central cooperative bank
-
రైతుల ఆస్తులు వేలం
కర్నూలు (అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (కేడీసీసీబీ) బకాయిలను రాబట్టుకునేందుకు రైతుల ఆస్తులను వేలం వేసేందుకు రంగం సిద్ధంచేస్తున్నారు. రైతులకు అవసరమైన రుణాలను పంపిణీచేసి ఆదుకోవాల్సి ఉండగా.. గతంలో ఎప్పుడూలేని విధంగా ఆ విషయంలో పూర్తిగా వెనుకబడింది. పైగా ఇప్పుడు వారి ఆస్తులను విక్రయించి బకాయిలకు జమచేసుకునేందుకు న్యాయ ప్రక్రియ కూడా మొదలుపెట్టింది. ఇందులో భాగంగా తాకట్టు పెట్టిన ఆస్తులను వేలంపాట ద్వారా విక్రయించే ప్రక్రియను జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, పీఏసీఎస్‌లు ముమ్మరం చేశాయి. ఈ ఏడాది జూన్ నుంచి ఒకవైపు సెక్షన్–71 కింద నోటీసులివ్వడం, మరోవైపు ఎగ్జిక్యూషన్ పిటిషన్ (ఈపీ) పైల్చేయడం వంటివి జరుగుతున్నాయి. అలాగే, 2024 జూన్ నుంచి డిసెంబరు వరకు రూ.122.82 కోట్ల బకాయిలను రాబట్టుకునేందుకు 1,457 మంది రైతులకు సహకార చట్టం సెక్షన్–71 కింద నోటీసులు ఇచ్చారు. ఇదే సమయంలో 522 మంది రైతుల నుంచి రూ.41.92 కోట్లను రాబట్టేందుకు ఈపీలు కూడా దాఖలు చేశారు. ఆస్తుల అమ్మకానికి డిక్రీ కూడా చేయడం గమనార్హం. నిజానికి.. ఈ ఏడాది అన్ని రకాలుగా వ్యవసాయం కలిసిరాక నష్టాల బారిన పడినా రైతుల ఆస్తుల విక్రయాలకు డీసీసీబీ రంగం సిద్ధంచేయడంపట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాటి రోజులు మళ్లీ పునరావృతం.. 2014–15 నుంచి 2018–19 వరకు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, పీఏసీఎస్‌లు పాత బకాయిలను రాబట్టుకునేందుకు రైతుల జీవితాలతో చెలగాటమాడాయి. మళ్లీ అదే పరిస్థితి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోను పునరావృతమవుతోంది. బకాయిలు పేరుకుపోవడానికి బ్యాంకు, పీఏసీఎస్ సిబ్బంది అవినీతి అక్రమాలే కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వల్పకాలిక రుణమైన, దీర్ఘకాలిక రుణమైన రైతులు కమీషన్లు ఇచ్చుకోకపోతే రుణాలిచ్చే పరిస్థితిలేదు. వెరిఫికేషన్ కోసం వెళ్లే అధికారులకూ ముడుపులు సమర్పించాల్సిందే. రూ.లక్ష రుణం తీసుకుంటే చేతికి వచ్చేది రూ.80 వేలే. రికవరీ మాత్రం రూ.లక్ష చేయాల్సిందే. ఈ కారణాలతోనే అనేకమంది రైతులు రుణాలు తిరిగి చెల్లించలేకపోతున్నారు. దీంతో వీరి ఆస్తుల వేలంపాట ద్వారా విక్రయించి బకాయిలు జమచేసుకుంటున్నారు. రూ.5 కోట్లు రుణాలు ఇస్తే ఒట్టు.. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రుణాల పంపిణీ కోసం ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు బ్రాంచీలకు, పీఏసీఎస్‌లకు రూ.330 కోట్ల బడ్జెట్ ఇచ్చిoది. ఈ బడ్జెట్ పూర్తయితే అదనంగా ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉంది. దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాల పంపిణీకి ఈ బడ్జెట్‌ని వినియోగించాలి. బడ్జెట్ దండిగా ఉన్నప్పటికీ రుణాల పంపిణీ మాత్రం పెద్దగాలేదు. వాణిజ్య బ్యాంకులకు రైతులు పోటెత్తుతుంటే జిల్లా సహకార కేంద్ర బ్యాంకు బ్రాంచీల్లో మాత్రం అందుకు విరుద్ధమైన పరిస్థితి కనిపిస్తోంది. ప్రతిఏటా జూలై నుంచి నవంబరు లేదా డిసెంబరు మూడవ వారం వరకే రుణాలు పంపిణీ చేస్తారు. ఆ తర్వాత రికవరీపై దృష్టిసారిస్తారు. ఈ నేపథ్యంలో.. రుణాల పంపిణీకి ఇంత పెద్ద మొత్తం కేటాయించినప్పటికీ ఇప్పటివరకు రుణాల పంపిణీ రూ.5 కోట్లలోపే ఉండటం గమనార్హం. లాభాల బాట పట్టించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. నష్టాల ఊబిలో చిక్కుకున్న కర్నూలు డీసీసీబీకి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఊపిరిపోసింది. వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు కేడీసీసీబీ రుణాలు పంపిణీచేసే ఏర్పాటుచేసింది. కస్టమ్స్ హయ్యరింగ్ సెంటర్లు, మల్టీపర్పస్ గోదాముల నిర్మాణాలకు డీసీసీబీ రుణాలు అందజేసింది. గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ఫలితంగా బ్యాంకు లోనింగ్ భారీగా పెరిగింది. వైఎస్సార్సీపీ హయాంలో దశాబ్దాల నాటి నష్టాలను అధిగమించి నికర లాభాల్లోకి వచి్చంది. 2022–23, 2023–24 సంవత్సరాల్లో గణనీయమైన నికర ఆదాయం పొందింది. రికార్డు స్థాయిలో ఏకంగా రూ.10 కోట్లు లాభం ఆర్జించగా.. సభ్యులైన పీఏసీఎస్‌లకు రూ.4 కోట్లు డివిడెండ్ ఇచ్చిoది. రాయలసీమ జిల్లాల్లోనే అత్యధిక టర్నోవర్ కలిగిన బ్యాంకుగా వరుసగా రెండేళ్లు అవార్డు కూడా అందుకుంది. నికర లాభాల్లోకి వచ్చిన కేడీసీసీబీ మళ్లీ నష్టాల్లోకి వచ్చి బలహీనమైన బ్యాంకుగా రికార్డు నమోదుచేసుకోవడం ఆందోళన కలిగించే విషయం. రైతుల ఆస్తుల స్వాధీనానికి రంగం సిద్ధం.. ఇక కల్లూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో బకాయిపడిన రైతులు 70 మందికి జూన్ నుంచి సెక్షన్–71 కింద నోటీసులిచ్చారు. తర్వాత 30 మంది రైతులకు ఈపీ దాఖలు చేశారు. కొంతమంది బకాయిలు చెల్లించారు. 20 మంది రైతులు స్పందించకపోవడంతో వారి ఆస్తుల వేలానికి చర్యలు తీసుకున్నారు. దీంతో 13 మంది రైతులు బకాయిలు చెల్లించారు. ఇక ఏడుగురు స్పందించకపోవడంతో వారి ఆస్తులను పీఏసీఎస్ పరం చేసుకోవడానికి చర్యలు చేపట్టారు. -
లక్ష్యం.. దూరం
కడప అగ్రికల్చర్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పాలకవర్గంలోని కొందరు అధికార పార్టీ డైరెక్టర్లు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న సొసైటీలకు ఇష్టానుసారంగా రుణాలను మంజూరు చేయించుకున్నారు. రుణాలు తీసుకోవడం, తిరిగి చెల్లించడంలో తాహతు లేకపోయినా బ్యాంకు అధికారులపై ఒత్తిడి చేయించి మంజూరు చేయించుకున్నారు. ఇప్పుడు ఆ రుణాలు ఆయా ప్రాథమిక సహకార సంఘాల్లో తడిసి మోపెడై మొండి బకాయిలై కూర్చున్నాయి. దీనిపై రాష్ట్ర ఆప్కాబ్, నాబార్డు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించగా సొసైటీలకు అస్తులకంటే అప్పులు ఎక్కువ ఉన్నాయని, వాటిని రాబట్టడానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. ఆ మేరకు డీసీసీ బ్యాంకు సీఈఓ వెంకటరత్నం చొరవ తీసుకుని బ్యాంకు ఉద్యోగులను గ్రూపులు ఏర్పాటు చేసి మొండి బకాయిలను రాబట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ బకాయిలు రాబడుతున్న సమయంలో ఆయా డైరెక్టర్లు కొందరు మోకాలొడ్డుతున్నారని బ్యాంకు ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. రుణాలు ఇప్పించుకున్నప్పుడు ఉండే శ్రద్ధ తిరిగి చెల్లించాల్సినప్పుడు ఉండదా? అని ఓ ఉద్యోగి బాహాటంగానే ఆరోపించారు. జిల్లాలోని ప్రాథమిక సహకార సంఘాలు లక్ష్యానికి దూరమవుతున్నాయి. జిల్లాలోని 69 ప్రాథమిక సొసైటీల్లో 41 మినహా మిగిలిన 28 ప్రాథమిక సొసైటీలకు 2500 మంది రైతులు రూ.6.50 కోట్లు బకాయిపడ్డారు. దీంతో ఇవి ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లు జిల్లాలో సహకార వ్యవస్థ నిర్వీర్యం కావడానికి అధికార పార్టీ అధ్యక్షులు, డైరెక్టర్ల తీరే కారణమని అధికారులు అంటున్నారు. ఇష్టారాజ్యంగా తాహతుకు మించి రుణాలను ఎగురేసుకు పోయారు. రికవరీలకు వచ్చే సరికి బకాయిలు రాబట్టలేక అధ్యక్షులు, డైరెక్టర్లు చేతులెత్తేశారు. ఇది ఒక కారణం కాగా సంఘాల్లో నిపుణులైన సిబ్బంది లేకపోవడం కూడా మరో కారణమని చెబుతున్నారు. కొందరు సీఈఓలను రాజకీయ నాయకులు తమ వాడం టూ సంఘాలకు నియమించుకుంటుండడంతో వ్యవస్థ నాశనం అవుతోందని అధికారులు పెదవి విరుస్తున్నారు. సభ్యత్వాలను పెంచుకుని రైతులను ప్రాథమిక పరపతి సంఘ కార్యాలయాల మెట్లు ఎక్కేలా చేయటంలో వైఫల్యం, సంఘాల ద్వారా రుణ మంజూరు, వసూళ్లకే పరిమితౖమైనందున ఆదాయ వనరులు కొరవడి ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావడం, పరపతేతర వ్యాపారాలతో అదనపు రాబడికి, సంఘాల అభ్యున్నతికి ప్రయత్నించకపోవడం వంటి కారణా లెన్నో సహకార సంఘాల మనుగడను కష్ట తరం చేస్తున్నాయి. రూ.113 కోట్ల రుణంలో అర్హత కోల్పోయిన 28 సొసైటీలు జిల్లాలో జిల్లాలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకుతోపాటు బ్రాంచీలు 24 ఉన్నా యి. వీటికి అనుబంధంగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు 69 ఉన్నా యి. వీటిలో 41 సొసైటీలు 50 శాతం రుణ రికవరీ చేయగా, మిగిలిన 28 సొసైటీలు చతికిలపడ్డాయి. ఈ సొసైటీలు రూ.113 కోట్ల రుణ కేటాయింపుల్లో రుణం తీసుకోవడానికి అవకాశం లేకుం డా పోయిందని డీసీసీ బ్యాంకు అధికారులు ధ్రువీకరిస్తున్నారు. జిల్లాలోని అన్ని సొసైటీలకు పంట రుణాలను బ్యాంకు బ్రాంచీలు సమకూర్చుతున్నాయి. జిల్లాలో స్వల్పకాలిక పంట రుణాలు 72 వేల మంది కాగా, దీర్ఘకాలిక రుణాలు 12 వేల మంది తీసుకుంటున్నారు. ప్రతి ఏటా ఆయా పంట రుణాలకుగాను రూ.350 కోట్లు అందజేస్తున్నారు. ఇందులో దీర్ఘకాలిక రుణ బకాయి రూ.54 కోట్లు కాగా, రెండేళ్ల కాలంగా వసూలైంది రూ.34 కోట్లు మాత్రమే. రూ.20 కోట్లు రావాల్సి ఉందని డీసీసీ బ్యాంకు అధికా రులు తెలిపారు. ఉద్యోగులు శత విధాల ప్రయత్నం చేస్తున్నా అందుకు తగ్గట్లు పాలకవర్గం నుంచి ప్రోత్సాహం లేకపోగా మోకాలడ్డేందుకు చూస్తోందని ఓ ఉద్యోగి సాక్షి ఎదుట వాపోయారు. అధికార పార్టీ సొసైటీలకు రుణాలు జిల్లాలో అధికార పార్టీ నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాథమిక సహకార సంఘాలకు కొందరు డైరెక్టర్లు అధికంగా రుణాలు మంజూరు చేయించుకున్నారు. కొన్నింటికైతే తాహతుకు మించి మంజూరు చేయించుకుని తిరిగి చెల్లించడలో చేతులెత్తేస్తున్నారని డైరెక్టర్లపై కొందరు ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు అధికారులను తమ చెప్పుచేతుల్లో ఉంచుకుని ఇష్టానుసారంగా కొందరు డైరెక్టర్లు రుణాలు పొందారు. తమ అనుచరులకు ఇప్పించారు. ఇప్పుడు ఆయా బకాయిలు చెల్లించాలని అడుగుతుంటే మొహం చాటేస్తున్నారని దుయ్యబడుతున్నారు. ఉదాహరణకు.. అట్లూరు పీఏసీసీ పరిధిలో పండుమిరప పంటను సాగు చేయరు. అయితే ఆ పంటకు ఇబ్బడి ముబ్బడిగా ఆ సొసైటీలో రుణాలు ఇచ్చారు. ఈ పంటకు అధికంగా పెట్టుబడి అవుతుంది కాబట్టి స్కేల్ ఆఫ్ పైనాన్స్ కూడా ఎక్కువగా ఉంటోంది. ఈ విధంగా రుణాలు ఇచ్చారంటే ఆ సొసైటీకి ఒక విధంగాను మిగతా సొసైటీలకు మరో విధంగాను రుణాలు ఇచ్చారంటే పాలకవర్గం ప్రమేయంతోనే ఇలా కేటాయించుకుంటారని రిటైర్డ్ అధికారి ఒకరు సాక్షికి తెలిపారు. ఇదే విధంగా బద్వేలు, రాజంపేట, రైల్వేకోడూరు, కమలాపురం, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు నియోజవర్గాల్లో ఉన్న అధికారపార్టీ నాయకులు ప్రాతినిధ్యం వహించే సోసైటీల్లోనే ఈ బకాయిలు ఎక్కువగా ఉన్నాయని ఓ అధికారి చెప్పారు. రాష్ట్రంలో చివరి స్థానానికి చేరిన బ్యాంకు గ్రేడింగ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో డీసీసీ బ్యాంకులకు గ్రేడింగ్ విధానంలో మన డీసీసీ బ్యాంకు ఆఖరు స్థానంలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అధికంగా రుణాలు ఇచ్చిన, వసూళ్లలో వెనుకబడిన బ్యాంకుల జాబితాను ఆప్కాబ్ తయారు చేస్తుంది. ఆ విధంగా కడప డీసీసీ బ్యాంకు గ్రేడింగ్ చూస్తే చివరి నుంచి 5 స్థానంలో ఉన్నట్లు అధికారులు చెబుతుండడం గమనార్హం. నేను రాకముందు జరిగిన వ్యవహారానికి నాకు సంబంధంలేదు బ్యాంకు బ్రాంచీల నుంచి పీఏసీసీలకు రుణాలు ఇచ్చిన సమయంలో నేను లేను. ఆ సమయంలో ఉన్న వారు ఇచ్చిన అప్పుల వసూళ్లు రాబట్టాలంటే తలప్రాణం తోకకొస్తోంది. గ్రూపులుగా ఉద్యోగులను నియమించి మొండిబకాయిలను రాబట్టాల్సిన పరిస్థితి వచ్చింది. నేను రాకముందు జరిగిన వ్యవహారానికి నేనెలా బాధ్యత వహిస్తాను. –వెంకటర త్నం,సీఈఓ, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, కడప -
రాజకీయ సహకారం!
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం, నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల (డీసీసీబీ) పాలక వర్గాలపై వేటు వేయాలని ప్రతిపాదించినా.. రాజకీయ ఒత్తిళ్లతో వాటి కొనసాగింపునకే సర్కారు నిర్ణయం తీసుకున్నట్లు సహకార శాఖ వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి సోమవారం ఉత్తర్వులు జారీ చేసే అవకాశమున్నట్లు సమాచారం. వాస్తవానికి ప్రాథమిక సహకార సంఘాల (ప్యాక్స్) పాలక వర్గాల పదవీ కాలం ఈ నెల మూడో తేదీతో ముగిసింది. డీసీసీబీలు, జిల్లా సహకార మార్కెటింగ్ సంఘాలు (డీసీఎంఎస్), తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్)ల పదవీకాలం కూడా అదే తేదీతో ముగిసినా సాంకేతికంగా శనివారంతో పూర్తయింది. అయితే సహకార సంఘాల ఎన్నికలు వాయిదా పడటంతో వాటికి పాలక వర్గ అధ్యక్షులు, సభ్యులను పర్సన్ ఇన్చార్జులుగా నియమించారు. ఖమ్మం, నల్లగొండ డీసీసీబీల పాలక వర్గాల అవినీతి బయటపడటంతో వాటి అధ్యక్షులు, డైరెక్టర్లను కొనసాగించవద్దని సహకార శాఖ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో వాటికి కలెక్టర్లను పర్సన్ ఇన్చార్జులుగా నియమించాలని భావించింది. కానీ మంత్రుల స్థాయిలో తీవ్ర ఒత్తిడి రావడంతో అధికారులు వెనకడుగు వేసి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధ్యక్షులను, డైరెక్టర్లనే కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మొత్తం 906 ప్యాక్స్‌లలో 90 ప్యాక్స్‌లపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. వాటి ప్రస్తుత పాలక వర్గాలను రద్దు చేసి అధికారులను నియమించాలని నిర్ణయించారు. వాటి విషయంలోనూ ఒత్తిళ్లు రావడంతో ప్రస్తుత పాలక వర్గాలకే పర్సన్ ఇన్చార్జులను నియమించే అవకాశాలున్నాయి. ఆసుపత్రి నిర్మాణం కోసం వసూళ్లు రైతులకు రుణాలు, బ్యాంకు లావాదేవీలు జరపాల్సిన డీసీసీబీ.. ఓ ట్రస్టు ఏర్పాటు చేసి ఆసుపత్రి నిర్మించడం రిజర్వు బ్యాంకు నిబంధనలకు విరుద్ధం. ఖమ్మం డీసీసీబీ రైతు సంక్షేమ నిధి పేరుతో రైతులకిచ్చే పంట రుణాల నుంచి వసూళ్లకు పాల్పడిందని గతంలో జరిపిన విచారణలో వెల్లడైన సంగతి తెలిసిందే. అలా రూ.8.11 కోట్లు వసూలు చేసి ఆస్పత్రి నిర్మించింది. రైతు సంక్షేమ నిధి పేరిట పెద్ద ఎత్తున నిధులను ఆసుపత్రికి వెచ్చిస్తూ, వాహనాల కొనుగోళ్లకు భారీగా ఖర్చు చేస్తున్నారని సమాచారం. వసూలు చేసిన సొమ్మును రైతుల సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నట్లు పాలక వర్గం ఇచ్చిన వివరణ రిజర్వు బ్యాంకు నిబంధనలకు విరుద్ధమని టెస్కాబ్ స్పష్టం చేసింది. ఓ ట్రస్టును ఏర్పాటు చేసి, దానికి డీసీసీబీ చైర్మన్ పేరు మీదే రిజిస్ట్రేషన్ చేశారని టెస్కాబ్ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయంలోనే ఖమ్మం డీసీసీబీపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. మరోవైపు ఒక సహకార బ్యాంకు బ్రాంచిని తెరిచి రైతుల నుంచి ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేసిందన్న ఆరోపణలున్నాయి. దానికి రిజర్వు బ్యాంకు అనుమతి లేదు సరికదా కనీసం టెస్కాబ్‌కు సమాచారం కూడా లేదని సహకార శాఖ వర్గాలు తెలిపాయి. ఇక ఆరోపణలు ఎదుర్కొంటున్న సహకార ఆసుపత్రి శనివారమే ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ప్రారంభం కావడం గమనార్హం. -
కొత్త డీసీసీబీల ఏర్పాటుకు కసరత్తు!
► ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న సహకార శాఖ ► లాభనష్టాల అంచనా ఆధారంగానే ఏర్పాటు! సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాలకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)లను ఏర్పాటు చేయాలని సహకార శాఖ యోచిస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలు తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించింది. కొత్త డీసీసీబీలు ఏర్పాటు చేయాలంటే ప్రస్తుత మున్న వాటి ఆస్తులు, డిపాజిట్లు, రుణాలు, రికవరీ, వ్యాపారం ఆధారంగా విభజించాలి. రిజర్వుబ్యాంకుకు కూడా ప్రతిపాదనలు పంపి దాని ఆమోదం కూడా తీసుకోవాలని భావిస్తు న్నారు. ప్రస్తుతం కొన్ని డీసీసీబీల్లో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కొత్తవాటిని ఏర్పాటు చేయడానికి రిజర్వు బ్యాంకు అంగీకరిస్తుందా లేదా అన్న అను మానాలున్నాయి. జిల్లాల విభజన జరిగి నందున విభజన తప్పనిసరని, విభజనకు తోడ్పడాలని సహకారశాఖ రిజర్వుబ్యాంకును కోరే అవకాశముంది. ఫిబ్రవరికి ముగియనున్న పదవీకాలం సహకార సంఘాలకు ప్రస్తుతమున్న పాలక వర్గాల పదవీకాలం వచ్చే ఫిబ్రవరి నాటికి ముగియనుంది. తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్(టెస్కాబ్) పదవీ కాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 26తో ముగియ నుంది. జిల్లా సహకార మార్కెటింగ్ సమాఖ్య (డీసీఎంఎస్)లు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)ల పదవీకాలం అదే నెల 18న ముగియనుంది. ఇక 906 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(ప్యాక్స్)ల పదవీకాలం అదే నెల మొదటివారంలో ముగియనుంది. 2013లో ఉమ్మడి రాష్ట్రంలో సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించి నప్పుడు తెలంగాణలో 10 జిల్లాలే ఉన్నాయి. ఇప్పుడు వాటి సంఖ్య 31కి పెరిగినందున వాటి ప్రకారం జిల్లా సహకార మార్కెటింగ్ సమాఖ్య(డీసీఎంఎస్), జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)లు ఏర్పాటు చేయాలి. ఈ ప్రక్రియను ఇప్పుడు ప్రారంభిస్తే వచ్చే జనవరి నాటికి పూర్తవుతుంది. విభజన ప్రక్రియ చేపట్టి ఎన్నికలకు వెళ్లకుండా చూడాలన్న అభిప్రా యమూ సర్కారులో ఉన్నట్లు సమాచారం. 2019లో అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నం దున సరిగ్గా ఏడాదిలోపు సహకార సంఘాల ఎన్నికలు నిర్వహిస్తే రాజకీయంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోన్న చర్చ ఉంది. కాబట్టి పర్సన్ ఇన్చార్జులను నియమిస్తేనే బాగుంటుందన్న భావన ప్రభుత్వ వర్గాల్లో నెలకొంది. -
ఖరీఫ్ రుణ లక్ష్యం రూ.161 కోట్లు
తాండూరు, న్యూస్‌లైన్: బకాయిలు చెల్లించని సహకార సంఘాలకు ఈ సారి ఖరీఫ్ పంట రుణాలు ఇవ్వడం లేదని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ పి.లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం తాండూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2012-13 సంవత్సరంలో 49 సహకార సంఘాల ద్వారా రూ.203 కోట్ల ఖరీఫ్ పంట రుణాలు మంజూరు చేశామని చెప్పారు. ఇందులో రూ.148కోట్లు వసూలయ్యాయని, మిగతావి బకాయిలున్నాయని తెలిపారు. వసూలైన రూ.148 కోట్లకు మరో రూ.13 కోట్లు కలిపి మొత్తం రూ.161 కోట్లు ఖరీఫ్ పంట రుణాలుగా అందజేయనున్నట్టు ఆయన తెలిపారు. బుధవారం నుంచి సహకార సంఘాల ద్వారా రైతులకు వడ్డీ లేని ఖరీఫ్ రుణాలు ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. సుమారు 35వేల మంది రైతులకు రుణాలు మంజూరు చేయాలని లక్ష ్యంగా పెట్టుకున్నామనీ, ఇందులో సుమారు 2వేల మంది కొత్త రైతులు ఉన్నారని చెప్పారు. తీసుకున్న రుణాల చెల్లింపుల ప్రకారం జిల్లాలోని 49 సహకార సంఘాలను ఏ,బీ,సీ,డీ గ్రూప్‌లుగా విభజించినట్టు ఆయన తెలిపారు. 100 శాతం చెల్లింపు చేసిన సంఘాలు లేవన్నారు. 90శాతం రుణాలు చెల్లించిన బీ గ్రూప్ సంఘాలు 18, 80శాతం చెల్లించిన సీ గ్రూప్ సంఘాలు 5, 60శాతం చెల్లించిన డీ గ్రూప్ సంఘాలు 5 ఉన్నాయని ఆయన వివరించారు. జిల్లాలోని మొత్తం 49 సంఘాల్లో 28 సంఘాలకే ఇప్పుడు ఖరీఫ్ పంట రుణాలు మంజూరు చేయనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. 21 సంఘాలకు కొత్తగా రుణాలు ఇవ్వడం లేదన్నారు. గరిష్టంగా రూ.90లక్షలు, కనిష్టంగా రూ.40లక్షల వరకు రుణాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. గత ఖరీఫ్ పంట రుణాలు చెల్లించని రైతులకు వడ్డీ పడుతుందన్నారు. బుధవారం నుంచి మంజూరు చేయనున్న రుణాలకు వడ్డీ ఉండదని ఆయన స్పష్టం చేశారు. గత ఏడాది రూ.24కోట్ల బంగారు ఆభరణాలపై రైతులకు రుణాలు ఇవ్వగా, ఈసారి రూ.76కోట్లు ఇచ్చామని పేర్కొన్నారు. తాండూరు డీసీసీబీ నుంచి లాంఛనంగా ఖరీఫ్ పంట రుణాల మంజూరును ప్రారంభించనున్నట్టు లక్ష్మారెడ్డి తెలిపారు. సమావేశంలో మాజీ కౌన్సిలర్లు సి.మల్లిఖార్జున్, పి.బస్వరాజ్, పట్టణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసాచారి పాల్గొన్నారు.