సహకార బ్యాంకుల్లో మొబైల్ బ్యాంకింగ్ సేవలు
సహకార బ్యాంకుల్లో మొబైల్ బ్యాంకింగ్ సేవలు
Published Mon, Aug 1 2016 10:41 PM | Last Updated on Thu, Jul 11 2019 5:33 PM
కరీంనగర్‌అగ్రికల్చర్: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు కరీంనగర్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఏటీఎంను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుతో కలిసి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సోమవారం ప్రారంభించారు. బ్యాంకు సేవలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ సిబ్బందిని పరిచయం చేసుకున్నారు. సమయాభావంతో మాట్లాడకుండానే మరో సమావేశానికి వెళ్లిపోయారు. అనంతరం టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా మొదటిసారిగా 270 సహకార బ్యాంకు బ్రాంచిల్లో మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను సెప్టెంబర్1 నుంచి ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి 50 ఏటీఎం కేంద్రాలు ప్రారంభిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని 35 లక్షలు, జిల్లాలోని 90 వేల మంది రైతులు, ఖాతాదారులందరికీ డెబిట్ కార్డులు అందజేసి వాటి ద్వారానే కార్యకలాపాలు సాగిస్తామని చెప్పారు. ఏటీఏం కేంద్రాల సౌలభ్యం లేని ప్రాంతంలో గల పీఏసీఎస్‌లన్నింటికీ మైక్రో ఏటీఎం కార్డులందిస్తామన్నారు. నాబార్డు సహకారంతో ఇప్పటికే పైలట్ ప్రాజెక్టులో జిల్లాలో 6 పీఏసీఎస్‌లను కంప్యూటరీకరించామని, త్వరలోనే రాష్ట్రంలోని 907 సంఘాలన్నింటినీ కంప్యూటరీకరించి మెరుగైన సేవలందిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో కేడీసీసీబీ సీఈవో సత్యనారాయణ, టెస్కాబ్ ఉన్నతాధికారి శ్రీనివాసరావు, డెప్యూటీ జనరల్ మేనేజర్లు ఎం.రవీందర్‌రెడ్డి, జి.నారాయణ ఉన్నారు.
Advertisement