సంగారెడ్డి : జిల్లా కేంద్ర సహకార బ్యాంకుతో పాటు జిల్లాలోని 53 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్) పాలక మండళ్ల పదవీ కాల పరమితి ఫిబ్రవరి 3న ముగియనుంది. ఈ నేపథ్యంలో నాలుగో తేదీ నుంచి సహకార సంఘాల పాలనా పగ్గాలు ఎవరి చేతికి వెళ్తాయనే అంశంపై ఆసక్తి నెలకొంది. సహకార చట్టం ని బంధనల మేరకు సహకార సంఘాల పాలక మండళ్ల గడువును మూడు నుంచి ఆరు నెలల పాటు పొడిగించే అవకాశం ఉంది. లేని పక్షంలో ప్రత్యేక అధికారులను నియమించి కొత్త పాలక మండళ్లు ఎన్నికయ్యేంత వరకు నెట్టుకొచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుత పాలక మండళ్ల కొనసాగింపు లేదా ప్రత్యేక అధికారుల నియామకానికి సంబంధించి ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వ పరంగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఉమ్మడి మెదక్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలో 104 పీఏసీఎస్‌లు, ఎఫ్‌ఏసీఎస్‌లు ఉండగా, సంగారెడ్డి జిల్లా పరిధిలో 53 ఉన్నాయి. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో కొత్త డీసీసీబీల ఏర్పాటు, కొత్తగా ఆవర్భివించిన మండలాల్లో పీఏసీఎస్‌ల ఏర్పాటు వంటి అంశాలపై స్పష్టత రాకపోవడంతో ఇప్పట్లో సహకార ఎన్నికలు జరిగే అవకాశం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పునర్విభజన మూలంగా ఆవిర్భవించిన అమీన్‌పూర్, మొగుడంపల్లి, నాగల్‌గిద్ద మండలాల్లో పీఏసీఎస్‌లు లేవనే అంశంపై సహకార శాఖ ప్రభుత్వానికి గతంలోనే నివేదిక సమర్పించింది. అల్లాదుర్గం, రేగోడు పీఏసీఎస్‌లు మెదక్ జిల్లా పరిధిలోకి వెళ్లగా.. కొన్ని గ్రామాలు వట్‌పల్లి మం డలంలోకి వచ్చాయి.
ఈ నేపథ్యంలో రెండు జిల్లాల పరిధిలో ఉన్న పీఏసీఎస్‌ల పరిధిని నిర్వచిస్తూ.. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి విడివడి కొత్తగా ఆవిర్భించిన మెదక్, సిద్దిపేట జిల్లాలకు నూతన డీసీసీబీల ఏర్పాటుకు నాబార్డ్, రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపాల్సి ఉంటుంది. కొత్త డీసీసీబీల ఏర్పాటుకు కనీసం ఏడాది నుంచి రెండేళ్లు పడుతుందనే వార్తల నేపథ్యంలో.. సహకార ఎన్నికలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఫిబ్రవరి 4 నుంచి ఓటరు నమోదు..
సహకార ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం తొలి సారిగా తెలంగాణ రాష్ట్ర సహకార ఎన్నికల సంఘంను ఏర్పాటు చేసింది. సహకార ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఫిబ్రవరి 4 నుంచి 27వ తేదీ వరకు పీఏసీఎస్‌ల వారీగా ఓటరు జాబితాను రూపొందించేందుకు సహకార అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఓటరు జాబి తా రూపకల్పనలో పాటించాల్సిన నిబంధనలపై ఇప్పటికే క్షేత్రస్థాయి అధికారులకు శిక్షణ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా పరిధిలోని 53 పీఏసీఎస్‌లలో 60,172 మంది ఓటర్లు ఉన్నారు. ఓటరు జాబితా రూపకల్పన తర్వాత ఈ సంఖ్యలో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది. వ్యవసాయ భూమి కలిగి పీఏసీఎస్‌లో రూ.300 మూలధన వాటా కలిగిన సభ్యులను ఓటరు జాబితా లో చేరుస్తారు. పీఏసీఎస్‌లో సభ్యత్వం తీసుకుని కనీ సం ఏడాది పూర్తయి ఉండాలనే నిబంధన విధిం చారు. ప్రస్తుత పీఏసీఎస్, డీసీసీబీ పాలక మండళ్ల భవితవ్యంతో సంబంధం లేకుండానే ఓటరు జాబితా రూపకల్పన తయారీలో సహకార శాఖ నిమగ్నం కానుంది.
ఎన్నికలయ్యేంత వరకు కొనసాగించాలి
తిరిగి సహకార ఎన్నికలు నిర్వహిం చేంత వరకు పీఏసీఎస్‌లకు ప్రస్తుతమున్న పాలక మండళ్లనే కొనసాగించాలి. ప్రత్యేక అధికారులను నియమించడం ద్వారా సహకార సంఘాల లక్ష్యం దెబ్బతినడంతో పాటు, పాలన గాడి తప్పే అవకాశం ఉంటుంది. రైతు సమస్యలపై అవగాహన ఉన్న పాలక మండలి ఉంటేనే వారి సమస్యలకు పరిష్కారం దొరకడంతో పాటు, తోడ్పాటు అందుతుంది. సహకార సంఘాల ఎన్నికల నిర్వహణలో జాప్యం చేయకుండా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి. అర్హులైన రైతులందరినీ సహకార సంఘాల్లో సభ్యులుగా చేర్చుకోవడంతో పాటు, ఓటు హక్కు కల్పించాలి.
– శంకర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్, పీచేర్యాగడి
ఎన్నికలు వాయిదా వేసేందుకే..
జిల్లాల పునర్విభజన జరిగి ఏడాది గడుస్తున్నా.. కొత్త పీఏసీఎస్‌లు, డీసీసీబీల ఏర్పాటుకు సంబం «ధించి ప్రభుత్వం ఎలాంటి చొరవ తీసుకోలేదు. కొత్త డీసీసీబీల ఏర్పాటుకు ఆర్‌బీఐ ఆమోదం పొందా లంటే కనీసం ఏడాదికి పైనే పడుతుంది. ఐదేళ్లుగా సహకార సంఘా ల బలోపేతానికి ఎలాంటి చర్యలు చేపట్టని ప్రభుత్వం.. ఎన్నికలు నిర్వహించకుండా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికలపై ఏడాది ముందే దృష్టి పెటి సహకార సంఘాల ఎన్నికలపై మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.
– జైపాల్‌రెడ్డి, మాజీ చైర్మన్, మెదక్ డీసీసీబీ
ఉమ్మడి మెదక్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకుతో పాటు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలక మండళ్ల పదవీ కాల పరిమితి మరో మూడు రోజుల్లో ముగియనుంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు తక్షణమే ఎన్నికలు జరిగే పరిస్థితి కనిపిం చడం లేదు. దీంతో సహకార సంఘాల పాల నా పగ్గాలు.. ప్రస్తుత కమిటీలకే అప్పగిస్తారా లేక ప్రత్యేక అధికారులను నియమిస్తారా అనే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఇదిలా ఉంటే రాష్ట్ర సహకార ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల నాలుగో తేదీ నుంచి సహకార సంఘాల్లో ఓట ర్ల జాబితా తయారీకి సహకార శాఖ సన్నాహాలు చేస్తోంది.
–సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment