కొత్త డీసీసీబీలపై మల్లగుల్లాలు
విభజిస్తే నష్టదాయకమంటున్న అధికారులు
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల్లో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లను ఏర్పాటు చేసే అంశంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇతర ప్రభుత్వ శాఖల మాదిరిగా డీసీసీబీలను విడగొట్టి జిల్లాకు ఒకటి చొప్పున ఏర్పాటు చేయడం అంత సులువైన వ్యవహారం కాదు. సహకార బ్యాంకుల విభజనగాని, కొత్తగా ఏర్పాటు చేయడంగాని ఆర్బీఐ పరిధిలోకే వస్తుంది. కాబట్టి ఆర్బీఐ అనుమతి తీసుకుంటేనే ఉన్న వాటిని విభజించడం... లేదా కొత్త వాటిని ఏర్పాటు చేయడం సాధ్యపడుతుంది.
అది కూడా లాభనష్టాల ఆధారంగానే కొత్త వాటి ని ఏర్పాటు చేయాలా.. లేదా.. అన్న అంశా న్ని ఆర్బీఐ అధ్యయనం చేసి అనుమతిపై నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికిప్పుడు కొత్త జిల్లాలతోపాటు డీసీసీబీల ఏర్పాటు ఉండబోదని... జిల్లాల ఏర్పాటు అనంతరం పాలకవర్గాల నిర్ణయం మేరకు నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) ఎండీ మురళీధర్ ‘సాక్షి’తో అన్నారు. అయితే, కొత్త జిల్లాలతోపాటు డీసీసీబీలను కూడా ఏర్పాటు చేయాలని కొందరు డీసీసీబీ సభ్యులు కోరుతున్నారు.
డీసీసీబీల నేతృత్వంలో ఉన్న సహకార బ్యాంకుల్లో దాదాపు 30లక్షల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. రూ.5వేల కోట్ల వరకు డిపాజిట్లు ఉన్నాయి. వాటిని విడగొట్టి కొత్త జిల్లాల్లో ఏర్పాటు చేస్తే నష్టాలబాట పట్టే పరిస్థితులు ఏర్పడతాయని టెస్కాబ్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లాభాలు ఉంటాయన్న నమ్మకం వస్తేనే కొత్త జిల్లాల్లో డీసీసీబీలను ఏర్పాటు చేస్తామని, దాని ప్రకారం పాలకవర్గాల తీర్మానంతో ఆర్బీఐ అనుమతి తీసుకుంటామని మురళీధర్ పేర్కొంటున్నారు.