![Andhra Pradesh Co-operative Bank is number one in the country - Sakshi](/styles/webp/s3/article_images/2020/11/10/ddv.jpg.webp?itok=q91BCfr_)
ఆప్కాబ్ ఎండీ శ్రీనాథ్‌రెడ్డి.
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంక్ (ఆప్కాబ్) దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. రుణాల మంజూరు, వసూళ్లతోపాటు వివిధ అంశాల్లో మెరుగైన పనితీరుతో ముందుకు సాగుతోందని, రైతులు, వివిధ వర్గాల ప్రజలకు బ్యాంకు సేవలు అందుబాటులో ఉన్నాయని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కో–ఆపరేటివ్ బ్యాంక్స్ (నాఫ్కాబ్) పేర్కొంది. 2018–19 సంవత్సరంలో రాష్ట్ర, జిల్లా సహకార బ్యాంకులు, సహకార సంఘాల పనితీరును నాఫ్కాబ్ పరిశీలించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వాటి వివరాలను వెల్లడించింది.
రాష్ట్ర ప్రభుత్వాల ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకుంటూనే రుణాల రికవరీ, మంజూరు విషయంలో ఆప్కాబ్ గత రెండేళ్లుగా ఉత్తమ ప్రతిభ కనబరుస్తోందని, గతేడాది (2017–18) కూడా రెండోస్థానాన్ని దక్కించుకుందని వివరించింది. సిబ్బంది, అధికారులు నిబద్ధతతో పని చేయడం వల్లనే ఈ గుర్తింపు వచ్చిందని ఆప్కాబ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి తెలిపారు. అదే విధంగా డీసీసీబీ స్థాయిలోనూ కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(డీసీసీబీ)కు ఉత్తమ పనితీరులో ద్వితీయ స్థానం లభించిందని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా డీసీసీబీ పరిధిలోని కొమ్ముగూడెం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం సుభాష్ యాదవ్ అవార్డును పొందినట్టు చెప్పారు. ఈ అవార్డులను నాఫ్కాబ్ డిసెంబర్‌లో ప్రదానం చేస్తుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment