సాక్షి, అమరావతి: సహకార బ్యాంకుల్లో ఏపీ స్టేట్ కో–ఆపరేటివ్ బ్యాంక్ (ఆప్కాబ్) సత్తా చాటుకుంది. సహకార రంగంలో దేశంలోనే నంబర్–1 బ్యాంకుగా ఎంపికైంది. 2020–21, 2021–22 సంవత్సరాలకు జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచి అవార్డులు దక్కించుకుంది. కాగా.. 2020–21 సంవత్సరానికి కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (కేడీసీసీబీ), 2021–22 సంవత్సరానికి వైఎస్సార్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (వైడీసీసీబీ) మొదటి స్థానంలో నిలిచి అవార్డులు పొందాయి.
ఏటా జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన రాష్ట్ర అపెక్స్ బ్యాంకులతో పాటు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకు జాతీయ సహకార బ్యాంకుల సమాఖ్య (నాఫ్‌స్కాబ్) అవార్డులను ప్రదానం చేస్తోంది. 2020–21, 2021–22 ఆర్థిక సంవత్సరాలలో అత్యుత్తమ పురోగతి సాధించిన బ్యాంకులకు అవార్డులు ప్రకటించింది. ఆప్కాబ్ 2020–21లో రూ.30,587.62 కోట్లు, 2021–22లో రూ.36,732.43 కోట్ల టర్నోవర్‌తో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. రెండేళ్లపాటు వరుసగా రూ.238.70 కోట్లు, రూ.246.81 కోట్ల లాభాలను ఆప్కాబ్ ఆర్జించింది.
Comments
Please login to add a commentAdd a comment