Co-operative Bank
-
నాలుగు బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ: భారీ జరిమానా
కేంద్రబ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరోసారి కొరడా ఝళిపించింది. తాజాగా నిబంధలను బేఖాతరు చేసిన మరో నాలుగు కోఆపరేటివ్ బ్యాంకులకు షాకిచ్చింది. భారీ పెనాల్టీ విధించింది. 31 మార్చి 2022 నాటికి వ్యక్తిగత విచారణ సమయంలో అన్ని బ్యాంకుల ప్రత్యుత్తరాలు , మౌఖిక సమర్పణలను పరిశీలించిన తర్వాత, ఆర్బీఐ ఆదేశాలను పాటించలేదన్న ఆరోపణలు రుజువు కావడంతో ద్రవ్య పెనాల్టీ విధించబడుతుందని నిర్ధారణకు వచ్చినట్లు ప్రకటించింది. రెగ్యులేటరీ చట్టాలను ఉల్లంఘించారని పేర్కొంటూ నాలుగు సహకార బ్యాంకులపై ద్రవ్య పెనాల్టీలను విధించింది. వీటిలో మూడు బ్యాంకులు గుజరాత్‌కు చెందినవి కాగా, మరొకటి మహారాష్ట్రకు చెందింది. గుజరాత్‌కు చెందిన లాల్బాగ్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌పై అత్యధికంగా రూ.5 లక్షల జరిమానా విధించింది. ఇతర బ్యాంకుల డిపాజిట్ల ప్లేస్మెంట్ల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన మార్గదర్శకాలను ఉల్లంఘించినట్టు గుర్తించి గుజరాత్, వడోదరలోని లాల్బాగ్ కోఆపరేటివ్ బ్యాంకుకు రూ. 5 లక్షల జరిమానా విధించింది. అలాగే పలు రికరింగ్ డిపాజిట్లు, టర్మ్ డిపాజిట్ల రీపేమెంట్‌పై కస్టమర్లకు వడ్డీ సైతం చెల్లించలేదని ఆర్బీఐ తెలిపింది. అలాగే గుజరాత్, మెహసానలోని ద కోఆపరేటివ్ బ్యాంక్ ఆఫ్ మెహసాన లిమిటెడ్ పై రూ. 3.50 లక్షల పెనాట్లీ వేసింది ఆర్బీఐ. డైరెక్టర్లు, బంధువులు, సంస్థలకు ఇచ్చే లోన్లపై ఆర్బీఐ గైడ్‌లైన్స్‌ను ఈ బ్యాంక్ అతిక్రమించినట్లు గుర్తించింది. అలాగే ఇంటర్ బ్యాంక్ కౌంటర్ పార్టీ ఎక్స్పోజర్ లిమిట్ సైతం అతిక్రమించినట్లు తెలిపింది. (రూ.400 కోట్లకు అలనాటి మేటి హీరో బంగ్లా అమ్మకం: దాని స్థానంలో భారీ టవర్?) దీంతోపాటు గుజరాత్ ద హర్జి నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్‌కు రూ. 3 లక్షల మానిటరీ పెనాల్టీ విధించింది. ఆర్బీఐ సమాచారం ప్రకారం CRR నిర్వహణ, ఇతర బ్యాంకుల డిపాజిట్ల ప్లేస్మెంట్ విషయంలో నిబంధనలను పాటించలేదు. అలాగే ఇంటర్ బ్యాంక్ కౌంటర్ పార్టీ ఎక్స్పోజర్ లిమిట్ సైతం ఉల్లంఘించింది. (వాట్సాప్ చానెల్: ప్రధాని మోదీ రికార్డ్..షాకింగ్ ఫాలోవర్లు) డిపాజిట్ అకౌంట్ల నిర్వహణలో లోపాలు, నిలిచిపోయిన ఖాతాల వార్షిక సమీక్ష వైఫల్యం లాంటి కారణాలతో మహారాష్ట్ర, ముంబైకి చెందిన ద నేషనల్ కోఆపరేటివ్ బ్యాంక్ పై రూ. 1 లక్ష మానిటరీ పెనాల్టీ విధించింది రిజర్వ్ బ్యాంక్. డి విఫలమవడం వంటి కారణాలతో ఈ పెనాల్టీ విధించినట్లు తెలిపింది. -
దేశంలోనే నంబర్–1 బ్యాంక్ ఆప్కాబ్
సాక్షి, అమరావతి: సహకార బ్యాంకుల్లో ఏపీ స్టేట్ కో–ఆపరేటివ్ బ్యాంక్ (ఆప్కాబ్) సత్తా చాటుకుంది. సహకార రంగంలో దేశంలోనే నంబర్–1 బ్యాంకుగా ఎంపికైంది. 2020–21, 2021–22 సంవత్సరాలకు జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచి అవార్డులు దక్కించుకుంది. కాగా.. 2020–21 సంవత్సరానికి కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (కేడీసీసీబీ), 2021–22 సంవత్సరానికి వైఎస్సార్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (వైడీసీసీబీ) మొదటి స్థానంలో నిలిచి అవార్డులు పొందాయి. ఏటా జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన రాష్ట్ర అపెక్స్ బ్యాంకులతో పాటు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకు జాతీయ సహకార బ్యాంకుల సమాఖ్య (నాఫ్స్కాబ్) అవార్డులను ప్రదానం చేస్తోంది. 2020–21, 2021–22 ఆర్థిక సంవత్సరాలలో అత్యుత్తమ పురోగతి సాధించిన బ్యాంకులకు అవార్డులు ప్రకటించింది. ఆప్కాబ్ 2020–21లో రూ.30,587.62 కోట్లు, 2021–22లో రూ.36,732.43 కోట్ల టర్నోవర్‌తో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. రెండేళ్లపాటు వరుసగా రూ.238.70 కోట్లు, రూ.246.81 కోట్ల లాభాలను ఆప్కాబ్ ఆర్జించింది. -
ఆత్మకూరు PACS బ్యాంక్ డిపాజిట్స్ గోల్ మాల్ బాధితులకు చెక్కుల అందజేత
-
కొన్ని గంటల్లో ఈ బ్యాంక్ షట్ డౌన్: అంతకుముందే సొమ్ము తీసుకోండి!
సాక్షి,ముంబై: మరి కొన్ని గంటల్లో దేశంలో మరో బ్యాంకు మూతపడనుంది. ఖాతాదారులు తమ డిపాజిట్లను వీలైనంత ఎక్కువగా తీసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సూచిస్తోంది. అదే పూణేకు చెందిన రూపే కో-ఆపరేటివ్ బ్యాంకు. బ్యాంకు మార్గదర్శకాలను పాటించకపోవడంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. పూణేలోని రూపే కో ఆపరేటివ్‌బ్యాంకు మూసివేయాలని ఆగస్టులోనే ఆర్బీఐ ఆదేశించింది. సెప్టెంబర్ 22న బ్యాంక్ మూసివేయబడుతుందని కస్టమర్లకు ముందుగానే సమాచారం అందించారు. బ్యాంకు సజావుగా పనిచేయడానికి మూలధనం లేక, లాభదాయకంగా మారడానికి ఎలాంటి నిర్దిష్ట ప్రణాళిక లేకపోవడంతో ఆర్థిక సంక్షోభంలోపడింది. ఆ తర్వాత ఆర్బీఐ లైసెన్స్‌ను రద్దు చేసింది. అయితే తాజా నిర్ణయంతో గడువు లోపు తమ సొమ్మును తీసుకోకపోతే డిపాజిటర్లు తమ డబ్బును పోగొట్టుకుంటారా? బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం, రూ. 5 లక్షల వరకు ఖాతాదారులకు చెల్లించనున్నారు. అంటే రూ.5 లక్షల వరకు డిపాజిట్లు ఉన్నవారు తమ డబ్బును తిరిగి పొందుతారు. అయితే, ఐదు లక్షల కంటే ఎక్కువ ఉన్న వ్యక్తులు అదనపు మొత్తాన్ని వదులుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. అలాగే డీఐసీజీసీ బ్యాంకు ఖాతాదారులకు బీమా మొత్తాన్ని చెల్లిస్తుంది. -
జాతీయ స్థాయిలో ‘ఆప్కాబ్’కు ప్రథమ స్థానం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంక్ (ఆప్కాబ్) దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. రుణాల మంజూరు, వసూళ్లతోపాటు వివిధ అంశాల్లో మెరుగైన పనితీరుతో ముందుకు సాగుతోందని, రైతులు, వివిధ వర్గాల ప్రజలకు బ్యాంకు సేవలు అందుబాటులో ఉన్నాయని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కో–ఆపరేటివ్ బ్యాంక్స్ (నాఫ్కాబ్) పేర్కొంది. 2018–19 సంవత్సరంలో రాష్ట్ర, జిల్లా సహకార బ్యాంకులు, సహకార సంఘాల పనితీరును నాఫ్కాబ్ పరిశీలించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వాటి వివరాలను వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వాల ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకుంటూనే రుణాల రికవరీ, మంజూరు విషయంలో ఆప్కాబ్ గత రెండేళ్లుగా ఉత్తమ ప్రతిభ కనబరుస్తోందని, గతేడాది (2017–18) కూడా రెండోస్థానాన్ని దక్కించుకుందని వివరించింది. సిబ్బంది, అధికారులు నిబద్ధతతో పని చేయడం వల్లనే ఈ గుర్తింపు వచ్చిందని ఆప్కాబ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి తెలిపారు. అదే విధంగా డీసీసీబీ స్థాయిలోనూ కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(డీసీసీబీ)కు ఉత్తమ పనితీరులో ద్వితీయ స్థానం లభించిందని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా డీసీసీబీ పరిధిలోని కొమ్ముగూడెం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం సుభాష్ యాదవ్ అవార్డును పొందినట్టు చెప్పారు. ఈ అవార్డులను నాఫ్కాబ్ డిసెంబర్లో ప్రదానం చేస్తుందని చెప్పారు. -
వ్యవసాయ పరికరాలపై 40 శాతం రాయితీ
సాక్షి, అమరావతి: ఉత్పత్తిదారుల సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు 40 శాతం రాయితీపై వ్యవసాయ పరికరాలను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆప్కాబ్ (ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంకు) ఆర్ధిక సహకారంతో ఈ సంఘాలు పరికరాలను సమకూర్చుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించనుంది. పరికరం విలువలో 10 శాతం నిధులను సంఘాలు సమకూర్చుకుంటే, బ్యాంకులు 50 శాతం రుణం ఇస్తాయి. మిగిలిన 40 శాతం రాయితీని ప్రభుత్వం అందించనుంది. గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయపరికరాల పంపిణీలో జరిగిన అక్రమాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం అనేక మార్పులు, చేర్పులు చేసి కొత్త విధానాన్ని అమలులోకి తీసుకొస్తోంది. వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు ఆప్కాబ్ తొలుత పేర్కొన్న సంఘాలకు రాయితీపై పరికరాల పంపిణీకి నిధులు కేటాయించనుంది. ఈ మేరకు శుక్రవారం మార్గదర్శకాలను విడుదల చేసింది. ► ఆసక్తికలిగిన రైతులు ఈనెల 15లోగా సంఘాలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ సంఘాలను గ్రామస్ధాయి కమిటీలు గుర్తించాల్సి ఉంటుంది. ► పరికరాల కొనుగోలుకు దరఖాస్తు చేసుకునే సంఘాలు గతంలో ఏ బ్యాంకులోనూ రుణ ఎగవేతదారుగా ఉండకూడదు. ► కనిష్టంగా రూ. 12 లక్షల నుంచి రూ. 15 లక్షలు, గరిష్టంగా రూ. 1.20 కోట్ల నుంచి రూ. 1.30 కోట్లను ఆప్కాబ్ రుణంగా మంజూరు చేయనుంది. ► గ్రూపులకు యాంత్రిక పరికరాలను సరఫరా చేసిన తరువాతనే ఉత్పత్తిదారులకు రాయితీ మొత్తాలను ప్రభుత్వం జమ చేయనుంది. ► ఈ ఏడాదికి సంబంధించి ఒక గ్రామంలో ఒక సంఘానికే రాయితీపై రుణం అందించనుంది. ► గ్రూపులు తమకు అవసరమైన యాంత్రిక పరికరాలను ఎంపిక చేసుకునేందుకు ఉత్పత్తిదారులతో మండల, జిల్లాస్ధాయిలో ప్రదర్శనలు ఏర్పాటు కానున్నాయి. వీటిని ఈ నెల నాలుగో వారం నుంచి వచ్చేనెల 2 వారం వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ► యాంత్రిక పరికరాలను రాయితీపై పొందిన గ్రూపులు.. కస్టమ్ హైరింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసుకుని అక్కడి ఇతర రైతులకు ఆ పరికరాలను అద్దెకు ఇచ్చుకోవచ్చు. -
పాతనోట్ల పై ఆర్బీఐ విచారణ
►రెండు రోజులుగా సహకార బ్యాంకుల శాఖల్లో తనిఖీలు ►డీసీసీబీలో ఉండిపోయిన రూ.11.27 కోట్లు మోర్తాడ్ (బాల్కొండ): జిల్లా సహకార బ్యాంకులో నిల్వ ఉండిపోయిన పాతనోట్ల వ్యవహారంలో నిజానిజాలను తేల్చడానికి రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా, నాబార్డు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. రూ.1,000, రూ.500 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయగా ఆ నోట్లను బ్యాంకుల్లో డిసెంబర్ 31, 2016వరకు డిపాజిట్ చేయడానికి కేంద్రం గడువు విధించిన విషయం విదితమే. నవంబర్ 9 నుంచి రద్దు అయిన నోట్ల డిపాజిట్‌కు అంగీకరించిన కేంద్రం సహకార బ్యాంకుల్లో అదే నెల 13 నుంచి స్వీకరణను నిలిపివేసింది. నిర్వహణ సరిగా లేక పోవడం, రాజకీయ నాయకుల జోక్యంతో ఎక్కువ జమ అయిన విషయాన్ని గుర్తించిన కేంద్రం సహకారం బ్యాంకుల్లో రద్దు అయిన నోట్ల డిపాజిట్‌కు బ్రేక్ వేసింది. నవంబర్ 9, 10, 11, 12 తేదిల్లో పాత నోట్లను స్వీకరించగా జిల్లా సహకార బ్యాంకు బ్రాంచీల నుంచి రూ.43 కోట్లను సేకరించారు. ఈ నోట్ల సేకరణపై ఆర్బీఐ అనుమానాలు వ్యక్తం చేస్తూ అప్పట్లోనే విచారణ నిర్వహించింది. చివరకు రూ.43 కోట్ల విలువ చేసే నోట్లను ఆర్బీఐ స్వీకరించింది. కాగా చివరి రోజున మొదట చెప్పిన లెక్క కంటే ఎక్కువ పాత నోట్లను పలు బ్రాంచీల నుంచి సేకరించారు. ఆలా సేకరించిన నోట్లు రూ.11.27 కోట్ల వరకు ఉన్నాయి. సహకార బ్యాంకుల్లో పాత నోట్ల స్వీకరణకు బ్రేక్ వేస్తు ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేసిన సమయంలో కొన్ని బ్రాంచీల నుంచి హడావిడిగా పాత నోట్లను స్వీకరించినట్లు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. బ్లాక్ మనీని వైట్‌గా మార్చుకోవడానికి పలువురు సహకార బ్యాంకు శాఖలను ఎంచుకున్నారని, అదే నేపథ్యంలోనే నోట్ల స్వీకరణకు బ్రేక్ వేసే సమయానికి లెక్కకు మించి నోట్లను తీసుకున్నట్లు ఆర్బీఐ ఉన్నతాధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో పాతనోట్లను ఆర్బీఐ తీసుకోకపోవడంతో జిల్లా సహకార బ్యాంకు వద్ద రూ.11.27 కోట్ల విలువ చేసే నోట్లు ఉండిపోయాయి. ఈ నోట్లను ఆర్బీఐ తీసుకోకపోవడంతో సహకార బ్యాంకు నష్టాల్లో కూరుకు పోవాల్సిన దుస్థితి ఏర్పడింది. బ్యాంకులోని ఒక ఉన్నతాధికారి నిర్వాకం మూలంగానే లెక్కకు మించిన నోట్ల సేకరణ జరిగింది. ఇది ఇలా ఉండగా తాము నిబంధనల ప్రకారమే పాత నోట్లను స్వీకరించామని ఇందులో ఎలాంటి తప్పులు లేవని బ్యాంకు ఉన్నతాధికారులు, పాలకవర్గం స్పష్టం చేస్తూ ఈ నోట్లను తీసుకోవాల్సిందిగా నాబార్డు, ఆర్బీఐ అధికారులకు లేఖ రాసింది. ఈ వివాదాన్ని తేల్చడానికి ఆర్బీఐ నుంచి ఇద్దరు, నాబార్డు నుంచి పదిమంది ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. సోమవారం నుంచి బ్యాంకుల్లో విచారణను అధికారులు నిర్వహిస్తున్నారు. బ్యాంకుల్లో డిపాజిట్లు చేసిన వ్యక్తుల ఆధార్ కార్డు జిరాక్సు కాపీలను, వారి లావాదేవీల వ్యవహారాలను ఆర్బీఐ, నాబార్డు అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. జిల్లాలోని 41 సహకార బ్యాంకుల శాఖలలో విచారణ నిర్వహిస్తున్నారు. కొత్తగా ఏర్పడిన శాఖలను తనిఖీల నుంచి మినహాయించారు. -
వరంగల్ సహకార బ్యాంక్ పాలక వర్గం రద్దు
వరంగల్: వరంగల్ జిల్లా కో ఆపరేటివ్ బ్యాంకు పాలకవర్గాన్ని తెలంగాణ ప్రభుత్వం మంగళవారం సస్పెండ్ చేసింది. ఇటీవల ఈ బ్యాంకు పై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు నివేదిక ఇవ్వడంతో బ్యాంకు పాలకవర్గాన్ని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌ను ఇంచార్జిగా నియమించింది. -
సహకార బ్యాంకులకు కేంద్రం షాక్!
గరీబ్ కల్యాణ్ యోజన డిపాజిట్ల స్వీకరణపై నిషేధం • కో–ఆపరేటివ్ బ్యాంకుల్లో అవకతవకలపై ఐటీ నివేదిక నేపథ్యం న్యూఢిల్లీ: కొత్త పన్ను క్షమాభిక్ష పథకం– ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (పీఎంజీకేవై), 2016 కింద సహకార బ్యాంకులు డిపాజిట్లను స్వీకరించరాదని కేంద్రం నిర్దేశించింది. ఈ మేరకు పథకం నోటిఫికేషన్‌ను సవరించింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం కొన్ని సహకార బ్యాంకుల్లో అకౌంట్ల అవకతవకలను గుర్తించినట్లు ఆర్థికశాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)లకు ఆదాయపు పన్ను శాఖ నివేదిక నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. పాత కరెన్సీల డిపాజిట్లు తీసుకోడానికి తొలుత సహకార బ్యాంకులకు అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే పెద్ద నోట్ల రద్దు ప్రకటన ఆరు రోజుల తరువాత, ఈ డిపాజిట్లను స్వీకరించడం నుంచి సహకార బ్యాంకులను కేంద్రం మినహాయించింది. అయితే అప్పటికే దాదాపు రూ.16,000 కోట్లు సహకార బ్యాంకుల్లోని పలు అకౌంట్లలో డిపాజిట్ అయినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపు పన్ను శాఖలు గుర్తించాయి. ఏమిటీ పథకం... రూ.500, రూ.1,000 నోట్ల రద్దు తరువాత కేంద్రం పీఎంజీకేవై పథకాన్ని తీసుకువచ్చింది. నల్లకుబేరులకు సంబంధించి తాజాగా, చివరి అవకాశంగా కేంద్రం ఈ స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకాన్ని ప్రకటించింది. దీని ప్రకారం పథకానికి దరఖాస్తు పెట్టుకునే ముందే ‘వెల్లడి మొత్తానికి’ సంబంధించిన మొత్తంలో మొదట 49.9 శాతం పన్ను చెల్లించాలి. దరఖాస్తులో ఇలా పన్ను చెల్లించినట్లు ఆధారం ఉండాలి. అలాగే ఈ దరఖాస్తుకు ముందే ‘వెల్లడి మొత్తం’లో 25 శాతాన్ని వడ్డీరహిత రీతిలో నాలుగేళ్ల కాలానికి ‘లాక్–ఇన్’ విధానంలో డిపాజిట్ చేయాలి. కట్టిన పన్నును ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఇవ్వడం జరగదు. అవినీతి, బినామీ ఆస్తుల నిర్వహణ, అక్రమ ధనార్జన, విదేశీ మారకద్రవ్య నిల్వల ఉల్లంఘనలు, ఫారిన్ బ్లాక్ మనీ, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఈ పథకం వర్తించదు. డిసెంబర్ 17న ప్రారంభమైన ఈ పథకం డిక్లరేషన్లు, డిపాజిట్ల నిమిత్తం 2017 మార్చి 31 వరకూ అందుబాటులో ఉంటుంది. బ్యాంకుల్లో తప్ప సహకార బ్యాంకులను ఈ డిపాజిట్ల సేకరణ నుంచి నిషేధించినట్లు తాజాగా కేంద్రం పేర్కొంది. ఇప్పటివరకూ రూ.300 కోట్ల డిక్లరేషన్లు! ఇదిలావుండగా, ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా రూ.300 కోట్ల విలువైన డిక్లరేషన్లు వచ్చినట్లు ఆదాయపు పన్ను శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే డిక్లరేషన్ల విలువ తెలియనప్పటికీ, మహారాష్ట్రలోని 16 నగరాలకు చెందిన దాదాపు 36 మంది ఆభరణ వర్తకులు దాదాపు రూ.140 కోట్ల విలువైన డిక్లరేషన్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఐటీ అధికారుల దాడుల అనంతరం కూడా పలువురు ఈ డిక్లరేషన్లు ఇచ్చినట్లు సమాచారం. హైదరాబాద్‌కు చెందిన ఒక ప్రముఖ ఆభరణాల సంస్థ కూడా దాదాపు రూ.100 కోట్ల డిక్లరేషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. పశ్చిమ రాష్ట్రానికి చెందిన ఒక వైద్యుడు కూడా రూ.11.50 కోట్లకు సంబంధించి డిక్లరేషన్‌కు ఆదాయపు పన్ను అధికారులను సంప్రదించినట్లు తెలుస్తోంది. ముంబైకి చెందిన ఒక చిత్ర దర్శకుడు రూ.40 కోట్ల డిక్లరేషన్‌తో ముందుకు వచ్చినట్లు సమాచారం. -
బ్యాంకుల్లో కొనసాగిన రద్దీ
ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లోని తొమ్మిది బ్యాంకుల్లో శనివారం నోట్ల కోసం రద్దీ కొనసాగింది. స్థానిక సహకార బ్యాంకులో ధాన్యం అమ్ముకున్న రైతులు డబ్బుల కోసం ఉదయం నుంచే క్యూలైన్ కట్టారు. శనివారం సగం పూట బ్యాంకులు నడుస్తాయని తెలిసి ఉదయం 8గంటలకే ప్రజలు బ్యాంకుల వద్ద బారులు తీరారు. ఆదివారం సెలవు దినం కావడంతో ప్రజలు నోట్ల కోసం ఇబ్బందులు పడ్డారు. గొల్లపల్లి గ్రామీణ, ఆంధ్రాబ్యాంకులో మధ్యాహ్నం వరకే డబ్బులు అయిపోయినట్లు ప్రకటించి బ్యాంకు సిబ్బంది గేట్లకు తాళాలు వేశారు. క్యూలైన్ కట్టిన కొంత మందికి డబ్బులు అందకపోవడంతో వారు నిరాశతో ఇంటిదారిపట్టారు. రైతులు మాత్రం సహకార బ్యాంకు వద్ద సాయంత్రం వరకు పడిగాపులు కాశారు. -
ఆ డబ్బెవరిది?
నాలుగు రోజులు.. రూ.43 కోట్లు.. డీసీసీబీ డిపాజిట్లపై నాబార్డు ఆరా.. విచారణ చేపట్టిన ఉన్నతాధికారుల బృందం నిజామాబాద్ : పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో సహకార బ్యాంకుల్లోని డిపాజిట్లపై నాబార్డు ఉన్నతాధికార బృందం విచారణ చేపట్టింది. డిపాజిట్ల మాటున బ్లాక్ మనీని.. వైట్‌గా మార్చుకున్నారా? అనే దానిపై ఆరా తీసింది. నలుగురు సభ్యులతో కూడిన ఈ బృందం జిల్లాలోని కో–ఆపరేటివ్ బ్యాంకులను సందర్శించి డిపాజిట్లపై విచారణ చేపట్టింది. సుమారు మూడు రోజుల పాటు విచారణ జరిగింది. రూ.రెండు లక్షలు, అంతకు మించి డిపాజిట్ చేసిన ఖాతాలపై ఆరా తీసింది. అలాగే పెద్ద మొత్తంలో డిపాజిట్లు చేసిన ఖాతాలకు కేవైసీ ఉందా? లేదా? అనే కోణంలో విచారణజరిపింది. రూ.50 వేలకు మించి చేసిన డిపాజిట్లకు పాన్‌కార్డు జత చేశారా? వంటి అంశాలను పరిశీలించింది. డిపాజిట్ల సేకరణలో ఆర్బీఐ నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించారా? లేదా? అనే అంశాలపై విచారణ జరిగింది. రాజకీయ నేతల పాలనలో నడుస్తున్న ఈ కో–ఆపరేటివ్ బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో బ్లాక్‌మనీని, వైట్‌గా మార్చారనే ఆరోపణలు పలు రాష్ట్రాల్లో వ్యక్తమయ్యాయి. దీంతో అప్రమత్తమవైన ఆర్బీఐ విచారణ చేపట్టాలని నాబార్డును ఆదేశించింది. ఈ మేరకు నాబార్డు ఉన్నతాధికార బృందం జిల్లాలో విచారణ జరిపింది. రాష్ట్రంలో ఎక్కువ డిపాజిట్లు.. రాష్ట్రంలోనే అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 41 కో–ఆపరేటివ్ బ్యాంకులున్నాయి. వీటిలో సుమారు 1.30 లక్షల మంది ఖాతాదారులున్నారు. డిమానిటైజేషన్ నేపథ్యంలో ఇతర బ్యాంకుల మాదిరిగా కో–ఆపరేటివ్ బ్యాంకులకు పాతనోట్ల ఎక్చే ్సంజీ చేసేందుకు కేంద్రం ప్రభుత్వం మొదటి నుంచి అనుమతి ఇవ్వలేదు. కేవలం డిపాజిట్లు మాత్రమే తీసుకునేందుకు వీలు కల్పించింది. గత నెల 9, 10, 11, 12 తేదీల్లో నాలుగు రోజులు మాత్రమే డిపాజిట్లు తీసుకునేందుకు అనుమతించిన ఆర్బీఐ 13వ తేదీ నుంచి ఈ డిపాజిట్ల స్వీకరణకు కూడా బ్రేకు వేసింది. ఈ నాలుగు రోజుల్లోనే జిల్లాలో సుమారు రూ.43 కోట్ల మేరకు డిపాజిట్లు వచ్చాయి. దీంతో ఇలా ఇతర జిల్లాల్లోని కో–ఆపరేటివ్ బ్యాంకుల్లో కూడా డిపాజిట్లు రావడంతో ఆర్బీఐ నాబార్డును విచారణకు ఆదేశించింది. ఇందులో భాగంగా నాబార్డు బృందం ఈ డిపాజిట్లపై ఆరా తీసింది. ఇందులో ఏమైనా నల్లధనాన్ని తెల్లదనంగా మార్చారా? అనేక కోణంలో ఆరా తీయడం సహకార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సహకార బ్యాంకుల్లో నామమాత్ర డిపాజిట్లపై విచారణల పేరుతో హడావుడి చేసిన ప్రభుత్వం పలు ప్రైవేటు బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో జరిగిన వ్యవహారాలను ఏమాత్రం పట్టించుకోలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నల్లధనం మార్చుకునేందుకు కొన్ని ప్రైవేటు బ్యాంకులు యథేచ్ఛగా నల్ల కుబేరులకు సహకరించారనే అభిప్రాయం ఉంది. పాత నోట్ల మార్పిడితో పాటు, డిపాజిట్ల సేకరణలో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలున్నాయి. -
కేంద్రం నోటిఫికేషన్‌పై పిటిషన్ కొట్టివేత
పిటిషనర్ చర్యను ఆక్షేపించిన హైకోర్టు హైదరాబాద్: సహకార బ్యాంకులను బ్యాంకు నిర్వచన పరిధిలోకి తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం 2003లో జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ఉమ్మడి హైకోర్టు కొట్టేసింది. తీసుకున్న రుణం చెల్లించకపోవడంతో తనఖా పెట్టిన ఆస్తిని విక్రయించేందుకు సర్ఫాయిసీ చట్టం 2002 కింద ఆంధ్రప్రదేశ్ వర్ధమాన్ (మహిళా) కోఆపరేటివ్ బ్యాంకు తీసుకున్న చర్యలను హైకోర్టు సమర్థించింది. రుణాన్ని తిరిగి చెల్లించకుండా, ఆస్తిని వేలం వేయకుండా ఉండేందుకు కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేశారని పిటిషనర్ ఇందర్రాజ్ అగర్వాల్ ను ఆక్షేపించింది. అంతేకాక ఆస్తిని విక్రయించకుండా బ్యాంకును అడ్డుకునేందుకు సైతం శతవిధాలా ప్రయత్నించారంది. దీనికిగాను అగర్వాల్‌కు రూ.25వేల జరిమానా విధించిన కోర్టు, ఆ మొత్తాన్ని వర్ధమాన్ బ్యాంకుకు చెల్లించాలంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. హైదరాబాద్‌కు చెందిన ఇందర్రాజ్ అగర్వాల్ భాగస్వామిగా లక్ష్మీ షుగర్స్ పేరుతో ఓ కంపెనీని స్థాపించారు. వర్ధమాన్ బ్యాంకు నుంచి రుణం పొందేటప్పుడు తనకు ఫతేనగర్‌లో ఉన్న 200 గజాల స్థలాన్ని తనఖా పెట్టారు. రుణం చెల్లించకపోవడంతో తనఖా పెట్టిన ఆస్తి వేలానికి బ్యాంకు నోటీసులు జారీ చేయగా, అగర్వాల్ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ గతంలో కూడా పలు న్యాయస్థానాలను, ట్రిబ్యునళ్లను ఆశ్రయించి వేలం నోటీసులను అడ్డుకున్నట్లు ధర్మాసనం దృష్టికి వచ్చింది. రుణాన్ని ఎగవేసేందుకు, బ్యాంకు చర్యలను అడ్డుకునేందుకే ఎప్పుడో 12 ఏళ్ల క్రితం కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌ను ఇప్పుడు సవాలు చేశారని తెలిపింది. -
బ్యాంకు అధికారుల జబర్దస్త్..
అప్పు తీర్చలేదని ఇంటికి తాళం.. మరో ఇంట్లో సామగ్రిని తీసుకెళ్లిన వైనం దౌల్తాబాద్/దేవరకద్ర: రుణం చెల్లించలేదని బ్యాంకు అధికారులు ఓ ఇంటికి తాళం వేయడంతోపాటు, మరోఇంట్లో సామగ్రిని బలవంతంగా తీసుకెళ్లారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ రెండు సంఘటనలు వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్నాయి. దౌల్తాబాద్ మండలంలోని గోకఫసల్వాద్ కు చెందిన చాకలి సాయన్న, సొండె చిన్నసాయప్ప కొడంగల్ సహకార బ్యాంకులో 2012లో రుణం తీసుకున్నారు. సాయన్న రూ.53 వేలు,, సొండె చిన్నసాయప్ప రూ.61వేల అప్పు ఉన్నాడు. బకాయిలను చెల్లించాలని నాలుగేళ్లుగా నోటీసులు పంపుతన్నా స్పందించకపోవడంతో శనివారం బ్యాంకు అధికారులు వారి ఇంట్లో ఉన్న టీవీ, ఇతర సామగ్రిని తమ వాహనంలో తీసుకెళ్లారు. దేవరకద్ర మండల కేంద్రానికి చెందిన బైండ్ల రాములు, మల్లేశ్వరి దంపతులు 2011లో ఇంటి నిర్మాణం కోసం స్థానిక గ్రామీణ బ్యాంకులో రూ. 3 లక్షల రుణం తీసుకున్నారు. అయితే కేవలం 4 నెలల రుణం బకాయిలు చెల్లించినందున బ్యాంకు అధికారులు ఇంటిని సీజ్‌చేసి వెళ్లారు. -
వారు సామాన్యులు ‘కారు’
రూ.10 కోట్ల సొత్తు దోపిడీ రెండేళ్లలో ఎనిమిది బ్యాంకుల్లో చోరీలు ‘జులాయి’ స్ఫూర్తితో కార్యకలాపాలు ఇదీ రాంజీ ముఠా తీరు సిటీబ్యూరో: ఒకటీ... రెండూ కాదు... ఏకంగా రూ.10 కోట్ల విలువైన బంగారం... నగదు దోచుకున్నారు. రెండేళ్ల వ్యవధిలో 8 బ్యాంకులను కొల్లగొట్టి... పోలీసులకు సవాల్ విసిరారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరువలో విల్లాలు కొని... ‘విలాసం’గా మార్చుకున్నారు. వాటి కేంద్రంగా కార్యకలాపాలు సాగించారు.... ఇదీ చెన్నైకి చెందిన రాంజీ ముఠా దోపిడీ తీరు. వీరి గుట్టు రట్టవడంతో చెన్నైకి చెక్కేశారు. ఇలా దొరికారు... జనవరి 11వ తేదీ అర్ధరాత్రి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని జిల్లా సహకార బ్యాంకు (డీసీసీబీ) దోపిడీ యత్నం కేసులో అగంతకులు ఇన్నోవా కారును వదిలి పరారయ్యారు. ఈ కారు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని ఎనిమిది బ్యాంకు దోపిడీ కేసుల మిస్టరీ వీడేందుకు సహకరించింది. కారుపై లభించిన అగంతకుల వేలిముద్రల ఆధారంగా చెన్నైకి చెందిన రాంజీ ముఠా దోపిడీలకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. దోపిడీ సొత్తుతో ఈ ముఠా శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో మూడు విల్లాలను కొనుగోలు చేసి అక్కడే మకాం వేశారు. పోలీసులు పసిగట్టే లోపు వాటిని ఇతరులకు విక్రయించి చెన్నైకి పారిపోయారు. దీన్ని గుర్తించిన సైబరాబాద్ పోలీసులు విల్లాలను సీజ్ చేశారు. రాంజీ ముఠా కోసం మూడు ప్రత్యేక పోలీసు బృందాలు చెన్నై వెళ్లాయి. గజదొంగల వరకు.. చెన్నైకి చెందిన రాంజీ ముఠాలో నలుగురి నుంచి ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. పదేళ్ల క్రితం ఈ ముఠా బస్సులు, బస్‌స్టాపులు, రైళ్లు, రైల్వే స్టేషన్లలో చిన్న చిన్న చోరీలు చేసేవారు. అనేకసార్లు పోలీసులకు పట్టుబడి జైళ్లకు వెళ్లివచ్చారు. అయినా పద్ధతి మార్చుకోలేదు. చోరీలే వృత్తిగా మలుచుకున్న ఈ ముఠా సభ్యులు ఐదేళ్లుగా ప్రజల దృష్టి మరల్చి దోచుకోవడం మొదలుపెట్టారు. బ్యాంకు నుంచి డబ్బు తీసుకుపోతున్న వారు... నగలు వేసుకున్న వారి దృష్టి మరల్చి దోచుకోవడం ప్రారంభించారు. ఇలా మూడేళ్లలో వంద కు పైగా నేరాలు చేశారు. ఆ తరువాత గజదొంగల అవతారం ఎత్తి బ్యాంక్‌లను టార్గెట్ చేసుకున్నారు. ‘జులాయి’ చూసి... అల్లు అర్జున్ నటించిన ‘జులాయి’ చూసిన ఈ ముఠా ఇక నుంచి బ్యాంకులను దోచుకోవాలనే ఆలోచనకు వచ్చారు. ఆ సినిమాలో చూపినట్టుగా ఊచలు కోసేందుకు కట్టర్, గ్యాస్ కట్టర్, వాహనాన్ని ఉపయోగించారు. మొదటిసారిగా వీరు అక్టోబర్ 9, 2013న కడప జిల్లా రాజంపేటలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో రూ.కోటి విలువైన బంగారు ఆభరణాలు, నగదు దోచుకున్నారు. అనంతరం మహబూబ్‌నగర్, రంగారెడ్డి, చిత్తూరు తదితర ప్రాంతాల్లో ఎనిమిది బ్యాంకుల నుంచి సుమారు రూ.10 కోట్లు దోచుకున్నారు. విల్లాలు సీజ్... దోచుకున్న సొత్తుతో గత ఏడాది వీరు శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో రూ.2 కోట్లతో మూడు విల్లాలను కొనుగోలు చేశారు. అక్కడి నుంచే దోపిడీలకు ‘స్కెచ్’ వేసేవారు. ఇబ్రహీంపట్నంలో జనవరి 11న డీసీసీబీలో చోరీకి ఇన్నోవా వాహనంలో వెళ్లారు. బ్యాంకులోకి చొరబడుతుండగా పోలీసుల రావడంతో కారును అక్కడే వదిలి పారిపోయారు. వాహనంపై ఉన్న వేలి ముద్రలను పోలీసులు సంపాదించడంతో రాంజీ ముఠా గుట్టు రట్టయ్యింది. పోలీసులు వెదుకుతున్నారని తెలుసుకున్న ముఠా సభ్యులు విల్లాలను రూ.కోటిన్నరకు విక్రయించి పారిపోయారు. విషయం తెలుసుకున్న సైబరాబాద్ పోలీసుల ఆ మూడు విల్లాలను సీజ్ చేశారు. రాంజీ ముఠా భరతం పట్టేందుకు చెన్నైలో జల్లెడ పడుతున్నారు. ఇదీ దోపిడీల చిట్టా... జిల్లా ప్రాంతం బ్యాంకు తేదీ సొత్తు కడప రాజంపేట ఏపీజీబీ 10-09-2013 రూ.కోటి మహబూబ్‌నగర్ బాలనగర్ గ్రామీణ వికాస 11-08-2014 రూ.6 కోట్లు రంగారెడ్డి ఘట్కేసర్ దక్కన్గ్రామీణ 09-12-2014 రూ.35 లక్షలు రంగారెడ్డి ఇబ్రహీంపట్నం డీసీసీబీ 11-01-2015 దోపిడీ యత్నం చిత్తూరు వరదయ్యపాళ్యం సప్తగిరి గ్రామీణ 14-11-2014 రూ.కోటి మూడు జిల్లాల్లో మరో మూడు బ్యాంకులు -
‘నవ’ వసంతానికి నాంది పలకాలి
కొన్ని గంటల్లో పాత సంవత్సరానికి టాటా చెప్పబోతున్నాం. కొత్త వసంతాన్ని ఆహ్వానించనున్నాం. ఎంతో ఉత్సాహంగా స్వాగత సంబరాలకు సిద్ధవుతున్నాం. కొంగొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టాలని యోచిస్తున్నాం. గతించిన సంవత్సరంలో చేసిన తప్పులను మననం చేసుకుంటూ కొత్తఏట వాటిని పునరావృత్తం కాకుండా చూడాలని తలస్తున్నాం. ఆనందంగా నవ వసంతానికి ఆహ్వానం పలకాలని ఆకాంక్షిస్తున్నాం. ఈ నేపథ్యంలో మనం బాగుండాలి.. మన సమాజం బాగుండాలి అనే నినాదంతో ముందుకు సాగాలి. నవోదయాన సంతోషాల హరివిల్లు విరియాలంటే నవ సూత్రాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.. అవేమిటంటే.. - సాక్షి నెట్వర్క్ పొదుపు పాటిద్దాం పొదుపు పాటించడం అలవాటు చేసుకుంటే జీవితాల్లో ప్రగతి సాధించవచ్చు. ఆర్థిక బాధల నుంచి గట్టెక్కవచ్చు. రోజూ కొంత మొత్తాలను దాయడాన్ని చిన్నారులకూ అలవాటు చేయాలి. ఫలితంగా వారికి ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది. వారి ఎదుగుదలకు తోడ్పడుతుంది. నేషనల్ బ్యాంకుల్లోనే కాకుండా దగ్గరలోని కో-ఆపరేటివ్ బ్యాంకుల్లోనూ పొదుపు ఖాతాలు ప్రారంభించవచ్చు. చాలా బ్యాంకులు ప్రస్తుతం పొదుపు పథకాలు ప్రవేశపెట్టాయి. వాటిల్లో మనకు ఉపకరించేవి ఏవో ఎంచుకోవాలి. జనధన్ పథకం ద్వారా ఉచితంగా బ్యాంకు ఖాతాలు ప్రారంభిస్తున్నారు. రూ. ఐదు వేల రుణం ఇస్తారు. కొన్ని బ్యాంకులు ఖాతాదారులకు బీమా కల్పిస్తున్నాయి. ఆంధ్రాబ్యాంకులో అభయ గోల్డ్, అభయా సేవింగ్స్, అభయ్ జీవన్ వంటి పథకాలతో బీమా వసతి కల్పిస్తున్నారు. {పైవేటు పొదుపు సంస్థలతో అప్రమత్తంగా ఉండాలి. అధిక వడ్డీ ఆశకు లోనుకావద్దు. - ఇ.పెంచలయ్య. ఏజీఎం, ఆంధ్రాబ్యాంకు, రాజమండ్రి మహిళలను గౌరవిద్దాం మహిళలను గౌరవించడం మన సంప్రదాయం. దీనిని పాటిస్తూ భావి తరాలకూ ఆ స్పృహ కలిగించాలి. ఫలితంగా మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు చెక్ పెట్టవచ్చు. వరకట్న వేధింపులు, ఈవ్‌టీజింగ్, గృహహింస వంటి అంశాల్లో బలైపోతున్న అబలలకు అండగా నిలవాలి. ఈ చట్టాలపై అందరికీ అవగాహన కల్పించాలి. జిల్లా కేంద్రంతోపాటు రాజమండ్రి, అమలాపురం, తుని, రావులపాలెం, రామచంద్రపురం వంటి ప్రాంతాల్లో ఈవ్ టీజింగ్‌పై ప్రస్తుతం నిఘా కొరవడిందనే విమర్శలు వినవస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు విద్య, వసతి గృహాలు, వ్యాపార సంస్థల్లో మహిళల రక్షణ కోసం భద్రతా చర్యలు లేవు. ఈ నేపథ్యంలో కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈవ్ టీజింగ్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. ఈ చట్టం ప్రకారం.. బాధిత యువతులు వెంటనే ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేయాలి ఫిర్యాదు అందుకున్న ప్రిన్సిపాల్ ఈవ్టీజింగ్నకు పాల్పడిన విద్యార్థిని, యువకుడిపై చర్య తీసుకోవాలి. పోలీసులకూ ఫిర్యాదు చేయాలి. పోలీసులు దర్యాప్తు అనంతరం కేసు నమోదు చేస్తారు. ఈవ్‌టీజింగ్ నిరూపణ అయితే కనీసం మూడేళ్ల జైలు లేదా ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వరకూ నాన్ బెయిలబుల్ జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తారు. {పతి కళాశాల ఆవరణ, తరగతి గదుల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ఇబ్బందుల్లో ఉన్న యువతులు, మహిళలు 1091కు కాల్ చేయాలి. యువకులు ఈవ్‌టీజింగ్‌కు పాల్పడి భవితను నాశనం చేసుకోకూడదు. కఠిన శిక్షలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త! - కృష్ణ ప్రసన్న, డీఎస్పీ ట్రాఫిక్, రాజమండ్రి పరిశుభ్రతపై దృష్టిపెడదాం వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత మన జీవితంలో అంతర్భాగం. ఈ రెంటిలో ఏది పాటించకపోయినా నష్టపోయేది మనమే. రోగాలు ప్రబలుతాయి. ఒళ్లు, ఇల్లు గుల్లవుతాయి. అందరూ పరిశుభ్రత పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యం కష్టమేమి కాదని వైద్యులు చెబుతున్నారు. వ్యక్తిగత పరిశుభ్రతపై దృష్టి పెట్టాలి. దీనిపై పిల్లలకు అవగాహన కల్పించాలి. ఇంటి పరిశుభ్రత, వంట సామగ్రి శుభ్రత పాటించాలి. ఏదైనా తినే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. దైనందిన జీవితంలో చేసే పనులు క్రమపద్ధతిలో చేయాలి. పరిసరాల పరిశుభ్రత పాటించాలి. రోజుల తరబడి చెత్తను నిలవ ఉంచకూడదు. - డాక్టర్ మూర్తి, హెల్త్ ఆఫీసర్, రాజమండ్రి యోగా చేద్దాం ఒత్తిళ్లతో కూడిన ప్రస్తుత సమాజంలో అందరికీ యోగా అవసరం. దీనివల్ల ఆరోగ్యంతోపాటు క్రమశిక్షణ అలవడుతుంది. మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. రోజుకు ఓ గంటైనా యోగా చేయాలి. యోగాతో ఏకాగ్రత పెరుగుతుంది. ఒత్తిళ్లు తొలగిపోతాయి. ఉత్సాహంగా, చురుగ్గా ఉంటారు. - చిట్టూరి చంద్రశేఖర్, యోగా కోచ్, యోగా రత్న అవార్డు గ్రహీత, తాటిపాక ఇంధన పొదుపు చేసేద్దాం ఇంధన వినియోగం ఎక్కువైంది. వనరులు తగ్గిపోయాయి. ఫలితంగా భవిష్యత్తులో కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. అందుకే అందరూ ఇంధన పొదుపు పాటించాలి. విద్యుత్ వినియోగంపైనా దృష్టిపెట్టాలి. ఎల్ఈడీ, సీఎఫ్ఎల్ లైట్ల వాడకాన్ని అలవర్చుకోవాలి. అవసరం లేకుండా ఫ్యాన్లు, లైట్లు వేయకూడదు. ఇళ్లలో వృథాను అరికట్టండి. {sాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనాల ఇంజిన్ ఆపేయాలి. దీనివల్ల పెట్రోలు ఆదా అవుతుంది. రోడ్లపై ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కూడా అలా చేస్తే మంచిది. ఎవరికి వారు పెట్రోలు పొదుపు పాటించాలి. తక్కువ దూరం ఉన్నప్పుడు సైకిళ్లపైగానీ, నడక ద్వారా గానీ వెళ్లడం మంచిది. ఇది ఆరోగ్యానికీ శుభసూచిక. వాహనాలను నీడలో పార్క్‌చేస్తే పెట్రోల్ ఆవిరి కాదు. వాహనాల మైలేజ్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేయండి. పొగవస్తుంటే తక్షణం సర్వీసింగ్ చేయించండి. వారానికి ఓ సారి మోటారు వాహనాలకు హాలిడే ప్రకటించండి. సౌర విద్యుత్ వాడకాన్ని పెంచాలి. - ఎన్. గంగాధర్, ఎస్ఈ, ఏపీఈపీడీసీఎల్, రాజమండ్రి రోడ్లపై అప్రమత్తత అవసరం రోడ్లపై ప్రయాణించేటప్పుడు అందరూ అప్రమత్తంగా ఉండాలి. వాహనాలు వాడేవారు వేగ నియంత్రణ పాటించాలి. ప్రయాణాలు చేసేటప్పుడు ఒత్తిడిని అధిగమించాలి. ఎటువంటి ఆలోచనలూ పెట్టుకోకూడదు. {sాఫిక్ నిబంధనలు పాటించాలి. వాహనాలు నడిపేటప్పుడు ఏకాగ్రత అవసరం మద్యం సేవించి వాహనాలు నడపకూడదు. అధిక లోడు, అతివేగం అనర్థదాయకం ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి. నిర్దేశిత ప్రదేశాల్లో వాహనాలు పార్కింగ్ చేయాలి. - ఎ. మోహన్, డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్, కాకినాడ మద్యం మానేద్దాం మద్యం మహమ్మారికి ఎన్నో కుటుంబాలు బలైపోతున్నాయి. వికృత నేరప్రవృత్తిని మద్యం ప్రేరేపిస్తోంది. దీనివల్ల ఎన్నో అనర్థాలు తలెతుత్తాయి. ఆరోగ్యానికీ హాని. మద్యం అలవాటు ఉన్నవాళ్లు మానేయాలి. మద్యం వల్ల మెదడు అదుపు తప్పుతుంది. తిన్నది వంటబట్టదు. నరాల బలహీనత సంభవిస్తోంది. {బెయిన్ డెడ్ అయ్యే ప్రమాదం ఉంది. మద్యం అలవాటు ఉన్న వాళ్లు దానికి క్రమేపీ దూరంగా ఉండడానికి యత్నించాలి. {Mమం తప్పకుండా తాగేవారు ఒక్కసారిగా మానేయకూడదు. దీనివల్ల ఒక్కోసారి ప్రాణానికీ ప్రమాదం వాటిల్లుతుంది. మద్యం ప్రియులకు నయానా భయానా నచ్చజెప్పి ఆ అలవాటు మాన్పించాలి. దురుసుగా మాట్లాడితే వారు మనస్తాపానికి చెంది మరింత పేట్రేగే ప్రమాదం ఉంది. - డాక్టర్ కె. రత్నకుమార్, సివిల్ అసిస్టెంట్ సర్జన్, కాకినాడ జీజీహెచ్ ఆహార నియమాలు పాటిద్దాం ఉరుకుల,పరుగుల జీవన యానంలో అందరూ ఆహార నియమాలు పాటించాలి. మితంగా పౌష్టికాహారం తీసుకోవాలి. తినేవాటి విషయంలో శ్రద్ధపెట్టకుంటే అనర్థాలు తప్పవు. రోడ్డు పక్కన దొరికే జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి. నూనె పదార్థాలు తగ్గించాలి. రోజూ ఆరు గ్లాసుల నీళ్లు తాగాలి. ఆహారంలో సమతౌల్యత పాటించాలి. వైద్యుల సూచనలు పాటించాలి. రసాయన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. రోజూ వ్యాయామం చేయాలి. ఆవిరి ద్వారా ఉడికించిన పదార్థాలు చాలా మంచిది. హడావుడిగా ఆహారం తీసుకోకూడదు. వారానికి ఒక సారి ఉపవాసం ఉంటే మంచిది. భోజన వేళలు కచ్చితంగా పాటించాలి. మొబైల్ ఫోబియా వదిలేద్దాం ప్రస్తుతం మొబైల్ ఫోన్ల వినియోగం జీవితంలో భాగమైపోయింది. దీని వల్ల ఎన్నో అనర్థాలు ఉన్నాయి. వీటి వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించేందుకు అందరూ చర్యలు తీసుకోవాలి. మొబైల్ ఎక్కువసేపు వాడడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. స్మార్ట్ఫోన్ల వల్ల ఇంటర్నెట్ చూడడం వ్యసనంలా మారుతుంది. చెడు అలవాట్లు అబ్బుతాయి. యువత స్మార్ట్ఫోన్లకు దూరంగా ఉండాలి. రాత్రుళ్లు నిద్రపోయే సమయంలో ఫోన్లలో మాట్లాడకూడదు. - ఎ. మణిబాబు, లెక్చరర్ ఇన్ ఫిజిక్స్, రాజమండ్రి -
సహకార బ్యాంకుల్లో రూ.184కోట్ల రుణాలు మాఫీ
గజ్వేల్: జిల్లాలోని సహకార బ్యాంకు ల ద్వారా రైతులకు రూ.184 కోట్ల రుణమాఫీ వర్తిస్తుందని, ఇందులో ఇప్పటివరకు పావువంతు రూ.44 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయినట్లు డీసీసీబీ చైర్మన్ జైపాల్‌రెడ్డి తెలి పారు. శనివారం గజ్వేల్‌లోని సహకార బ్యాంకులో ఇద్దరు రైతులకు రుణమాఫీ చెక్కులు అందజేశారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని సహకార బ్యాంకుల్లో 56951 మంది రైతులు రుణాలు పొం దారని వారందరికీ రుణమాఫీ వర్తిస్తుందని చెప్పారు. ఈనెల 15లోగా రైతులు తమ రుణాలను రెన్యువల్ చేసుకొని ‘జీరో’ వడ్డీని పొందాలని సూచిం చారు. గజ్వేల్ నియోజకవర్గంలో 5149మంది రైతు లు రుణాల పొందారని చెప్పారు. వీరికి రూ.13.7కోట్ల రుణమాఫీ వర్తిస్తుందన్నారు. జాతీయ బ్యాంకులకు దీటు గా తమ బ్యాంకు సేవలందిస్తుందని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, జనరల్ మేనేజర్ శివకోటేశ్వర్‌రావు, గజ్వేల్ మండల సహకార సంఘం చైర్మన్ వెంకట్‌నర్సింహారెడ్డి, స్థానిక బ్రాంచ్ మేనేజర్ కొండల్‌రెడ్డి పాల్గొన్నారు. కొండపాక: కొండపాక పీఏసీఎస్‌లో రుణాలు తీసుకున్న 826 మంది రైతులకు 2కోట్ల 56లక్షల రూపాయల రుణమాఫీ వచ్చిందని దేవేందర్‌రెడ్డి చెప్పారు. దీంట్లో 25 శాతం కింద రూ.61 లక్షలు పీఏసీఎస్‌కు చేరాయన్నారు. రైతులు ఈ నెల 15 వరకు తమ రుణాలను రెన్యూవల్ చేయించుకోవాలని సూచించారు. లేనిపక్షంలో రెండో విడత విడుదలయ్యే మాఫీ డబ్బులకు ఇబ్బందులెదురవుతాయన్నారు. రెన్యువల్ చేసుకుంటే జీరో శాతం వడ్డీ లేదంటే రైతులకు 13 శాతం వడ్డీ పడుతుందన్నారు. -
పీఏసీఎస్‌లలో రూ. 320 కోట్ల రుణాలు మాఫీ
దేవరకద్ర : జిల్లాలో ఉన్న 77 సహకార బ్యాంకుల్లో 320 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలు మాఫీ అవుతాయని డీసీసీ బ్యాంకు డీఎం వెంకటస్వామి తెలిపారు. దీనివల్ల 1.72లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుందని చెప్పారు. గురువారం ఆయన దేవరకద్రలోని సహకారబ్యాంకును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 మార్చి 31 వరకు పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలకు సంబంధించిన జాబితాలను రూపాందించి గ్రామాల వారిగా అందజేశామన్నారు. ఎక్కడైనా పొరబాట్లు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఒక కుటుంబానికి రూ.లక్ష వరకు రుణమాఫీ ఇవ్వడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. కుటుంబాల వారీగా రుణమాఫీకి అర్హులను గుర్తిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని అన్ని బ్రాంచిలను ఆన్లైన్ చేశామని, లావాదేవీలు దేశ వ్యాప్తంగా జరుపుకోడానికి అవకాశం ఉందని తెలిపారు. త్వరలో ఏటీంలను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపారు. అనంతరం ఆయన బ్యాంకు సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. -
పంట రుణాల మాఫీకి..సవా‘లక్షన్నర’ తిరకాసులు
పంట రుణాల మాఫీకి ప్రభుత్వం సవా‘లక్షన్నర’ తిరకాసులు పెట్టింది. నిబంధనల పేరుతో రైతుల నోట్లో మట్టి కొట్టి.. మాఫీ భారాన్ని తగ్గించుకునేందుకు ఎత్తులు వేస్తోంది. సహకార బ్యాంకుల్లో మార్చిలోపు రెన్యువల్ చేసుకున్న రైతులకు మాఫీ వర్తింపజేయరాదని పెట్టిన నిబంధనతో జిల్లాలో 65 వేల మంది రైతులకు రూ.200 కోట్ల మేర మాఫీ చేయకుండా ఎగ్గొట్టేందుకు ఎత్తు వేస్తోంది. మార్చిలోపు రుణాలు చెల్లించిన రైతులకు మాఫీ చేయబోమని స్పష్టీకరించింది. ఓటు దాటాక రుణమాఫీకి షరతులు పెడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై రైతులు మండిపడుతున్నారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: అధికారమే లక్ష్యంగా ఎన్నికల్లో చంద్రబాబు హామీలవర్షం కురిపించారు. ఒక్క పంట రుణాల మాఫీ హామీనే టీడీపీని అధికారంలో కూర్చోబెట్టిందని ఆ పార్టీ ఎమ్మెల్యేలే అంగీకరిస్తున్నారు. చంద్రబాబు హామీ ఇచ్చిన మేరకు జిల్లాలో 8.7లక్షల మంది రైతులు తీసుకున్న రూ.11,180.25 కోట్ల పంట రుణాలను మాఫీ చేయాలి. కానీ.. ఆ హామీ అమలు భారాన్ని కనిష్ట స్థాయికి చేర్చేందుకు చంద్రబాబు తనదైన శైలిలో మెలికలు పెడుతున్నారు. మార్చి 31, 2014లోపు రుణాలు తీసుకున్న రైతులందరికీ మాఫీ వర్తింపజేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేశాక నిర్వహించిన తొలి మంత్రివర్గ సమావేశంలో అదే ప్రకటనను పునరుద్ఘాటించారు. కానీ.. ఈనెల 14న పంట రుణాల మాఫీకి జారీచేసిన మార్గదర్శకాల్లో మాత్రం సవాలక్షన్నర మెలికలు పెట్టారు. ఒక్కో కుటుంబానికి రూ.లక్షన్నరకు మించకుండా రుణామఫీ చేస్తామని షరతు పెట్టారు. పోనీ.. ఆ ఒక్క షరతుకైనా పరిమితమయ్యారా అంటే అదీ లేదు. ఆ రూ.లక్షన్నర మాఫీకి కూడా మెలికలు పెట్టారు. సహకార రుణాల మాఫీ లేనట్లే.. జిల్లాలో సహకార బ్యాంకు పరిధిలోని ప్రాథమిక సహకార వ్యవసాయ పరపతి సంఘాల్లో 65 వేల మంది రైతులు రూ.200 కోట్ల మేర పంట రుణాలు తీసుకున్నారు. గడువులోపు రుణాలు చెల్లిస్తే వడ్డీ మాఫీ వర్తిస్తుందన్న నెపంతో సహకార అధికారులు రైతుల అభిప్రాయాలతో నిమిత్తం లేకుండానే రెన్యువల్ చేశారు. మార్చిలోపు రెన్యువల్ చేసుకున్న రుణాలను మాఫీ చేసేది లేదని ప్రభుత్వం స్పష్టీకరించడంతో 65 వేల మంది రైతులు నష్టపోనున్నారు. ఈ నిబంధనపై రైతులు, సహకారశాఖ అధికారులు మండిపడుతున్నారు. ఆ నిబంధనను సడలించాలని ఇటీవల డీసీసీబీ చైర్మన్ అమాస రాజశేఖరరెడ్డి సీఎం చంద్రబాబును కోరినట్లు సమాచారం. ఇక మార్చి లోపు రుణాలు చెల్లించిన రైతులకు కూడా మాఫీ చేసేది లేదని ప్రభుత్వం మెలిక పెట్టింది. సకాలంలో చెల్లించిన రైతులకూ రుణ మాఫీ వర్తింపజేస్తామని బీరాలు పలికిన చంద్రబాబు.. ఇప్పుడు మాట మార్చడంపై అన్నదాతలు మండిపడుతున్నారు. రుణ మాఫీ కటాఫ్ డేట్‌ను మార్చి 31, 2014 నుంచి డిసెంబర్ 31, 2013కు తగ్గించడంపై కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతన్నను అష్టకష్టాలు పెడుతోన్న వైనం.. రుణ మాఫీకి ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాల్లో 30 అంశాలతో కూడిన ప్రొఫార్మాలోని నిబంధనలకు రైతులు ఆధారాలు చూపించాల్సి ఉంది. ఇందులో ప్రధానమైనది మీ సేవా కేంద్రాల నుంచి అడంగల్ తీసుకోవడం. రెవెన్యూ రికార్డులను కంప్యూటరీకరించడంలో తప్పులు దొర్లాయి. పట్టాదారు పాసు పుస్తకంలో ఒక సర్వే నెంబర్ ఉంటే.. మీ సేవా రికార్డుల్లో మరొక నెంబరు ఉంది. దీనివల్ల అడంగల్ తీసుకోవడం రైతులకు తలనొప్పిగా మారింది. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పట్టాదారు పాసుపుస్తకం, సెల్ నెంబరు, బ్యాంకు పాసు పుస్తకం జిరాక్సు కాపీలను అటు బ్యాంకు.. ఇటు రెవెన్యూ అధికారులకు అందించాల్సి వస్తోంది. అందులో ఏ ఒక్క కార్డు లేకపోయినా రుణ మాఫీ వర్తించదంటూ హెచ్చరిస్తున్నారు. ఒక రైతు కుటుంబంలో ఎంత మంది సభ్యులుంటే అందరి ఆధార్‌కార్డులనూ అందించాల్సి వస్తోంది. కుటుంబంలో ఏ ఒక్కరి ఆధార్‌కార్డు సమర్పించకపోయినా మాఫీకి లబ్ధిదారులుగా ఎంపిక చేయకూడదని ప్రభుత్వం నిబంధన పెట్టడం రైతులను ఇరకాటంలోకి నెట్టింది. ప్రభుత్వం పెట్టిన నిబంధనలను పరిశీలిస్తోన్న బ్యాంకర్లు.. ‘జిల్లాలో రైతులు తీసుకున్న రూ.11,180.25 కోట్లలో రూ.1100 కోట్ల మేర కూడా మాఫీ అయ్యే అవకాశం లేదు’ అని అంచనా వేస్తోండటం గమనార్హం. రైతుల నోట్లో మట్టి కొట్టిన వైనం.. గత ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. వేరుశెనగ రైతులకు వాతావరణ బీమా పరిహారం కింద రూ.102 కోట్ల పరిహారం అందాల్సి ఉంది. ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులకు రూ.108 కోట్ల మేర ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేయాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు. కానీ.. పంట రుణాల మాఫీ మార్గదర్శకాల్లో మాత్రం రుణాల మాఫీ నేపథ్యంలో బీమా పరిహారం రైతులకు ఇచ్చేది లేదని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ నిర్ణయం వల్ల రైతులు రూ.102 కోట్ల మేర నష్టపోవాల్సి వస్తోంది. ఈనెల 20న ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఇన్పుట్ సబ్సిడీకి ఒక్క పైసా కూడా నిధులు కేటాయించలేదు. అంటే.. ఇన్పుట్ సబ్సిడీ కూడా ప్రభుత్వం మంజూరు చేయదన్న మాట. ఇన్పుట్ సబ్సిడీ రూపంలో రూ.108 కోట్ల మేర రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ఒక్క రుణ మాఫీ పేరుతో రూ.210 కోట్ల బీమా పరిహారం, ఇన్‌ఫుట్ సబ్సిడీని రైతులకు ఎగ్గొట్టినట్లు స్పష్టమవుతోంది. రుణమాఫీ పేరుతో ఓట్లేయించుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు వంచిస్తుండడంతో దీనికి నిరసనగా రైతులు కదంతొక్కేందుకు సిద్ధమవుతున్నారు. సొసైటీ బ్యాంకులో బంగారు రుణాలు మాఫీ లేదంట నా భార్య ముంతాజ్ పేరిట పీటీఎంలోని సొసైటీ బ్యాంకులో రెండేళ్ల క్రితం బంగారాన్ని కుదువ పెట్టి రూ.20 వేలు రుణం తీసుకున్నాము. ఎన్నికల టైంలో నాయకులు వచ్చి ఏ బ్యాంకులోనైనా బంగారు లోన్లు వున్నా అన్నీ మాఫీ చేస్తామని మభ్యబెట్టినారు. కష్టకాలంలో మాకు ఎవరు ఆదుకుంటే ఏం అని వాళ్లను నమ్మి ఓట్లు వేసాం. ఇప్పుడేమో సొసైటీ బ్యాంకులో ఉన్న బంగారు రుణాలు మాఫీ కావని చెబుతావుండారు. ఏం చేయాలో దిక్కు తోచడం లేదు. నమ్మినోళ్లను నట్టేట ముంచుతారని ఎవరికి తెలుసు ? -మహబూబ్‌బాషా, పీటీఎం మండలం చెప్పేదొకటి చేసేదొకటి నాకు ఐదెకరాల పొలం వుంది. నా పట్టాదార్ పాసుబుక్కును కందుకూరు సప్తగిరి గ్రామీణ బ్యాంకులో కుదువ బెట్టి గతంలో రూ.30 వేల పంట రుణం తీసుకున్నాను. గత ఏడాది వడ్డీతో కలిపి రూ.37 వేలు చెల్లించేసా. ముఖ్యమంత్రి చంద్రబాబు చూస్తే బ్యాంకులో తీసుకున్న పంట రుణాలను గత ఏడాదిలో చెల్లించినా కూడా ఆ సొమ్ము రైతుల ఖాతాలోకి జమ చేస్తామని హామీ ఇస్తే పోయిన ప్రాణం లేచివచ్చినట్లైంది. ఇప్పుడే మో పూటకోమాట మాట్లాడుతున్నారు. మాటమీద నిలబడని నాయకులు చెప్పేదొకటి, చేసేదొకటా ? -కనకంటి వెంకట్రమణ, పట్టెంవాండ్లపల్లి, పీటీఎం హామీ ఇచ్చి మాఫీ మరిచారు అధికారం కోసం చంద్రబాబు ఎన్నికల సమయంలో రుణమాఫీ చేస్తామంటూ ఇచ్చిన హామీ అధికారం వచ్చాక మరిచారు. ఇప్పుడు ఒక్కో కుటుంబానికి రూ.1.50లక్షల మాఫీ అంటున్నారు. ఇచ్చిన హామీ నెరవేర్చడంలో జాప్యం చేస్తూ మాలాంటి రైతులను మోసం చేయడం తగదు. -వెంకటరమణ, రైతు, మేడుపల్లె, మదనపల్లె రూరల్ నిధి పేరుతో ఏమార్చారు పొదుపు, గ్రూపు సంఘాల మహిళలకు అన్ని విధాలా తోడుంటానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు గ్రూపునకు రూ.లక్ష చొప్పున నిధి పేరుతో ఏమార్చుతున్నారు. అప్పు రూపాయి కూడా పోయేలాలేదు. మహిళలకు ఇచ్చిన హామీనెరవేర్చలేని సీఎం ఇక ప్రజల కష్టాలు గురించి ఏం పట్టించుకుంటారు. -సుభద్రమ్మ, మొరాలు, మదనపల్లె రూరల్ నిర్ధిష్ట ప్రకటన చేయాలి రుణమాఫీపై ప్రభుత్వం రోజుకు విధంగా ప్రకటన చేస్తూ రైతులను తికమకపెట్టి మనోవేదనకు గురిచేస్తోంది. ముఖ్యమంత్రి 2014 మార్చి నెల 31వ తేది లోపు తీసుకున్న అప్పులకు రుణమాఫీ వర్తిస్తుందని ప్రకటన చేశారు. ఆర్థికమంత్రి యనమల రామక్రిష్ణుడు 2013 డిసెంబర్ 31 లోపు రుణాలకే మాఫీ వర్తిస్తుందనడం సరికాదు. నేను కౌలు రైతును. బ్యాంకులో రూ.18వేలు పంట రుణం తీసుకున్నాను. వడ్డీతో కలిపి రూ.24వేలకు పైగా చెల్లించాలని లాయర్ ద్వారా నాకు, జామీన్‌దారునికి నోటీసులు పంపారు. అవమానభారంతో రెన్యూవల్ చేశాం. ఇప్పుడు ఆ లోను వర్తిస్తుందా? లేదా? అనే అనుమానం కలుగుతోంది. -రవీంద్ర, కౌలు రైతు, మూలపల్లె, తంబళ్లపల్లె మండలం రుణాలు మొత్తం మాఫీ చేయాలి రైతులు తీసుకున్న అన్ని రకాల రుణాలను ప్రభుత్వం పూర్తిగా మాఫీ చేయాలి. చంద్రబాబు ఎన్నికల ముందు ఓ మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇం కోమాట చెప్పడం మంచిది కా దు. వ్యవసాయ రుణాలు పూర్తి గా మాఫీ చేస్తారని రైతులు ఆశతో ఓటు వేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం అన్ని రకాల రుణాలు మాఫీ చేయా లి లేకుంటే రైతులు ఉద్యమం చేపట్టాల్సి వస్తుంది. -ఈ.వెంకటాచలం నాయుడు, జిల్లా రైతు ఉద్యమ నేత, పెనుమూరు మండలం. చంద్రబాబుకు రాజకీయ సన్యాసమే చంద్రబాబు నాయుడు రైతులను మోసంచేసి అధికారంలో వచ్చారు. రుణమాఫీ చేస్తానని చెప్పి తప్పించుకోడానికి రోజు కో మెలిక పెడుతూ రైతుల నడ్డివిరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఏడాదిలో తీసుకొన్న రుణా లు మాఫీలేదని చెప్పడం దారుణం. రైతులకు ఆత్మహత్యలు తప్ప గత్యంతరం లేదు. రైతులు ఇక చంద్రబాబుని నమ్మరు. ప్రజలు తిరగబడే సమయం వస్తుంది. -పార్థసారథిరెడ్డి, తిప్పనపల్లె, పూతలపట్టు మండలం -
మాఫీకి మరిన్ని ఆంక్షలు..!
* ఈ ఏడాది జనవరి నుంచి మార్చిలోగా రుణాలు చెల్లించినవారికి మాఫీ వర్తించదు * సహకార బ్యాంకుల్లో రుణాలు రెన్యువల్ చేసుకున్న 16.55 లక్షల రైతులకూ మొండిచేయి సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ భారాన్ని తగ్గించుకునేందుకు చంద్రబాబునాయుడు ప్రభుత్వం అన్నివిధాలా ప్రయత్నిస్తోంది. ఎక్కడికక్కడ కోతలు విధించిడం ద్వారా వీలైనంతమంది రైతుల్ని మాఫీ పరిధి నుంచి తప్పించేలా నిబంధనలు విధిస్తోంది. ఎన్నికల హామీ సందర్భంగా ఎటువంటి ఆంక్షలు విధంచకుండా మాఫీ చేస్తానని పేర్కొన్న చంద్రబాబు.. ఇప్పటికే కుటుంబానికి లక్షన్నర వరకు మాత్రమే మాఫీ అంటూ పరిమితి విధించారు. తర్వాత మరో అడుగు ముందుకేసి గత ఏడాది డిసెంబర్ వరకు తీసుకున్న రుణాలకే మాఫీ అన్నారు. ఈ ఏడాది మార్చి వరకు వడ్డీని మాత్రమే మాఫీ పరిధిలోకి తీసుకుంటామనే నిబంధన కూడా విధించారు. ఇంతటితో ఆగకుండా తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించిన రైతులకు, అలాగే సహకార బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ఆ రుణాలను రెన్యువల్ చేసుకున్న రైతులకు మాఫీలో మొండిచేయి చూపించారు. రుణ మాఫీ మార్గదర్శకాల్లో ప్రభుత్వం పెట్టిన ఈ మెలిక ను చూస్తే.. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి నెలాఖరులోగా రుణాలు చెల్లించిన వారికి, అలాగే ఆ మధ్య కాలంలో రుణాలను రీ షెడ్యూల్ చేసుకున్న రైతులకు రుణ మాఫీ వర్తించదనే విషయం స్పష్టమైంది. ముఖ్యంగా ఈ నిబంధన సహకార బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతుల పాలిట శాపంగా మారింది. సహకార బ్యాంకుల్లో రుణాలను రైతులు జనవరి నుంచి మార్చి నెల మధ్య కాలంలోనే రెన్యువల్ చేసుకున్నారని, అయితే ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్ వరకు గల రుణాలే మాఫీ పరిధిలోకి వస్తాయని పేర్కొనడంతో సహకార సంఘాల్లో రుణాలు తీసుకున్న 16,55,665 మంది రైతులకు చెందిన రూ.6,172 కోట్లు ఇప్పుడు మాఫీ పరిధిలోకి రావడం లేదని ఆప్కాబ్ అధికారులు తెలిపారు. గ్రామాల్లోని సహకార బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతులకు మాఫీ వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని చెప్పారు. ఈ రైతులు తమ రుణాలను రెన్యువల్ చేసుకున్నందున జనవరి తర్వాత తీసుకున్న కొత్త రుణాలుగా మారిపోయాయని వివరించారు. మరోపక్క వాణిజ్య బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతులు జనవరి నుంచి మార్చి మధ్యకాలంలో రుణాలు చెల్లించేసి కొత్త రుణాలు తీసుకున్నారని, అలాంటి క్రమశిక్షణ కలిగిన రైతులు వేల సంఖ్యలో ఉంటారని, వారికి మాఫీ వర్తింప చేయకపోవడం అంటే క్రమశిక్షణను నిరుత్సాహపరచడమే అవుతుందని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ.. జనవరి నుంచి మార్చి మధ్యకాలంలో అనేక బ్యాంకులు ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధిక మొత్తంలో రైతులకు బంగారంపై వ్యవసాయ రుణాలను మంజూరు చేసిందని, ఈ నేపథ్యంలోనే ఆ కాలంలో రుణాలకు మాఫీ వర్తింప చేయడం లేదని పేర్కొంది. అయితే బంగారం రుణాలను మినహాయించి మిగతా పంట రుణాలు చెల్లించిన వారికి మాఫీ వర్తింప చేయూలని ఎస్ఎల్బీసీ కోరింది. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదని బ్యాంకర్లు తెలిపారు. రుణ మాఫీ సాధ్యమా కాదా అనే ఆలోచన లేకుండా హామీ ఇచ్చి ఇప్పుడు బ్యాంకర్లపై నిందలు మోపేలా ప్రభుత్వంలోని కొంతమంది వ్యవహరించడం శోచనీయమని వారు వ్యాఖ్యానిస్తున్నారు. -
అప్పు.. ముప్పు
బ్యాంకు అప్పు ఆ రైతన్న కుటుంబానికి ముప్పు తెచ్చిపెట్టింది. తీసుకున్న రుణం తీర్చలేదని వడ్డీవ్యాపారులను తలపించేరీతిలో సహకార బ్యాంక్ సిబ్బంది హంగామా సృష్టించి అన్నదాత పరువును బజారుకీడ్చింది. అప్పుచెల్లించలేదని మండలంలోని బునియాదిపురం గ్రామంలో అధికారులు ఓ రైతు కొడుకుల ఇంటి సామానును స్వాధీనం చేసుకున్నారు. బాధితుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన రైతు బాలయ్య గౌడ్ 1993లో వ్యవసాయ బావి మరమ్మతుల కోసం రూ.23,400, డీజిల్ ఇంజన్ కోసం మరో రూ.11,500 చొప్పున మొత్తం రూ.34,900 మండలంలోని రంగాపూర్ సింగిల్‌విండో బ్యాంకు ద్వారా రుణం తీసుకున్నాడు. అప్పు తీసుకుని రెండేళ్లు దాటకముందే అనారోగ్యంతో బాలయ్యగౌడ్ మృతిచెందాడు. ఆయనకు ఐదుగురు కొడుకులు ఉండగా, ఇద్దరు మృతిచెందారు. తండ్రి చేసిన అప్పు విషయాన్ని కొడుకులు మరిచిపోయారు. అప్పుకు వడ్డీతో కలిపి 2014 ఫిబ్రవరి నాటికి రూ.2.40లక్షలు చెల్లించాలని అధికారులు రికార్డుల్లో కెక్కించారు. ఇదిలాఉండగా, గురువారం వనపర్తి డీసీబీ బ్యాంక్ మేనేజర్ సత్యప్రకాశ్, పెబ్బేరు సింగిల్ విండో సిబ్బందితో కలిసి బునియాదిపురం గ్రామానికి వెళ్లారు. బాలయ్యగౌడ్ కొడుకుల ఇళ్ల వద్దకు చేరుకున్న వారు అప్పు తీర్చనందుకు మీ సామానులను జప్తుచేస్తున్నట్లు చెప్పి దౌర్జన్యంగా వారి ఇళ్ల తలుపులు, టీవీ ఇతర సామగ్రిని జీపులోకి ఎక్కించుకుని పెబ్బేరు సింగిల్ విండో కార్యాలయానికి వెళ్లారు. ఈ విషయమై పెబ్బేరు సింగిల్ విండో కార్యాలయంలో ఉన్న డీసీసీబీ బ్యాంక్ మేనేజర్ సత్యప్రకాశ్‌ను వివరణ కోరగా.. సమాధానం దాటవేశారు. రైతుల వద్ద నుంచి నిర్బంధంగా అప్పులు వసూలు చేయరాదని జీఓ ఉన్నా సామగ్రిని ఎందుకు తీసుకొచ్చారన్న ప్రశ్నకు సమాధానం కరువైంది. తండ్రి పేర ఉన్న అప్పును ఆయన కుమారులు చెల్లించేందుకు అంగీకార పత్రం రాసిచ్చారని అధికారులు చూపించిన పత్రం బోగస్‌గా తేలడం కొసమెరుపు.