బ్యాంకుల్లో కొనసాగిన రద్దీ
ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లోని తొమ్మిది బ్యాంకుల్లో శనివారం నోట్ల కోసం రద్దీ కొనసాగింది. స్థానిక సహకార బ్యాంకులో ధాన్యం అమ్ముకున్న రైతులు డబ్బుల కోసం ఉదయం నుంచే క్యూలైన్ కట్టారు. శనివారం సగం పూట బ్యాంకులు నడుస్తాయని తెలిసి ఉదయం 8గంటలకే ప్రజలు బ్యాంకుల వద్ద బారులు తీరారు. ఆదివారం సెలవు దినం కావడంతో ప్రజలు నోట్ల కోసం ఇబ్బందులు పడ్డారు.
గొల్లపల్లి గ్రామీణ, ఆంధ్రాబ్యాంకులో మధ్యాహ్నం వరకే డబ్బులు అయిపోయినట్లు ప్రకటించి బ్యాంకు సిబ్బంది గేట్లకు తాళాలు వేశారు. క్యూలైన్ కట్టిన కొంత మందికి డబ్బులు అందకపోవడంతో వారు నిరాశతో ఇంటిదారిపట్టారు. రైతులు మాత్రం సహకార బ్యాంకు వద్ద సాయంత్రం వరకు పడిగాపులు కాశారు.