కేంద్రం నోటిఫికేషన్‌పై పిటిషన్ కొట్టివేత
పిటిషనర్ చర్యను ఆక్షేపించిన హైకోర్టు
హైదరాబాద్: సహకార బ్యాంకులను బ్యాంకు నిర్వచన పరిధిలోకి తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం 2003లో జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ఉమ్మడి హైకోర్టు కొట్టేసింది. తీసుకున్న రుణం చెల్లించకపోవడంతో తనఖా పెట్టిన ఆస్తిని విక్రయించేందుకు సర్ఫాయిసీ చట్టం 2002 కింద ఆంధ్రప్రదేశ్ వర్ధమాన్ (మహిళా) కోఆపరేటివ్ బ్యాంకు తీసుకున్న చర్యలను హైకోర్టు సమర్థించింది. రుణాన్ని తిరిగి చెల్లించకుండా, ఆస్తిని వేలం వేయకుండా ఉండేందుకు కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేశారని పిటిషనర్ ఇందర్‌రాజ్ అగర్వాల్ ను ఆక్షేపించింది. అంతేకాక ఆస్తిని విక్రయించకుండా బ్యాంకును అడ్డుకునేందుకు సైతం శతవిధాలా ప్రయత్నించారంది.
దీనికిగాను అగర్వాల్‌కు రూ.25వేల జరిమానా విధించిన కోర్టు, ఆ మొత్తాన్ని వర్ధమాన్ బ్యాంకుకు చెల్లించాలంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. హైదరాబాద్‌కు చెందిన ఇందర్‌రాజ్ అగర్వాల్ భాగస్వామిగా లక్ష్మీ షుగర్స్ పేరుతో ఓ కంపెనీని స్థాపించారు. వర్ధమాన్ బ్యాంకు నుంచి రుణం పొందేటప్పుడు తనకు ఫతేనగర్‌లో ఉన్న 200 గజాల స్థలాన్ని తనఖా పెట్టారు. రుణం చెల్లించకపోవడంతో తనఖా పెట్టిన ఆస్తి వేలానికి బ్యాంకు నోటీసులు జారీ చేయగా, అగర్వాల్ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ గతంలో కూడా పలు న్యాయస్థానాలను, ట్రిబ్యునళ్లను ఆశ్రయించి వేలం నోటీసులను అడ్డుకున్నట్లు ధర్మాసనం దృష్టికి వచ్చింది. రుణాన్ని ఎగవేసేందుకు, బ్యాంకు చర్యలను అడ్డుకునేందుకే ఎప్పుడో 12 ఏళ్ల క్రితం కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌ను ఇప్పుడు సవాలు చేశారని తెలిపింది.