
‘మాఫీ’ నిర్లక్ష్యంపై.. ‘ధర్నా’కోలా
ఒకపక్క పగబట్టిన ప్రకృతి.. మరోపక్క ఏమీ పట్టని సర్కారు.. వెరసి రైతన్నలకు పుట్టెడు కష్టాలు. రుణమాఫీ నాటకంతో వ్యవసాయమే పితలాటకంగా మారింది. బ్యాంకుల్లో పాత బకాయిలకు వడ్డీ పెరిగిపోయి, పంటల బీమా వర్తించక, కొత్త అప్పులు పుట్టక ఈ ఖరీఫ్ సాగుకు రైతాంగం అష్టకష్టాలు పడింది. ఎలాగో ప్రైవేటుగా పెట్టుబడులు సమకూర్చుకొని సాగుకు సిద్ధపడిన రైతులను సుడిదోమ, ఎండుతెగులు దెబ్బతీశాయి. దిగుబడి దారుణంగా పడిపోతుందని ఆందోళన చెందుతున్న ఈ దశలో రుణాలను చెల్లించని రైతుల ఆస్తులను జప్తు చేయాలని, వారిపై దావాలు వేయాలని డీసీసీబీ నిర్ణయించింది. ఈ పరిస్థితుల్లో రైతులకు అండగా నిలిచి సర్కారు తీరును ఎండగట్టేందుకు బుధవారం అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని వైఎస్సార్ సీపీ నిర్ణయించింది.
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పశ్చిమ రైతుపై ప్రభుత్వమే కాదు ప్రకృతి కూడా కక్ష కట్టినట్టుంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చివరి దశకు చేరుకున్న తరుణంలో సుడిదోమ, ఎండుతెగులు దెబ్బకు అన్నదాత విలవిల్లాడిపోతున్నాడు. రుణమాఫీ జాప్యం.. ఈ సాకుతో బ్యాంకర్లు కొత్త రుణాలు ఇవ్వకపోవడం వెరసి ప్రైవేటు అప్పులే పెట్టుబడిగా సాగు చేసిన రైతుకు చివరకు కన్నీళ్ల దిగుబడే మిగులుతోంది. ఈ దశలో సాయం చేయాల్సిన సర్కారు కనీస కనికరం లేకుండా పంట రుణాలను తక్షణమే చెల్లించాలంటూ కొరడా ఝుళిపిస్తోంది. ఇక జిల్లా సహకార కేంద్రబ్యాంకు (డీసీసీబీ) ఏకంగా రుణాలు చెల్లించని వారిపై దావాలు వేయాలని, అవసరమైతే ఆస్తులు జప్తు చేయాలని సొసైటీలకు ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో రైతన్నలకు అండగా నిలవాలన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుతో పార్టీ శ్రేణులు బుధవారం జిల్లావ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టనున్నాయి.
పరిహారం అడిగే నాధుడెక్కడ?
రైతులకు కొత్త రుణాలు లభించని ఫలితంగా జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో సాగు భారీగా తగ్గింది. ఖరీఫ్‌లో సుమారు ఆరు లక్షల ఎకరాల్లో వరిని పండించాల్సి ఉండగా, రైతులకు సమయానికి అప్పులు దొరక్క ఐదున్నర లక్షల ఎకరాలకే ఈసారి సాగు పరిమితమైంది. మొత్తంగా ఈ ఖరీఫ్ సీజన్‌లో 11లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. అయితే అనూహ్యంగా దోమ దెబ్బకు ఇప్పుడు సగానికి సగం తగ్గే ప్రమాదం కనిపిస్తోంది. హుదుహుద్ తుపాను ముప్పు తప్పిందని పశ్చిమ రైతాంగం ఊపిరిపీల్చుకున్నా వాతావరణంలో వచ్చిన మార్పులతో సుడిదోమ, ఎండుతెగులు దెబ్బకు పంట పూర్తిగా దెబ్బతింది. ఫలితంగా దిగుబడి 40 శాతం తగ్గుతుందని స్వయంగా అధికారులే అంచనా వేస్తున్నారు. పెట్టుబడులు కూడా రాని ఈ పరిస్థితుల్లో రైతాంగం అల్లాడిపోతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. ఇటీవల ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంలోనైనా ఒక్క నేత కూడా ప్రస్తుతం జిల్లా రైతాంగం ఎదుర్కొంటున్న సుడిదోమ కష్టాలను, నష్టాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లే యత్నం చేయలేదు. చీడపీడల వల్ల నష్టపోతున్న అన్నదాతలకు పంటల బీమా పథకం వర్తించే పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వమే పరిహారం చెల్లించి ఆదుకోవాలని ఆయన్ను అడిగే నాధుడే కానరాలేదు.
అన్నదాతల ఆస్తుల్ని జప్తు చేయాలని ఆదేశాలు
రుణమాఫీ అమల్లో జాప్యం జరిగినా త్వరలోనే ఏ రైతుకు ఎంత సొమ్ము జమ అవుతుందనేది ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చని ఒకవైపు స్వయంగా ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు చెప్పుకొస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీలో పనిచేసే జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మాత్రం డిఫాల్టర్లుగా మారిన రైతులపై దావాలు వేసేందుకు సిద్ధమవుతోంది. జిల్లాలో సుమారు 2 లక్షల మంది రైతులకు డీసీసీబీ 258 సహకార సంఘాల ద్వారా రూ.1100 కోట్లను పంట రుణాలుగా అందించింది. ఎవరూ రుణాలు చెల్లించవద్దని చంద్రబాబు పదేపదే చెప్పడంతో రైతులు ఆ మాటలు నమ్మి వాయిదా మీరిన బకాయిదారులు (డిఫాల్టర్లు)గా మిగిలారు. డీసీసీబీ వీరిపై దావాలు వేసేందుకు సిద్ధమవుతోంది. అవసరమైతే ఆస్తుల జప్తునకు కూడా వెనుకాడవద్దని సొసైటీలకు ఆదేశాలు జారీచేస్తోంది. డీసీసీబీ ఇలా రైతాంగంపై విరుచుకుపడుతున్నా కనీసం జిల్లా స్థాయిలో అడ్డుకునే అధికార పార్టీ నాయకుడు కానరావడం లేదు.
డ్వాక్రా రుణాలదీ అదే దారి
ఇక డ్వాక్రా రుణాలదీ అదే పరిస్థితి. గడువులోగా డ్వాక్రా రుణాలు చెల్లిస్తే ఒక్క రూపాయి కూడా వడ్డీ పడదని, ఇప్పుడు జాప్యం కారణంగా 13 నుంచి 15 శాతం వడ్డీ పడుతుందని బ్యాంకర్లు చెబుతున్నారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని చెబుతున్న సీఎం వాటిపై వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుందా అనేదానిపై ఇంకా స్పష్టతనివ్వలేదు.
రుణ వంచనపై రణభేరి : ఆళ్లనాని
రైతన్నలను, డ్వాక్రా మహిళలను దారుణంగా మోసం చేస్తున్న ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు తీరును నిరసిస్తూ బుధవారం జిల్లావ్యాప్తంగా ధర్నాలు చేపట్టనున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) తెలిపారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు నిర్వహించే ఈ నిరసన కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు. బాబు చేసిన మోసాలను ఎండగడుతూ జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లోనూ రైతన్నలకు మద్దతుగా వినూత్న నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్టు నాని తెలిపారు.