
సాక్షి, అమరావతి: వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్ పదవుల్లో మహిళలకు సగం ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. మార్కెట్ కమిటీ సభ్యుల్లో కూడా సగం వారికే కేటాయించాలని స్పష్టం చేశారు. మార్కెటింగ్, సహకార శాఖలపై గురువారం ఆయన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ధరల స్థిరీకరణ, మార్కెట్ యార్డుల్లో కనీస సదుపాయాలు, చిరు ధాన్యాల బోర్డు ఏర్పాటు, సహకార రంగం పటిష్టత అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవుల్లో సగం మహిళలకు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ నెలాఖరులోగా మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. కాగా, ఇప్పటికే జారీ చేసిన జీవో మేరకు ఈ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. ఈ సమీక్షలో మంత్రులు కన్నబాబు, మోపిదేవి వెంకటరమణతో పాటు సంబంధిత ఉన్నతాధికారులు పాల్లొన్నారు.