తాండూరు, న్యూస్‌లైన్: బకాయిలు చెల్లించని సహకార సంఘాలకు ఈ సారి ఖరీఫ్ పంట రుణాలు ఇవ్వడం లేదని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ పి.లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం తాండూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2012-13 సంవత్సరంలో 49 సహకార సంఘాల ద్వారా రూ.203 కోట్ల ఖరీఫ్ పంట రుణాలు మంజూరు చేశామని చెప్పారు. ఇందులో రూ.148కోట్లు వసూలయ్యాయని, మిగతావి బకాయిలున్నాయని తెలిపారు. వసూలైన రూ.148 కోట్లకు మరో రూ.13 కోట్లు కలిపి మొత్తం రూ.161 కోట్లు ఖరీఫ్ పంట రుణాలుగా అందజేయనున్నట్టు ఆయన తెలిపారు. బుధవారం నుంచి సహకార సంఘాల ద్వారా రైతులకు వడ్డీ లేని ఖరీఫ్ రుణాలు ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. సుమారు 35వేల మంది రైతులకు రుణాలు మంజూరు చేయాలని లక్ష ్యంగా పెట్టుకున్నామనీ, ఇందులో సుమారు 2వేల మంది కొత్త రైతులు ఉన్నారని చెప్పారు. తీసుకున్న రుణాల చెల్లింపుల ప్రకారం జిల్లాలోని 49 సహకార సంఘాలను ఏ,బీ,సీ,డీ గ్రూప్‌లుగా విభజించినట్టు ఆయన తెలిపారు. 100 శాతం చెల్లింపు చేసిన సంఘాలు లేవన్నారు. 90శాతం రుణాలు చెల్లించిన బీ గ్రూప్ సంఘాలు 18, 80శాతం చెల్లించిన సీ గ్రూప్ సంఘాలు 5, 60శాతం చెల్లించిన డీ గ్రూప్ సంఘాలు 5 ఉన్నాయని ఆయన వివరించారు.
జిల్లాలోని మొత్తం 49 సంఘాల్లో 28 సంఘాలకే ఇప్పుడు ఖరీఫ్ పంట రుణాలు మంజూరు చేయనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. 21 సంఘాలకు కొత్తగా రుణాలు ఇవ్వడం లేదన్నారు. గరిష్టంగా రూ.90లక్షలు, కనిష్టంగా రూ.40లక్షల వరకు రుణాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. గత ఖరీఫ్ పంట రుణాలు చెల్లించని రైతులకు వడ్డీ పడుతుందన్నారు. బుధవారం నుంచి మంజూరు చేయనున్న రుణాలకు వడ్డీ ఉండదని ఆయన స్పష్టం చేశారు. గత ఏడాది రూ.24కోట్ల బంగారు ఆభరణాలపై రైతులకు రుణాలు ఇవ్వగా, ఈసారి రూ.76కోట్లు ఇచ్చామని పేర్కొన్నారు. తాండూరు డీసీసీబీ నుంచి లాంఛనంగా ఖరీఫ్ పంట రుణాల మంజూరును ప్రారంభించనున్నట్టు లక్ష్మారెడ్డి తెలిపారు. సమావేశంలో మాజీ కౌన్సిలర్లు సి.మల్లిఖార్జున్, పి.బస్వరాజ్, పట్టణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసాచారి పాల్గొన్నారు.
ఖరీఫ్ రుణ లక్ష్యం రూ.161 కోట్లు
Published Wed, Aug 7 2013 1:16 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement