డీసీసీబీ బ్యాంకులో ఏటీఎం ప్రార ంభిస్తున్న డోల జగన్‌మోహనరావు
ఖాతాదారులకు మెరుగైన సేవలు
Published Wed, Aug 31 2016 10:59 PM | Last Updated on Mon, Sep 4 2017 11:44 AM
శ్రీకాకుళం అర్బన్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలోని రైతులకు, ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని ఆ బ్యాంక్ చైర్మన్ డోల జగన్‌మోహనరావు అన్నారు. నగరంలోని జీటీరోడ్‌లోని డీసీసీబీ బ్యాంకు కార్యాలయంలో బుధవారం ఏటీఎం కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమర్షియల్ బ్యాంకుల పోటీతత్వాన్ని ఎదుర్కొనేందుకు ఖాతాదారులకు ఏటీఎం సౌకర్యం కల్పించామని తెలిపారు. భవిష్యత్‌లో పంట రుణాలు, ఇన్‌పుట్ సబ్సిడీ, సహకార సంఘాల ద్వారా తీసుకున్న అప్పులను రైతు ఖాతాలో జమ చేస్తామని తెలిపారు. బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా ఏటీఎంకు వెళ్లి డబ్బులు డ్రా చేసుకోవచ్చన్నారు. డీసీసీబీ బ్యాంకు ఖాతాదారులందరికీ రూపే కార్డు జారీ చేస్తున్నామని చెప్పారు. 49 సహకార సంఘాల పరిధిలోని లక్షా 25వేల మంది సభ్యులు ఉండగా అందులో లక్షా 13వేల 500 ఖాతాలు ఉన్నాయని కావాల్సిన వారందరికీ రూపే కార్డు జారీ చేస్తామని తెలిపారు.
మొత్తం బ్రాంచిలు 15 ఉండగా కొత్తగా రణస్థలం, హిరమండలం, వీరఘట్టం, మందస ప్రాంతాల్లో బ్రాంచిలు ఏర్పాటు చేయనున్నామన్నారు. మొదటి విడతగా శ్రీకాకుళం బ్రాంచిలో ఏటీఎం కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. మిగతా బ్రాంచిల్లోనూ వీటిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. అన్ని సంఘాలకు పాస్ మిషన్ ఏర్పాటు చేసి ప్రతి సభ్యునికీ రూపే కార్డు ఏర్పాటు చేసి ఏటీఎంల ద్వారా వ్యాపార లావాదేవీలను జరిపేలా చూస్తామన్నారు. ఈ ఏటీఎం కార్డులతో ఇతర అన్ని బ్యాంకుల ఏటీఎంలలో లావాదేవీలు చేసుకోవచ్చని చెప్పారు. కార్యక్రమంలో డీసీసీబీ సీఈఓ డి.సత్యన్నారాయణ, జిల్లా కో–ఆపరేటివ్ అధికారి బి.శ్రీహరిరావు, డీజీఎంలు పి.జ్యోతిర్మయి, వరప్రసాద్, ఏజీఎంలు ఎస్‌వీఎస్ జగదీష్, రమేష్, సునీల్, సహకార సంఘాల అధ్యక్షుడు సనపల లక్ష్మునాయుడు, నర్తు నరేంద్రయాదవ్, గొండు కృష్ణమూర్తి, బొడ్డేపల్లి నారాయణరావు, నాగమ్మ, సీతమ్మ, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement