kdccb
-
రైతుల ఆస్తులు వేలం
కర్నూలు (అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (కేడీసీసీబీ) బకాయిలను రాబట్టుకునేందుకు రైతుల ఆస్తులను వేలం వేసేందుకు రంగం సిద్ధంచేస్తున్నారు. రైతులకు అవసరమైన రుణాలను పంపిణీచేసి ఆదుకోవాల్సి ఉండగా.. గతంలో ఎప్పుడూలేని విధంగా ఆ విషయంలో పూర్తిగా వెనుకబడింది. పైగా ఇప్పుడు వారి ఆస్తులను విక్రయించి బకాయిలకు జమచేసుకునేందుకు న్యాయ ప్రక్రియ కూడా మొదలుపెట్టింది. ఇందులో భాగంగా తాకట్టు పెట్టిన ఆస్తులను వేలంపాట ద్వారా విక్రయించే ప్రక్రియను జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, పీఏసీఎస్‌లు ముమ్మరం చేశాయి. ఈ ఏడాది జూన్ నుంచి ఒకవైపు సెక్షన్–71 కింద నోటీసులివ్వడం, మరోవైపు ఎగ్జిక్యూషన్ పిటిషన్ (ఈపీ) పైల్చేయడం వంటివి జరుగుతున్నాయి. అలాగే, 2024 జూన్ నుంచి డిసెంబరు వరకు రూ.122.82 కోట్ల బకాయిలను రాబట్టుకునేందుకు 1,457 మంది రైతులకు సహకార చట్టం సెక్షన్–71 కింద నోటీసులు ఇచ్చారు. ఇదే సమయంలో 522 మంది రైతుల నుంచి రూ.41.92 కోట్లను రాబట్టేందుకు ఈపీలు కూడా దాఖలు చేశారు. ఆస్తుల అమ్మకానికి డిక్రీ కూడా చేయడం గమనార్హం. నిజానికి.. ఈ ఏడాది అన్ని రకాలుగా వ్యవసాయం కలిసిరాక నష్టాల బారిన పడినా రైతుల ఆస్తుల విక్రయాలకు డీసీసీబీ రంగం సిద్ధంచేయడంపట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాటి రోజులు మళ్లీ పునరావృతం.. 2014–15 నుంచి 2018–19 వరకు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, పీఏసీఎస్‌లు పాత బకాయిలను రాబట్టుకునేందుకు రైతుల జీవితాలతో చెలగాటమాడాయి. మళ్లీ అదే పరిస్థితి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోను పునరావృతమవుతోంది. బకాయిలు పేరుకుపోవడానికి బ్యాంకు, పీఏసీఎస్ సిబ్బంది అవినీతి అక్రమాలే కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వల్పకాలిక రుణమైన, దీర్ఘకాలిక రుణమైన రైతులు కమీషన్లు ఇచ్చుకోకపోతే రుణాలిచ్చే పరిస్థితిలేదు. వెరిఫికేషన్ కోసం వెళ్లే అధికారులకూ ముడుపులు సమర్పించాల్సిందే. రూ.లక్ష రుణం తీసుకుంటే చేతికి వచ్చేది రూ.80 వేలే. రికవరీ మాత్రం రూ.లక్ష చేయాల్సిందే. ఈ కారణాలతోనే అనేకమంది రైతులు రుణాలు తిరిగి చెల్లించలేకపోతున్నారు. దీంతో వీరి ఆస్తుల వేలంపాట ద్వారా విక్రయించి బకాయిలు జమచేసుకుంటున్నారు. రూ.5 కోట్లు రుణాలు ఇస్తే ఒట్టు.. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రుణాల పంపిణీ కోసం ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు బ్రాంచీలకు, పీఏసీఎస్‌లకు రూ.330 కోట్ల బడ్జెట్ ఇచ్చిoది. ఈ బడ్జెట్ పూర్తయితే అదనంగా ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉంది. దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాల పంపిణీకి ఈ బడ్జెట్‌ని వినియోగించాలి. బడ్జెట్ దండిగా ఉన్నప్పటికీ రుణాల పంపిణీ మాత్రం పెద్దగాలేదు. వాణిజ్య బ్యాంకులకు రైతులు పోటెత్తుతుంటే జిల్లా సహకార కేంద్ర బ్యాంకు బ్రాంచీల్లో మాత్రం అందుకు విరుద్ధమైన పరిస్థితి కనిపిస్తోంది. ప్రతిఏటా జూలై నుంచి నవంబరు లేదా డిసెంబరు మూడవ వారం వరకే రుణాలు పంపిణీ చేస్తారు. ఆ తర్వాత రికవరీపై దృష్టిసారిస్తారు. ఈ నేపథ్యంలో.. రుణాల పంపిణీకి ఇంత పెద్ద మొత్తం కేటాయించినప్పటికీ ఇప్పటివరకు రుణాల పంపిణీ రూ.5 కోట్లలోపే ఉండటం గమనార్హం. లాభాల బాట పట్టించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. నష్టాల ఊబిలో చిక్కుకున్న కర్నూలు డీసీసీబీకి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఊపిరిపోసింది. వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు కేడీసీసీబీ రుణాలు పంపిణీచేసే ఏర్పాటుచేసింది. కస్టమ్స్ హయ్యరింగ్ సెంటర్లు, మల్టీపర్పస్ గోదాముల నిర్మాణాలకు డీసీసీబీ రుణాలు అందజేసింది. గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ఫలితంగా బ్యాంకు లోనింగ్ భారీగా పెరిగింది. వైఎస్సార్సీపీ హయాంలో దశాబ్దాల నాటి నష్టాలను అధిగమించి నికర లాభాల్లోకి వచి్చంది. 2022–23, 2023–24 సంవత్సరాల్లో గణనీయమైన నికర ఆదాయం పొందింది. రికార్డు స్థాయిలో ఏకంగా రూ.10 కోట్లు లాభం ఆర్జించగా.. సభ్యులైన పీఏసీఎస్‌లకు రూ.4 కోట్లు డివిడెండ్ ఇచ్చిoది. రాయలసీమ జిల్లాల్లోనే అత్యధిక టర్నోవర్ కలిగిన బ్యాంకుగా వరుసగా రెండేళ్లు అవార్డు కూడా అందుకుంది. నికర లాభాల్లోకి వచ్చిన కేడీసీసీబీ మళ్లీ నష్టాల్లోకి వచ్చి బలహీనమైన బ్యాంకుగా రికార్డు నమోదుచేసుకోవడం ఆందోళన కలిగించే విషయం. రైతుల ఆస్తుల స్వాధీనానికి రంగం సిద్ధం.. ఇక కల్లూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో బకాయిపడిన రైతులు 70 మందికి జూన్ నుంచి సెక్షన్–71 కింద నోటీసులిచ్చారు. తర్వాత 30 మంది రైతులకు ఈపీ దాఖలు చేశారు. కొంతమంది బకాయిలు చెల్లించారు. 20 మంది రైతులు స్పందించకపోవడంతో వారి ఆస్తుల వేలానికి చర్యలు తీసుకున్నారు. దీంతో 13 మంది రైతులు బకాయిలు చెల్లించారు. ఇక ఏడుగురు స్పందించకపోవడంతో వారి ఆస్తులను పీఏసీఎస్ పరం చేసుకోవడానికి చర్యలు చేపట్టారు. -
ఏడోసారి ఉత్తమ జాతీయ సహకార బ్యాంకుగా కేడీసీసీబీ ఎంపిక!
కరీంనగర్: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మరో కీర్తిని అందుకోంది. ప్రతిష్టాత్మక నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ లిమిటెడ్(నాఫ్స్కాబ్) ఆల్ఇండియా 2020–21కు గానూ రెండవ, 2021–22కు గానూ మొదటి ఉత్తమ అవార్డులు డీసీసీబీ గెలుచుకుంది. దేశంలో 393 డీసీసీబీలలో కరీంనగర్ డీసీసీబీ ఏడో సంవత్సరం ఏడుసార్లు వరుసగా అఖిలభారత అవార్డును కై వసం చేసుకోవడం గమనార్హం. ఈ నెల 26న రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగే కార్యక్రమంలో కేడీసీసీబీ సీఈవో సత్యనారాయణరావు అవార్డులు అందుకోనున్నా రు. జాతీయ అవార్డు లభించడంతో నాబార్డు సీజీ ఎం సుఽశీల, టిస్కాబ్ ఎండీ ఎన్.మురళీధర్ అభినందనలు తెలిపారు. కేడీసీసీబీ చైర్మన్ కొండూరు రవీందర్రావు దార్శనికత, చైతన్యవంతమైన నా యకత్వంలోని బృందంతోనే సాధ్యమైందని కొని యాడారు. దేశంలోని మొత్తం 393 జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో గత మూడేళ్ల పనితీరును విశ్లేషించిన తరువాత దక్షిణ భారతదేశంలో కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లి. ఉత్తమ సహకార బ్యాంకుగా ఎంపిక చేసింది. అవార్డు సాధించినందుకు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సీఈవో సత్యనారాయణరావు బ్యాంకు ఉద్యోగులకు, రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే పలు అవార్డులు కేడీసీసీబీ సొంతం.. కేడీసీసీబీ అందిస్తున్న ఉత్తమ సేవలకు గానూ గతంలోనూ పలు అవార్డులు పొందింది. నేషనల్ ఫెడరేషన్స్ ఆఫ్ కోఆపరేటివ్ బ్యాంకు(నాస్కాబ్) బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డును అందజేసింది. 2015–16 నుంచి వరుసగా ప్రతిష్టాత్మకమైన అవార్డులు సాధి ంచింది. 2015–16లో ద్వితీయ, 2016–17లో తృతీయ, 2017–18లో ద్వితీయ, 2018–19లో ప్రథ మ బహుమతిని కై వసం చేసుకుంది. 2020–21లో ద్వితీయ, 2021–22లో ప్రథమ బహుమతిని అందుకోనుంది. 2018–19 ఏడాదికి గానూ డెమొక్రాటిక్ మేనేజ్మెంట్, గుడ్ గవర్నెన్స్ విభాగంలో చైర్మ న్ రవీందర్రావు ప్రత్యేక అవార్డు అందుకున్నారు. చొప్పదండికి ప్రత్యేక గుర్తింపు.. చొప్పదండి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కూడ జాతీయ అవార్డును కై వసం చేసుకుంది. కరీంనగర్ జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) చొప్పదండి 2021–22 ఆర్థిక సంవత్సరానికి దేశంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన పీఏసీఎస్‌లో నాఫ్క్సాబ్ మొదటి బహుమతిని గెలుచుకుంది. గతంలోనూ 2017–18, 2018–19, 2019–20 ఆర్థిక సంవత్సరాలలో నాఫ్క్సాబ్ జాతీయ అవార్డులను గెలుచుకుంది. -
హ్యాట్రిక్ ‘కొండూరి’..!
సిరిసిల్ల: ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్‌గా జిల్లాకు చెందిన కొండూరి రవీందర్రావు ఎన్నికవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఆయన కేడీసీసీ బ్యాంకు చైర్మన్ కావడం ఇది మూడోసారి. తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు లిమిటెడ్ (టెస్కాబ్) చైర్మన్‌గా రవీందర్రావు ఐదేళ్లుగా కొనసాగుతున్నారు. మరోసారి టెస్కాబ్ చైర్మన్‌గా రవీందర్రావు పేరును సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఈనేపథ్యంలో ఆయన రాష్ట్రస్థాయిలో టెస్కాబ్ చైర్మన్ పదవి కోసం ఇప్పుడు రాష్ట్రస్థాయిలో పోటీ పడుతున్నారు. ఈనెల 5న టెస్కాబ్ చైర్మన్ ఎన్నిక ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే అన్ని జిల్లాల్లోనూ కేడీసీసీ బ్యాంకు చైర్మన్లుగా ఎన్నిక కావడంతో రాష్ట్ర స్థాయిలో టెస్కాబ్ చైర్మన్‌గా రవీందర్రావు ఎన్నిక లాంఛనమే అయింది. 15 ఏళ్లుగా సహకార రంగంలో.. గంభీరావుపేట సహకార సంఘం చైర్మన్‌గా ఎన్నికైన రవీందర్రావు ఉమ్మడి జిల్లా స్థాయిలో మూడోసా రి చైర్మన్‌గా ఎన్నికై హ్యాట్రిక్ సాధించా రు. తొలిసారి 2005 లో గంభీరావుపేట మండలం గజసింగవరం నుంచి డైరెక్టర్‌గా, సింగిల్‌విండో చైర్మన్‌గా ఎన్నికై కేడీసీసీ బ్యాంక్ పదవి అలంకరించారు. ఎన్నికయ్యారు. రెండోసారి 2013లోనూ జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్‌గా ఎన్నికయ్యా రు. 2015లో తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంక్ చైర్మన్‌గా నియమితులయ్యారు. 2019లో అంతర్జాతీయ సహకార బ్యాంక్‌ల సమాఖ్య ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. దేశవ్యాప్తంగా స హకార రంగంలో పనిచేసే ఉద్యోగుల హెచ్ఆర్ పాలసీ అమలు కమిటీకి రవీందర్రావు చైర్మన్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేడీసీసీ బ్యాంక్ చైర్మన్‌గా ఎన్నిక అయ్యారు. 15 ఏళ్లుగా సహకార రంగంలో రవీందర్రావు సేవలు అందిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సహకార బ్యాంకులను బలోపేతం చేయడానికి ఆయన ఎంతో కృషి చేశారు. సహకార సంఘాల ఆధ్వర్యంలో డీజిల్, పెట్రోల్ బంకుల ఏర్పాటు, ప్రతి సహకార సంఘాన్ని బ్యాంకులా మార్చేందుకు ఆయన శ్రమించారు. జిల్లాకు ఆరు డైరెక్టర్ పదవులు... జిల్లాకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయిలో ఆరు డైరెక్టర్ పదవులు లభించాయి. కేడీసీసీబీలో డైరెక్టర్లుగా వుచ్చిడి మోహన్‌రెడ్డి (అల్మాస్పూర్), భూపతి సురేందర్ (కొత్తపల్లి), జల్గం కిషన్‌రావు (సనుగుల), వీరబత్తిని కమలాకర్ (సిరిసిల్ల), ముదిగంటి సురేందర్‌రెడ్డి (నర్సింగా పూర్), గాజుల నారాయణ (సిరిసిల్ల అర్బన్ బ్యాంక్)లకు సహకార డైరెక్టర్లుగా అవకాశం లభించింది. సహకార ఎన్నికల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు సముచిత స్థానం దక్కింది. ఉమ్మడి జిల్లా స్థాయిలో చైర్మన్‌గా రవీందర్రావు ఉండగా... రాష్ట్ర స్థాయిలోనూ టెస్కాబ్ చైర్మన్ అవకాశం ఆయనకే లభించడంతో మరోసారి రాష్ట్ర స్థాయి పదవి రాజన్న సిరిసిల్ల జిల్లాకు లభించింది. పలువురు జిల్లా నాయకులు రవీందర్రావును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. -
సహకార బ్యాంకుల్లో మొబైల్ బ్యాంకింగ్ సేవలు
కరీంనగర్‌అగ్రికల్చర్: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు కరీంనగర్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఏటీఎంను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుతో కలిసి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సోమవారం ప్రారంభించారు. బ్యాంకు సేవలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ సిబ్బందిని పరిచయం చేసుకున్నారు. సమయాభావంతో మాట్లాడకుండానే మరో సమావేశానికి వెళ్లిపోయారు. అనంతరం టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా మొదటిసారిగా 270 సహకార బ్యాంకు బ్రాంచిల్లో మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను సెప్టెంబర్1 నుంచి ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి 50 ఏటీఎం కేంద్రాలు ప్రారంభిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని 35 లక్షలు, జిల్లాలోని 90 వేల మంది రైతులు, ఖాతాదారులందరికీ డెబిట్ కార్డులు అందజేసి వాటి ద్వారానే కార్యకలాపాలు సాగిస్తామని చెప్పారు. ఏటీఏం కేంద్రాల సౌలభ్యం లేని ప్రాంతంలో గల పీఏసీఎస్లన్నింటికీ మైక్రో ఏటీఎం కార్డులందిస్తామన్నారు. నాబార్డు సహకారంతో ఇప్పటికే పైలట్ ప్రాజెక్టులో జిల్లాలో 6 పీఏసీఎస్‌లను కంప్యూటరీకరించామని, త్వరలోనే రాష్ట్రంలోని 907 సంఘాలన్నింటినీ కంప్యూటరీకరించి మెరుగైన సేవలందిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో కేడీసీసీబీ సీఈవో సత్యనారాయణ, టెస్కాబ్ ఉన్నతాధికారి శ్రీనివాసరావు, డెప్యూటీ జనరల్ మేనేజర్లు ఎం.రవీందర్‌రెడ్డి, జి.నారాయణ ఉన్నారు.