లు 

జూన్‌ నుంచి డిసెంబరు వరకు 1,457 మంది సెక్షన్‌–71 కింద నోటీసులు 

వ్యవసాయం కలిసిరాక నష్టాల్లో మునిగినా కనికరించని సర్కారు 

కర్నూలు (అగ్రికల్చర్‌): ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (కేడీసీసీబీ) బకాయిలను రాబట్టుకునేందుకు రైతుల ఆస్తులను వేలం వేసేందుకు రంగం సిద్ధంచేస్తున్నారు. రైతులకు అవసరమైన రుణాలను పంపిణీచేసి ఆదుకోవాల్సి ఉండగా.. గతంలో ఎప్పుడూలేని విధంగా ఆ విషయంలో పూర్తిగా వెనుకబడింది. పైగా ఇప్పుడు వారి ఆస్తులను విక్రయించి బకాయిలకు జమచేసుకునేందుకు న్యాయ ప్రక్రియ కూడా మొదలుపెట్టింది. 

ఇందులో భాగంగా తాకట్టు పెట్టిన ఆస్తులను వేలంపాట ద్వారా విక్రయించే ప్రక్రియను జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, పీఏసీఎస్‌లు ముమ్మరం చేశాయి. ఈ ఏడాది జూన్‌ నుంచి ఒకవైపు సెక్షన్‌–71 కింద నోటీసులివ్వడం, మరోవైపు ఎగ్జిక్యూషన్‌ పిటిషన్‌ (ఈపీ) పైల్‌చేయడం వంటివి  జరుగుతున్నాయి. అలాగే, 2024 జూన్‌ నుంచి డిసెంబరు వరకు రూ.122.82 కోట్ల బకాయిలను రాబట్టుకునేందుకు 1,457 మంది రైతులకు సహకార చట్టం సెక్షన్‌–71 కింద నోటీసులు ఇచ్చారు. 

ఇదే సమయంలో 522 మంది రైతుల నుంచి రూ.41.92 కోట్లను రాబట్టేందుకు ఈపీలు కూడా దాఖలు చేశారు. ఆస్తుల అమ్మకానికి డిక్రీ కూడా చేయడం గమనార్హం. నిజానికి.. ఈ ఏడాది అన్ని రకాలుగా వ్యవసాయం కలిసిరాక నష్టాల బారిన పడినా రైతుల ఆస్తుల విక్రయాలకు డీసీసీబీ రంగం సిద్ధంచేయడంపట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  

నాటి రోజులు మళ్లీ పునరావృతం.. 
2014–15 నుంచి 2018–19 వరకు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, పీఏసీఎస్‌లు పాత బకాయిలను రాబట్టుకునేందుకు రైతుల జీవితాలతో చెలగాటమాడాయి. మళ్లీ అదే పరిస్థితి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోను పునరావృతమవుతోంది. బకాయిలు పేరుకుపోవడానికి బ్యాంకు, పీఏసీఎస్‌ సిబ్బంది అవినీతి అక్రమాలే కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వల్పకాలిక రుణమైన, దీర్ఘకాలిక రుణమైన రైతులు కమీషన్లు ఇచ్చుకోకపోతే రుణాలిచ్చే పరిస్థితిలేదు. 

వెరిఫికేషన్‌ కోసం వెళ్లే అధికారులకూ ముడుపులు సమర్పించాల్సిందే. రూ.లక్ష రుణం తీసుకుంటే చేతికి వచ్చేది రూ.80 వేలే. రికవరీ మాత్రం రూ.లక్ష చేయాల్సిందే. ఈ కారణాలతోనే అనేకమంది రైతులు రుణాలు తిరిగి చెల్లించలేకపోతున్నారు.  దీంతో వీరి ఆస్తుల వేలంపాట ద్వారా విక్రయించి బకాయిలు జమచేసుకుంటున్నారు.  

రూ.5 కోట్లు రుణాలు ఇస్తే ఒట్టు.. 
2024–25 ఆర్థిక సంవత్సరంలో రుణాల పంపిణీ కోసం ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు బ్రాంచీలకు, పీఏసీఎస్‌లకు రూ.330 కోట్ల బడ్జెట్‌ ఇచ్చిoది. ఈ బడ్జెట్‌ పూర్తయితే అదనంగా ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉంది. దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాల పంపిణీకి ఈ బడ్జెట్‌ని వినియోగించాలి. బడ్జెట్‌ దండిగా ఉన్నప్పటికీ రుణాల పంపిణీ మాత్రం పెద్దగాలేదు. 

వాణిజ్య బ్యాంకులకు రైతులు పోటెత్తుతుంటే  జిల్లా సహకార కేంద్ర బ్యాంకు బ్రాంచీల్లో మాత్రం అందుకు విరుద్ధమైన పరిస్థితి కనిపిస్తోంది. ప్రతిఏటా జూలై నుంచి నవంబరు లేదా డిసెంబరు మూడవ వారం వరకే రుణాలు పంపిణీ చేస్తారు. ఆ తర్వాత రికవరీపై దృష్టిసారిస్తారు. ఈ నేపథ్యంలో.. రుణాల పంపిణీకి ఇంత పెద్ద మొత్తం కేటాయించినప్పటికీ ఇప్పటివరకు రుణాల పంపిణీ రూ.5 కోట్లలోపే ఉండటం గమనార్హం.  

లాభాల బాట పట్టించిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం.. 
నష్టాల ఊబిలో చిక్కుకున్న కర్నూలు డీసీసీబీకి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఊపిరిపోసింది. వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు కేడీసీసీబీ రుణాలు పంపిణీచేసే ఏర్పాటుచేసింది. కస్టమ్స్‌ హయ్యరింగ్‌ సెంటర్లు, మల్టీపర్పస్‌ గోదాముల నిర్మాణాలకు డీసీసీబీ రుణాలు అందజేసింది. 

గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ఫలితంగా బ్యాంకు లోనింగ్‌ భారీగా పెరిగింది. వైఎస్సార్‌సీపీ హయాంలో దశాబ్దాల నాటి నష్టాలను అధిగమించి నికర లాభాల్లోకి వచి్చంది. 2022–23, 2023–24 సంవత్సరాల్లో గణనీయమైన నికర ఆదాయం  పొందింది. 

రికార్డు స్థాయిలో ఏకంగా రూ.10 కోట్లు లాభం ఆర్జించగా.. సభ్యులైన పీఏసీఎస్‌లకు రూ.4 కోట్లు డివిడెండ్‌ ఇచ్చిoది. రాయలసీమ జిల్లాల్లోనే అత్యధిక టర్నోవర్‌ కలిగిన బ్యాంకుగా వరుసగా రెండేళ్లు అవార్డు కూడా అందుకుంది. నికర లాభాల్లోకి వచ్చిన కేడీసీసీబీ మళ్లీ నష్టాల్లోకి వచ్చి బలహీనమైన బ్యాంకుగా రికార్డు నమోదుచేసుకోవడం ఆందోళన కలిగించే విషయం.  

రైతుల ఆస్తుల స్వాధీనానికి రంగం సిద్ధం.. 
ఇక కల్లూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో బకాయిపడిన రైతులు 70 మందికి జూన్‌ నుంచి సెక్షన్‌–71 కింద నోటీసులిచ్చారు. తర్వాత 30 మంది రైతులకు ఈపీ దాఖలు చేశారు. 

కొంతమంది బకాయిలు చెల్లించారు. 20 మంది రైతులు స్పందించకపోవడంతో వారి ఆస్తుల వేలానికి చర్యలు తీసుకున్నారు. దీంతో 13 మంది రైతులు బకాయిలు చెల్లించారు. ఇక ఏడుగురు స్పందించకపోవడంతో వారి ఆస్తులను పీఏసీఎస్‌ పరం చేసుకోవడానికి చర్యలు చేపట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement