సహకారం..చెరి సగం | co operation.. half of theone | Sakshi
Sakshi News home page

సహకారం..చెరి సగ

Published Fri, Oct 28 2016 12:52 AM | Last Updated on Mon, Sep 4 2017 6:29 PM

co operation.. half of theone

- డీసీసీబీలో కమీషన్ల పర్వం
- ముఖ్యనేత పేరు మీద వసూళ్లు
- కొత్త పథకాలతో సరికొత్త వ్యూహం
- అవసరార్థం వచ్చిన రైతులను
  పీల్చిపిప్పి చేస్తున్న వైనం
 
 
కర్నూలు(అగ్రికల్చర్‌)/ కోవెలకుంట్ల:
జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ)..రైతుల అభ్యున్నతి దీని లక్ష్యం. కష్టాల్లో ఉన్న అన్నదాతలకు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా రుణాలు ఇవ్వాలి. అయితే జిల్లాలో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. కమీషన్ల పేరుతో రైతులను అధికారులు పీల్చి పిప్పిచేస్తున్నారు. టీడీపీకి చెందిన డీసీసీబీ పాలకమండలిలోని ముఖ్యనేత పేరు మీదనే ఈ వ్యవహారం నడుస్తోంది. కమీషన్లను అధికారులు, ముఖ్యనేత చెరి సగం పంచుకుంటున్నట్లు విమర్శలున్నాయి. 
నిబంధనలు ఇలా..
జిల్లా సహకార కేంద్రబ్యాంకు ద్వారా 2015–16 నుంచి కాంపోజిట్‌ రుణ పథకం, రైతు నేస్తం, కర్షకజ్యోతి, డెయిరీ కింద రుణాలు ఇస్తున్నారు. కాంపోజిట్‌ పథకం కింద గరిష్టంగా రూ.25 లక్షలు రుణంగా ఇస్తారు. మిగిలిన పథకాల కింద రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలు ఇస్తున్నారు. రైతుల భూములను క్షేత్ర స్థాయిలో పరిశీలించి  అన్ని సక్రమంగా ఉంటే డాక్యుమెంట్లను తీసుకొని మాల్టిగేజ్‌ చేసుకున్న తర్వాత రుణాలు ఇస్తారు. రైతులు ఏ కారణంతోనైనా రుణాలు చెల్లించకపోతే భూములను స్వాధీనం చేసుకొని వేలం వేసే అవకాశం ఉంది.
వసూళ్లు ఇలా..
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు మొదలు కొని కేడీసీసీబీ బ్రాంచిల వరకు ముఖ్యనేత పేరుమీదనే వసూళ్ల పర్యం సాగుతోంది. సదరు ముఖ్యనేతకు 2 శాతం, స్థానిక సిబ్బంది మరో 2 శాతం వరకు కమీషన్‌లు ఉన్నట్లు జిల్లాలో చర్చ జరుగుతోంది. మామూళ్ల వ్యవహారాన్ని ప్రశ్నించిన వారిపై  సదరు నేత ఎదురుదాడి చేస్తున్న సంఘటనలు ఉన్నాయి. భూములను పరిశీలించేందుకు వెళ్లిన అధికారులు సైతం మామూళ్లు దండుకుంటున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఎటువంటి దీర్ఘకాలిక రుణమైనా కేడీసీసీబి ప్రధాన కార్యాలయానికి వస్తుంది. అక్కడ అడ్వైజ్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాల్సిఉంది. ఇది ఇవ్వాలంటే కమీషన్‌లు ముట్టాల్సిందే. లక్షకు రూ.వెయ్యి ఇస్తే అడ్వైజ్‌ సర్టిఫికెట్‌ వస్తుంది. 
రుణపంపిణీ ఇలా..
కాంపోజిట్, రైతు నేస్తం, కర్షకజ్యోతి, డెయిరి పథకాల కింద 2015–16లో దాదాపు రూ.500 కోట్లు రుణాలు ఇచ్చారు. ఈ ఏడాది దాదాపు రూ.1000 కోట్లు రుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా తీసుకున్నారు. ఇప్పటికి రూ.175 కోట్ల వరకు రుణాలు పంపిణీ చేశారు. రుణపంపిణీ బట్టి కమీషన్లు ఏ స్థాయిలో ఉన్నాయో ఊహించుకోవచ్చు.  
ఇదీ ఉదాహరణ..
- గోనెగండ్ల మండలానికి చెందిన ఓ రైతు కాంపోజిట్‌ పథకం కింద రూ.25 లక్షల రుణం కోసం ముఖ్యనేతకు ముందుగానే రూ.75వేలు ఇచ్చుకున్నట్లు సమాచారం. ఆయనకున్న భూములకు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ విలువల ప్రకారం రూ. 15 లక్షలకే రుణానికి అర్హత లభించింది. రూ.25 లక్షల కోసమని రూ.75వేలు ఇస్తే రూ. 15 లక్షలే ఇచ్చారని అ రైతు అందోళన అంతాఇంతా కాదు. 
 
రుణంలో 2 శాతం పట్టుకున్నారు: యల్లావత్తుల శివశంకర్, సంజామల (27కేఎన్‌ఎల్‌16ఏ)
వరి, జొన్న సాగుకు పెట్టుబడుల కోసం సంజామల సహకార సంఘంలో మూడు నెలల క్రితం 5.40 ఎకరాల పొలం తనఖా పెట్టాను. కర్షక జ్యోతి పథకం కింద ఎకరాకు రూ. లక్ష చొప్పున రూ. 5.40 లక్షల రుణం అందాల్సి ఉంది. అయితే  రెండుశాతం కమిషన్‌ పట్టుకొని రూ. 4.85 లక్షలు చేతికిచ్చారు. ఇదేమని అడిగితే పెద్దోళ్లకు ఇవ్వాలని అధికారులు చెప్పారు.  
 
రూ.15 వేలు పట్టుకున్నారు: మహమ్మద్‌ రఫీ, కానాల, సంజామల మండలం (27కేఎన్‌ఎల్‌16బీ)
నేను రెండున్నర ఎకరా పొలం తనఖా పెట్టి  రెండు నెలల క్రితం బర్రెల కొనుగోలుకు రూ. 2.50 లక్షలు రుణం కావాలని అడిగాను. మొదటి విడత రూ. 1.25 లక్షలు అందజేయాల్సి ఉంది. అయితే రూ. 15వేలు పట్టుకొని రూ. 1.10 లక్షలు చేతికిచ్చారు. మిగిలిన మొత్తం ఆరు నెలల తర్వాత ఇస్తామన్నారు. సహకార సంఘాల్లో క్రాప్‌ లోన్లు ఎత్తివేసి ఎల్‌టీ, కర్షక జ్యోతి పథకాల కింద మాత్రమే రుణాలు ఇస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement