పంట రుణాల మాఫీకి..సవా‘లక్షన్నర’ తిరకాసులు | Crop loans | Sakshi
Sakshi News home page

పంట రుణాల మాఫీకి..సవా‘లక్షన్నర’ తిరకాసులు

Published Thu, Aug 28 2014 2:46 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

పంట రుణాల మాఫీకి..సవా‘లక్షన్నర’ తిరకాసులు - Sakshi

పంట రుణాల మాఫీకి..సవా‘లక్షన్నర’ తిరకాసులు

పంట రుణాల మాఫీకి ప్రభుత్వం సవా‘లక్షన్నర’ తిరకాసులు పెట్టింది. నిబంధనల పేరుతో రైతుల నోట్లో మట్టి కొట్టి.. మాఫీ భారాన్ని తగ్గించుకునేందుకు ఎత్తులు వేస్తోంది. సహకార బ్యాంకుల్లో మార్చిలోపు రెన్యువల్ చేసుకున్న రైతులకు మాఫీ వర్తింపజేయరాదని పెట్టిన నిబంధనతో జిల్లాలో 65 వేల మంది రైతులకు రూ.200 కోట్ల మేర మాఫీ చేయకుండా ఎగ్గొట్టేందుకు ఎత్తు వేస్తోంది. మార్చిలోపు రుణాలు చెల్లించిన రైతులకు మాఫీ చేయబోమని స్పష్టీకరించింది. ఓటు దాటాక రుణమాఫీకి షరతులు పెడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై రైతులు మండిపడుతున్నారు.
 
సాక్షి ప్రతినిధి, తిరుపతి: అధికారమే లక్ష్యంగా ఎన్నికల్లో చంద్రబాబు హామీలవర్షం కురిపించారు. ఒక్క పంట రుణాల మాఫీ హామీనే టీడీపీని అధికారంలో కూర్చోబెట్టిందని ఆ పార్టీ ఎమ్మెల్యేలే అంగీకరిస్తున్నారు. చంద్రబాబు హామీ ఇచ్చిన మేరకు జిల్లాలో 8.7లక్షల మంది రైతులు తీసుకున్న రూ.11,180.25 కోట్ల పంట రుణాలను మాఫీ చేయాలి. కానీ.. ఆ హామీ అమలు భారాన్ని కనిష్ట స్థాయికి చేర్చేందుకు చంద్రబాబు తనదైన శైలిలో మెలికలు పెడుతున్నారు.

మార్చి 31, 2014లోపు రుణాలు తీసుకున్న రైతులందరికీ మాఫీ వర్తింపజేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేశాక నిర్వహించిన తొలి మంత్రివర్గ సమావేశంలో అదే ప్రకటనను పునరుద్ఘాటించారు. కానీ.. ఈనెల 14న పంట రుణాల మాఫీకి జారీచేసిన మార్గదర్శకాల్లో మాత్రం సవాలక్షన్నర మెలికలు పెట్టారు. ఒక్కో కుటుంబానికి రూ.లక్షన్నరకు మించకుండా రుణామఫీ చేస్తామని షరతు పెట్టారు. పోనీ.. ఆ ఒక్క షరతుకైనా పరిమితమయ్యారా అంటే అదీ లేదు. ఆ రూ.లక్షన్నర మాఫీకి కూడా మెలికలు పెట్టారు.
 
సహకార రుణాల మాఫీ లేనట్లే..

జిల్లాలో సహకార బ్యాంకు పరిధిలోని ప్రాథమిక సహకార వ్యవసాయ పరపతి సంఘాల్లో 65 వేల మంది రైతులు రూ.200 కోట్ల మేర పంట రుణాలు తీసుకున్నారు. గడువులోపు రుణాలు చెల్లిస్తే వడ్డీ మాఫీ వర్తిస్తుందన్న నెపంతో సహకార అధికారులు రైతుల అభిప్రాయాలతో నిమిత్తం లేకుండానే రెన్యువల్ చేశారు. మార్చిలోపు రెన్యువల్ చేసుకున్న రుణాలను మాఫీ చేసేది లేదని ప్రభుత్వం స్పష్టీకరించడంతో 65 వేల మంది రైతులు నష్టపోనున్నారు.

ఈ నిబంధనపై రైతులు, సహకారశాఖ అధికారులు మండిపడుతున్నారు. ఆ నిబంధనను సడలించాలని ఇటీవల డీసీసీబీ చైర్మన్ అమాస రాజశేఖరరెడ్డి సీఎం చంద్రబాబును కోరినట్లు సమాచారం. ఇక మార్చి లోపు రుణాలు చెల్లించిన రైతులకు కూడా మాఫీ చేసేది లేదని ప్రభుత్వం మెలిక పెట్టింది. సకాలంలో చెల్లించిన రైతులకూ రుణ మాఫీ వర్తింపజేస్తామని బీరాలు పలికిన చంద్రబాబు.. ఇప్పుడు మాట మార్చడంపై అన్నదాతలు మండిపడుతున్నారు. రుణ మాఫీ కటాఫ్ డేట్‌ను మార్చి 31, 2014 నుంచి డిసెంబర్ 31, 2013కు తగ్గించడంపై కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
రైతన్నను అష్టకష్టాలు పెడుతోన్న వైనం..
 
రుణ మాఫీకి ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాల్లో 30 అంశాలతో కూడిన ప్రొఫార్మాలోని నిబంధనలకు రైతులు ఆధారాలు చూపించాల్సి ఉంది. ఇందులో ప్రధానమైనది మీ సేవా కేంద్రాల నుంచి అడంగల్ తీసుకోవడం. రెవెన్యూ రికార్డులను కంప్యూటరీకరించడంలో తప్పులు దొర్లాయి. పట్టాదారు పాసు పుస్తకంలో ఒక సర్వే నెంబర్ ఉంటే.. మీ సేవా రికార్డుల్లో మరొక నెంబరు ఉంది. దీనివల్ల అడంగల్ తీసుకోవడం రైతులకు తలనొప్పిగా మారింది.

ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పట్టాదారు పాసుపుస్తకం, సెల్ నెంబరు, బ్యాంకు పాసు పుస్తకం జిరాక్సు కాపీలను అటు బ్యాంకు.. ఇటు రెవెన్యూ అధికారులకు అందించాల్సి వస్తోంది.  అందులో ఏ ఒక్క కార్డు లేకపోయినా రుణ మాఫీ వర్తించదంటూ హెచ్చరిస్తున్నారు. ఒక రైతు కుటుంబంలో ఎంత మంది సభ్యులుంటే అందరి ఆధార్‌కార్డులనూ అందించాల్సి వస్తోంది.

కుటుంబంలో ఏ ఒక్కరి ఆధార్‌కార్డు సమర్పించకపోయినా మాఫీకి లబ్ధిదారులుగా ఎంపిక చేయకూడదని ప్రభుత్వం నిబంధన పెట్టడం రైతులను ఇరకాటంలోకి నెట్టింది. ప్రభుత్వం పెట్టిన నిబంధనలను పరిశీలిస్తోన్న బ్యాంకర్లు.. ‘జిల్లాలో రైతులు తీసుకున్న రూ.11,180.25 కోట్లలో రూ.1100 కోట్ల మేర కూడా మాఫీ అయ్యే అవకాశం లేదు’ అని అంచనా వేస్తోండటం గమనార్హం.
 
రైతుల నోట్లో మట్టి కొట్టిన వైనం..
 
గత ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. వేరుశెనగ రైతులకు వాతావరణ బీమా పరిహారం కింద రూ.102 కోట్ల పరిహారం అందాల్సి ఉంది. ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులకు రూ.108 కోట్ల మేర ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరు చేయాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు. కానీ.. పంట రుణాల మాఫీ మార్గదర్శకాల్లో మాత్రం రుణాల మాఫీ నేపథ్యంలో బీమా పరిహారం రైతులకు ఇచ్చేది లేదని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ నిర్ణయం వల్ల రైతులు రూ.102 కోట్ల మేర నష్టపోవాల్సి వస్తోంది.

ఈనెల 20న ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఇన్‌పుట్ సబ్సిడీకి ఒక్క పైసా కూడా నిధులు కేటాయించలేదు. అంటే.. ఇన్‌పుట్ సబ్సిడీ కూడా ప్రభుత్వం మంజూరు చేయదన్న మాట. ఇన్‌పుట్ సబ్సిడీ రూపంలో రూ.108 కోట్ల మేర రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ఒక్క రుణ మాఫీ పేరుతో రూ.210 కోట్ల బీమా పరిహారం, ఇన్‌ఫుట్ సబ్సిడీని రైతులకు ఎగ్గొట్టినట్లు స్పష్టమవుతోంది. రుణమాఫీ పేరుతో ఓట్లేయించుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు వంచిస్తుండడంతో దీనికి నిరసనగా రైతులు కదంతొక్కేందుకు సిద్ధమవుతున్నారు.
 
సొసైటీ బ్యాంకులో బంగారు రుణాలు మాఫీ లేదంట
 
నా భార్య ముంతాజ్ పేరిట పీటీఎంలోని సొసైటీ బ్యాంకులో రెండేళ్ల క్రితం బంగారాన్ని కుదువ పెట్టి రూ.20 వేలు రుణం తీసుకున్నాము. ఎన్నికల టైంలో నాయకులు వచ్చి ఏ బ్యాంకులోనైనా బంగారు లోన్లు వున్నా అన్నీ మాఫీ చేస్తామని మభ్యబెట్టినారు. కష్టకాలంలో మాకు ఎవరు ఆదుకుంటే ఏం అని వాళ్లను నమ్మి ఓట్లు వేసాం. ఇప్పుడేమో సొసైటీ బ్యాంకులో ఉన్న బంగారు రుణాలు మాఫీ కావని చెబుతావుండారు. ఏం చేయాలో దిక్కు తోచడం లేదు. నమ్మినోళ్లను నట్టేట ముంచుతారని ఎవరికి తెలుసు ?
 -మహబూబ్‌బాషా,  పీటీఎం మండలం

చెప్పేదొకటి చేసేదొకటి
 
నాకు ఐదెకరాల పొలం వుంది. నా పట్టాదార్ పాసుబుక్కును కందుకూరు సప్తగిరి గ్రామీణ బ్యాంకులో కుదువ బెట్టి  గతంలో రూ.30 వేల పంట రుణం తీసుకున్నాను. గత ఏడాది వడ్డీతో కలిపి రూ.37 వేలు చెల్లించేసా. ముఖ్యమంత్రి చంద్రబాబు చూస్తే బ్యాంకులో తీసుకున్న పంట రుణాలను గత ఏడాదిలో చెల్లించినా కూడా ఆ సొమ్ము రైతుల ఖాతాలోకి జమ చేస్తామని హామీ ఇస్తే పోయిన ప్రాణం లేచివచ్చినట్లైంది. ఇప్పుడే మో పూటకోమాట మాట్లాడుతున్నారు. మాటమీద నిలబడని నాయకులు చెప్పేదొకటి, చేసేదొకటా ?
-కనకంటి వెంకట్రమణ, పట్టెంవాండ్లపల్లి, పీటీఎం
 
హామీ ఇచ్చి మాఫీ మరిచారు
అధికారం కోసం చంద్రబాబు ఎన్నికల సమయంలో రుణమాఫీ చేస్తామంటూ ఇచ్చిన హామీ అధికారం వచ్చాక మరిచారు. ఇప్పుడు ఒక్కో కుటుంబానికి రూ.1.50లక్షల మాఫీ అంటున్నారు. ఇచ్చిన హామీ నెరవేర్చడంలో జాప్యం చేస్తూ మాలాంటి రైతులను మోసం చేయడం తగదు.
 -వెంకటరమణ, రైతు, మేడుపల్లె, మదనపల్లె రూరల్

నిధి పేరుతో ఏమార్చారు
పొదుపు, గ్రూపు సంఘాల మహిళలకు అన్ని విధాలా తోడుంటానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు గ్రూపునకు రూ.లక్ష చొప్పున నిధి పేరుతో ఏమార్చుతున్నారు. అప్పు రూపాయి కూడా పోయేలాలేదు. మహిళలకు ఇచ్చిన హామీనెరవేర్చలేని సీఎం ఇక ప్రజల కష్టాలు గురించి ఏం పట్టించుకుంటారు. -సుభద్రమ్మ, మొరాలు, మదనపల్లె రూరల్
 
నిర్ధిష్ట ప్రకటన చేయాలి
రుణమాఫీపై ప్రభుత్వం రోజుకు విధంగా ప్రకటన చేస్తూ రైతులను తికమకపెట్టి మనోవేదనకు గురిచేస్తోంది. ముఖ్యమంత్రి 2014 మార్చి నెల 31వ తేది లోపు తీసుకున్న అప్పులకు రుణమాఫీ వర్తిస్తుందని ప్రకటన చేశారు. ఆర్థికమంత్రి యనమల రామక్రిష్ణుడు 2013 డిసెంబర్ 31 లోపు రుణాలకే మాఫీ వర్తిస్తుందనడం సరికాదు. నేను కౌలు రైతును. బ్యాంకులో రూ.18వేలు పంట రుణం తీసుకున్నాను. వడ్డీతో కలిపి రూ.24వేలకు పైగా చెల్లించాలని లాయర్ ద్వారా నాకు, జామీన్‌దారునికి నోటీసులు పంపారు. అవమానభారంతో రెన్యూవల్ చేశాం. ఇప్పుడు ఆ లోను వర్తిస్తుందా? లేదా? అనే అనుమానం కలుగుతోంది.
  -రవీంద్ర, కౌలు రైతు, మూలపల్లె, తంబళ్లపల్లె మండలం
 
రుణాలు మొత్తం మాఫీ చేయాలి
రైతులు తీసుకున్న అన్ని రకాల రుణాలను ప్రభుత్వం పూర్తిగా మాఫీ చేయాలి. చంద్రబాబు ఎన్నికల ముందు ఓ మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇం కోమాట చెప్పడం మంచిది కా దు. వ్యవసాయ రుణాలు పూర్తి గా మాఫీ చేస్తారని రైతులు ఆశతో ఓటు వేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం అన్ని రకాల రుణాలు మాఫీ చేయా లి లేకుంటే రైతులు ఉద్యమం చేపట్టాల్సి వస్తుంది.
 -ఈ.వెంకటాచలం నాయుడు, జిల్లా రైతు ఉద్యమ నేత, పెనుమూరు మండలం.
 
చంద్రబాబుకు రాజకీయ సన్యాసమే
చంద్రబాబు  నాయుడు రైతులను మోసంచేసి అధికారంలో వచ్చారు. రుణమాఫీ చేస్తానని చెప్పి తప్పించుకోడానికి రోజు కో మెలిక పెడుతూ రైతుల నడ్డివిరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఏడాదిలో తీసుకొన్న రుణా లు మాఫీలేదని చెప్పడం దారుణం. రైతులకు  ఆత్మహత్యలు తప్ప గత్యంతరం లేదు. రైతులు ఇక చంద్రబాబుని నమ్మరు. ప్రజలు తిరగబడే సమయం వస్తుంది.
-పార్థసారథిరెడ్డి, తిప్పనపల్లె, పూతలపట్టు మండలం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement