రుణమాఫీ... తూచ్..! | Crop loans waived | Sakshi
Sakshi News home page

రుణమాఫీ... తూచ్..!

Published Thu, Oct 2 2014 3:12 AM | Last Updated on Tue, Aug 14 2018 4:34 PM

రుణమాఫీ... తూచ్..! - Sakshi

రుణమాఫీ... తూచ్..!

  • పంట రుణాల మాఫీ అమలులోనూ మాట మార్చిన ప్రభుత్వం
  •  రైతులకు రుణ విముక్తి పత్రాలను జారీచేసి ఆర్థిక సహాయంఅందించాలని నిర్ణయం
  •  ఇప్పటికే డ్వాక్రా రుణాల మాఫీని నీరుగార్చి మహిళలను మోసం చేసిన సీఎం చంద్రబాబు
  • ఇదో నయా వంచన..! ఇదో పచ్చి మోసం..! ఇదో పక్కా దగా..! ఎన్నికల ప్రచారంలో రైతులను మాటలతో నమ్మించి.. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నిండాముంచారు. పంట రుణాలను మాఫీ చేసి రైతులకు ఉపశమనం కల్పిస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు మాట మార్చారు. అర్హులైన రైతులకు రుణ విముక్తి పత్రాలు అందించి.. నాలుగేళ్లలోగా ఆర్థిక సహాయం అందిస్తామని బుధవారం సెలవిచ్చారు. పంట రుణాల మాఫీలో సీఎం చంద్రబాబు వైఖరిపై రైతులు మండిపడుతున్నారు.    
     
    సాక్షి ప్రతినిధి, తిరుపతి: జిల్లాలో బ్యాంకర్లకు పంట రుణాల రూపంలో 8.15 లక్షల మంది రైతులు రూ.11,180.25 కోట్లను బకాయిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఆ పంట రుణాలను మాఫీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచే ఆ హామీని నీరుగార్చేందుకు చంద్రబాబు పూనుకున్నారు. ఒక్క సంతకంతో రైతులను రుణవిముక్తులను చేస్తానని ప్రకటించిన చంద్రబాబు.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక రుణాల మాఫీకి విధి విధానాలు రూపొందించే కమిటీ నియామకానికి సంతకం చేశారు.

    ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఒక్కో రైతు కుటుంబానికి గరిష్ఠంగా రూ.1.50 లక్షల వంతున పంట రుణాన్ని మాఫీ చేస్తామని ప్రకటించారు. పంట రుణాల మాఫీ లబ్ధిదారుల జాబితాను రూపొందించడానికి 30 అంశాల ఆధారంగా ప్రొపార్మాను రూ పొందించారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు పంట రుణాల మాఫీకి అర్హులైన లబ్ధిదారుల జాబితాను రూపొందించే పనిలో బ్యాంకర్లు నిమగ్నమయ్యారు.

    ఈ క్రమంలోనే బుధవారం సీఎం చంద్రబాబు నేతృత్వంలో మంత్రివర్గం సమావేశమైంది. పంట రుణాల మాఫీ కాదు.. రైతులకు ఆర్థిక సహాయం చేయాలని మంత్రివర్గంలో నిర్ణయించారు. రైతులకు ఆర్థిక సహాయం అందించడం కోసం రైతు సాధికార సంస్థను ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. ఈ సంస్థ ద్వారా రైతులకు రుణ విముక్తి పత్రాలను అందించి.. నాలుగేళ్లలోగా అర్హులైన రైతులందరికీ ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. తొలుత సన్న, చిన్న కారు రైతులకు రూ.50 వేల వంతున ఆర్థిక సహాయం చేసేలా రుణ విముక్తి పత్రాలను జారీచేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొనడం గమనార్హం.
     
    నట్టేట ముంచేశారు...

    పంట రుణాలను మాఫీ చేస్తారనే నమ్మకంతో రైతులు అప్పులు చెల్లించలేదు. అధికశాతం మంది రైతులు రుణాలను రెన్యువల్ కూడా చేసుకోలేదు. గడువులోగా రుణాలను చెల్లించకపోయినా.. రెన్యువల్ చేసుకోకపోయినా 13.75 శాతం వడ్డీని బ్యాంకర్లు వసూలు చేస్తారు. రుణాల చెల్లింపునకూ.. రెన్యువల్‌కు ఆగస్టు 30తో గడువు పూర్తయింది. దాంతో.. రైతులు తీసుకున్న పంట రుణాలపై 13.75 శాతం వడ్డీని వసూలు చేయనున్నారు. పంట రుణాలను మాఫీ కాదు.. ఆర్థిక సహాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో రైతులు అప్పులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ వైఖరి వల్ల రైతులపై రూ.950 కోట్లకుపైగా వడ్డీ భారం పడుతుందని రైతు సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట రుణాల మాఫీపై ప్రభుత్వం మాట మార్చడంతో రైతులు మండిపడుతున్నారు.
     
    డ్వాక్రా రుణాల తరహాలోనే..


    డ్వాక్రా రుణాల మాఫీ వ్యవహారంలో సీఎం చంద్రబాబు ఆదిలోనే మాట మార్చారు. రుణాల మాఫీ కాదు.. ఒక్కో సంఘానికి రూ.లక్ష వంతున ఆర్థిక సహాయం(మూల ధనం) అందిస్తామని ప్రకటించారు. ఆ మేరకు ఆగస్టు 2న ఉత్తర్వులు(జీవో ఎంఎస్ నెం: 164)ను జారీచేశారు. జిల్లాలో 61,711 స్వయం సహాయక సంఘాల్లో(ఎస్‌హెచ్‌జీ) 6.45 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఇందులో 55,602 సంఘాల్లోని 5.65 లక్షల మంది మహిళలు మార్చి 31, 2014 నాటికి రూ.1611.03 కోట్లను బ్యాంకులకు బకాయిపడ్డారు. చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగా ఆ రుణాలన్నీ మాఫీ చేయాలి. కానీ.. చంద్రబాబు మాట మార్చడం వల్ల ఆ రుణాలు మాఫీ కాలేదు.

    రుణ మాఫీ వర్తిస్తుందని మహిళలు అప్పులు చెల్లించకపోవడం.. గడువు మీరిపోవడంతో డ్వాక్రా రుణాలపై కూడా 14 శాతం వడ్డీని బ్యాంకర్లు వసూలు చేస్తున్నారు. అధిక వడ్డీ వల్ల మహిళలపై రూ.350 కోట్లకుపైగా భారం పడిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్కో సంఘానికి రూ.లక్షను మూలధనంగా అందించడంలోనూ ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. ఆ మూలధనాన్ని ఎప్పటిలోగా అందిస్తారన్నది చెప్పడం లేదు. ఒక రుణం తీసుకోని సంఘాలకు మూలధనం ఇచ్చేది లేదని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం గమనార్హం.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement