వారు సామాన్యులు ‘కారు’
రూ.10 కోట్ల సొత్తు దోపిడీ
రెండేళ్లలో ఎనిమిది బ్యాంకుల్లో చోరీలు
‘జులాయి’ స్ఫూర్తితో కార్యకలాపాలు
ఇదీ రాంజీ ముఠా తీరు
సిటీబ్యూరో: ఒకటీ... రెండూ కాదు... ఏకంగా రూ.10 కోట్ల విలువైన బంగారం... నగదు దోచుకున్నారు. రెండేళ్ల వ్యవధిలో 8 బ్యాంకులను కొల్లగొట్టి... పోలీసులకు సవాల్ విసిరారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరువలో విల్లాలు కొని... ‘విలాసం’గా మార్చుకున్నారు. వాటి కేంద్రంగా కార్యకలాపాలు సాగించారు.... ఇదీ చెన్నైకి చెందిన రాంజీ ముఠా దోపిడీ తీరు. వీరి గుట్టు రట్టవడంతో చెన్నైకి చెక్కేశారు.
ఇలా దొరికారు...
జనవరి 11వ తేదీ అర్ధరాత్రి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని జిల్లా సహకార బ్యాంకు (డీసీసీబీ) దోపిడీ యత్నం కేసులో అగంతకులు ఇన్నోవా కారును వదిలి పరారయ్యారు. ఈ కారు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని ఎనిమిది బ్యాంకు దోపిడీ కేసుల మిస్టరీ వీడేందుకు సహకరించింది. కారుపై లభించిన అగంతకుల వేలిముద్రల ఆధారంగా చెన్నైకి చెందిన రాంజీ ముఠా దోపిడీలకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. దోపిడీ సొత్తుతో ఈ ముఠా శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో మూడు విల్లాలను కొనుగోలు చేసి అక్కడే మకాం వేశారు. పోలీసులు పసిగట్టే లోపు వాటిని ఇతరులకు విక్రయించి చెన్నైకి పారిపోయారు. దీన్ని గుర్తించిన సైబరాబాద్ పోలీసులు విల్లాలను సీజ్ చేశారు. రాంజీ ముఠా కోసం మూడు ప్రత్యేక పోలీసు బృందాలు చెన్నై వెళ్లాయి.
గజదొంగల వరకు..
చెన్నైకి చెందిన రాంజీ ముఠాలో నలుగురి నుంచి ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. పదేళ్ల క్రితం ఈ ముఠా బస్సులు, బస్‌స్టాపులు, రైళ్లు, రైల్వే స్టేషన్‌లలో చిన్న చిన్న చోరీలు చేసేవారు. అనేకసార్లు పోలీసులకు పట్టుబడి జైళ్లకు వెళ్లివచ్చారు. అయినా పద్ధతి మార్చుకోలేదు. చోరీలే వృత్తిగా మలుచుకున్న ఈ ముఠా సభ్యులు ఐదేళ్లుగా ప్రజల దృష్టి మరల్చి దోచుకోవడం మొదలుపెట్టారు. బ్యాంకు నుంచి డబ్బు తీసుకుపోతున్న వారు... నగలు వేసుకున్న వారి దృష్టి మరల్చి దోచుకోవడం ప్రారంభించారు. ఇలా మూడేళ్లలో వంద కు పైగా నేరాలు చేశారు. ఆ తరువాత గజదొంగల అవతారం ఎత్తి బ్యాంక్‌లను టార్గెట్ చేసుకున్నారు.
‘జులాయి’ చూసి...
అల్లు అర్జున్ నటించిన ‘జులాయి’ చూసిన ఈ ముఠా ఇక నుంచి బ్యాంకులను దోచుకోవాలనే ఆలోచనకు వచ్చారు. ఆ సినిమాలో చూపినట్టుగా ఊచలు కోసేందుకు కట్టర్, గ్యాస్ కట్టర్, వాహనాన్ని ఉపయోగించారు. మొదటిసారిగా వీరు అక్టోబర్ 9, 2013న కడప జిల్లా రాజంపేటలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో రూ.కోటి విలువైన బంగారు ఆభరణాలు, నగదు దోచుకున్నారు. అనంతరం మహబూబ్‌నగర్, రంగారెడ్డి, చిత్తూరు తదితర ప్రాంతాల్లో ఎనిమిది బ్యాంకుల నుంచి సుమారు రూ.10 కోట్లు దోచుకున్నారు.
విల్లాలు సీజ్...
దోచుకున్న సొత్తుతో గత ఏడాది వీరు శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో రూ.2 కోట్లతో మూడు విల్లాలను కొనుగోలు చేశారు. అక్కడి నుంచే దోపిడీలకు ‘స్కెచ్’ వేసేవారు. ఇబ్రహీంపట్నంలో జనవరి 11న డీసీసీబీలో చోరీకి ఇన్నోవా వాహనంలో వెళ్లారు. బ్యాంకులోకి చొరబడుతుండగా పోలీసుల రావడంతో కారును అక్కడే వదిలి పారిపోయారు. వాహనంపై ఉన్న వేలి ముద్రలను పోలీసులు సంపాదించడంతో రాంజీ ముఠా గుట్టు రట్టయ్యింది. పోలీసులు వెదుకుతున్నారని తెలుసుకున్న ముఠా సభ్యులు విల్లాలను రూ.కోటిన్నరకు విక్రయించి పారిపోయారు. విషయం తెలుసుకున్న సైబరాబాద్ పోలీసుల ఆ మూడు విల్లాలను సీజ్ చేశారు. రాంజీ ముఠా భరతం పట్టేందుకు చెన్నైలో జల్లెడ పడుతున్నారు.
ఇదీ దోపిడీల చిట్టా...
జిల్లా ప్రాంతం బ్యాంకు తేదీ సొత్తు
కడప రాజంపేట ఏపీజీబీ 10-09-2013 రూ.కోటి
మహబూబ్‌నగర్ బాలనగర్ గ్రామీణ వికాస 11-08-2014 రూ.6 కోట్లు
రంగారెడ్డి ఘట్‌కేసర్ దక్కన్‌గ్రామీణ 09-12-2014 రూ.35 లక్షలు
రంగారెడ్డి ఇబ్రహీంపట్నం డీసీసీబీ 11-01-2015 దోపిడీ యత్నం
చిత్తూరు వరదయ్యపాళ్యం సప్తగిరి గ్రామీణ 14-11-2014 రూ.కోటి
మూడు జిల్లాల్లో మరో మూడు బ్యాంకులు