‘చంద్ర’జాలం! | Guidelines for loan waiver scheme | Sakshi
Sakshi News home page

‘చంద్ర’జాలం!

Published Fri, Jul 25 2014 2:14 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

‘చంద్ర’జాలం! - Sakshi

‘చంద్ర’జాలం!

  •      రుణాల మాఫీపై మార్గదర్శకాలు అందలేదంటున్న బ్యాంకర్లు
  •      ‘రీషెడ్యూలు’పైనా ఎలాంటి ఉత్తర్వులూ జారీచేయని ఆర్‌బీఐ
  •      ఖరీఫ్‌లో కొత్తగా పంటరుణాలు ఇవ్వలేమంటూ బ్యాంకర్ల స్పష్టీకరణ
  •      రుణాలు చెల్లించిన డ్వాక్రా సంఘాలకు మాత్రమే కొత్తగా రుణాలు
  • ఇదో పచ్చిమోసం.. పక్కా దగా..! రుణమాఫీ చేసేశాం.. రైతులు, డ్వాక్రా మహిళలను రుణ విముక్తులను చేశామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కానీ.. రుణమాఫీకి సంబంధించి తమకు ఎలాంటి మార్గదర్శకాలు ఇప్పటిదాకా అందలేదని బ్యాంకర్లు అంటున్నారు. కనీసం రుణాల రీషెడ్యూలుపై రిజర్వు బ్యాంకు నుంచి కూడా మార్గదర్శకాలు వెలువడలేదని తేల్చిచెబుతున్నారు. బ్యాంకర్ల నుంచి నిజం తెలుసుకున్న రైతులు, మహిళలు ఉద్యమబాటపట్టారు. వాస్తవాలను దాచి టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలుతుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.             
     
    సాక్షి ప్రతినిధి, తిరుపతి: జిల్లాలో 7,55,270 మంది రైతులు పంట రుణాలుగా రూ.5,810.84 కోట్లు తీసుకున్నారు. రూ.3,486.50 కోట్లను బంగారు నగలు తాకట్టు పెట్టి పట్టాదారు పాసుపుస్తకాల ఆధారంగా రుణం తీసుకున్నారు. 68,671 మంది రైతులు స్వల్పకాలిక పంట రుణాలుగా రూ.1,129.75 కోట్లు తీసుకున్నారు. వ్యవసాయ అనుబంధ శాఖల ద్వారా 45,780 మంది రైతులు రూ.753.16 కోట్లు రుణాలు తీసుకున్నారు. ఇవన్నీ కలిపితే జిల్లాలో వ్యవసాయ రుణాలు రూ.11,180.25 కోట్లు ఉన్నట్లు స్పష్టమవుతోంది.

    ఇక జిల్లాలో 61,711 స్వయం సహాయక సంఘాలు(ఎస్‌హెచ్‌జీ) ఉన్నాయి. ఇందులో 55,602 సంఘాల్లోని 5.65 లక్షల మంది మహిళలు మార్చి 31, 2014 నాటికి రూ.1611.03 కోట్లను బ్యాంకులకు బకాయిపడ్డారు. వ్యవసాయ రుణాలు, డ్వాక్రా రుణాలు కలిపి జిల్లాలో మొత్తం రూ.12,791.28 కోట్లను మాఫీ చేయాలి. కానీ.. మొత్తం రుణాలను మాఫీ చేయనని చంద్రబాబు చెప్పకనే చెప్పారు. ఒక్కో కుటుంబానికి రూ.1.5 లక్షలోపు మాత్రమే పంట రుణం, ఒక్కో సంఘానికి రూ.లక్ష మాత్రమే డ్వాక్రా రుణం మాఫీ చేస్తామని మెలిక పెట్టారు.

    మొత్తం రుణం మాఫీ చేస్తామన్న చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక కొసరే మాఫీ చేస్తామని ప్రకటించడంపై రైతులు, మహిళలు మండిపడుతున్నారు. పోనీ.. ఆ రుణమైనా మాఫీ చేయడానికి సంబంధించిన ఉత్తర్వులు జారీచేశారా అంటే అదీ లేదు. రుణమాఫీకి సంబంధించి తమకు ఇప్పటిదాకా ఎలాంటి ఉత్తర్వులు అందలేదని బ్యాంకర్లు స్పష్టీకరిస్తోండటం గమనార్హం.
     
    ఉత్తర్వులేవీ..?
     
    ఒక్కో కుటుంబానికి రూ.1.5 లక్షలోపు పంట రుణం మాఫీ చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. కానీ.. ఇందుకు సంబంధించి బ్యాంకులకు ఎలాంటి ఉత్తర్వులు జారీచేయలేదు. ఆర్‌బీఐ నుంచి కూడా రుణమాఫీకి సంబంధించి ఎలాంటి సమాచారం తమకు రాలేదని బ్యాంకర్లు చెబుతున్నారు. రైతులు చెల్లించాల్సిన రుణాన్ని ప్రభుత్వం చెల్లిస్తేనే రుణ మాఫీ చేస్తామని, కొత్తగా రుణం అందించడానికి అవకాశం ఉంటుందని బ్యాంకర్లు తేల్చిచెబుతున్నారు.

    జిల్లాలో 33 కరవు మండలాల్లో 1.69 లక్షల మంది తీసుకున్న రూ.1,438 కోట్లను రీషెడ్యూలు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. అయితే, రుణాల రీషెడ్యూలుకు సంబంధించి ఆర్‌బీఐ నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని బ్యాంకర్లు అంటున్నారు. రీషెడ్యూలు చేసిన రుణాన్ని మూడేళ్లలోగా చెల్లిస్తామని ప్రభుత్వం అంగీకరిస్తేనే.. రీషెడ్యూలుకు అంగీకరిస్తామని ఆర్‌బీఐ స్పష్టం చేసిన విషయం విదితమే. కానీ.. చంద్రబాబు సర్కారు ఆ నిబంధనకు అంగీకరించకపోవడంతో ఆర్‌బీఐ రుణాల రీ షెడ్యూలుపై చేతులెత్తేసింది. ప్రస్తుతం బ్యాంకర్లు రైతులకు ఏడు శాతం వడ్డీపై పంట రుణాలు ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పంట రుణాలపై నాలుగు శాతం వడ్డీ రాయితీ ఇస్తోంది. తక్కిన మూడు శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించి.. వడ్డీ లేని రుణాలు ఇచ్చేది.

    ఈ మూడు శాతం వడ్డీని కూడా సకాలంలో చెల్లించిన రైతులకే రీయింబర్స్‌మెంట్ చేసేది. రుణాలు రీ షెడ్యూలు చేయడం వల్ల అసలు, వడ్డీ కలిపి కొత్త రుణంగా ఇచ్చినట్లు చూపి 13.5 శాతం వడ్డీ వసూలు చేస్తామని బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు. ఇది రైతులకు మోయలేని భారంగా మారనుంది. పంట రుణాల మాఫీ నిధుల చెల్లింపు, రీషెడ్యూలుపై చంద్రబాబు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఉత్తర్వులు లేని నేపథ్యంలో బ్యాంకర్లు ప్రస్తుత ఖరీఫ్‌లో కొత్తగా ఏ ఒక్క రైతుకు పంట రుణం ఇవ్వలేమని తేల్చిచెబుతున్నారు.
     
    మహిళలకు టోపీ..

    అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణాలను మొత్తం మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు ఒక్కో సంఘానికి రూ.లక్ష మాత్రమే మాఫీ చేస్తానని మోసం చేశారు. చంద్రబాబు తీరు వల్ల కేవలం పది శాతం సంఘాల్లోని మహిళలు మాత్రమే లబ్ధి పొందారు. అదీ.. మాఫీకి సంబంధించిన నిధులను బ్యాంకులకు సమకూర్చినప్పుడే. డ్వాక్రా రుణాలను రీషెడ్యూలు చేయడానికి నిబంధనలు అంగీకరించవు. నిధులను సమకూర్చడంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయడం లేదు. ప్రభుత్వం నిధులను సమకూర్చని పక్షంలో డ్వాక్రా రుణాల మాఫీ చేయడం సాధ్యం కాదని బ్యాంకర్లు తేల్చిచెబుతున్నారు. డ్వాక్రా మహిళలకు కొత్తగా రుణాలు ఇవ్వాలంటే.. ప్రభుత్వం రుణమాఫీ నిధులను సమకూర్చాల్సిందేనంటున్నారు.
     
    ఎలాంటి సమాచారం లేదు
     
    పంట రుణాలు, డ్వాక్రా రుణాల మాఫీకి సంబంధించి ప్రభుత్వం నుంచీ గానీ.. ఆర్‌బీఐ నుంచి గానీ ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. రుణాల రీషెడ్యూలుపై ఆర్‌బీఐ నుంచి ఎలాంటి మార్గదర్శకాలు వెలువడ లేదు. డ్వాక్రా రుణాలను రీషెడ్యూలు చేయడానికి నిబంధనలు అంగీకరించవు. రుణం చెల్లించిన రైతులు, డ్వాక్రా మహిళలకు మాత్రమే కొత్తగా రుణాలు ఇస్తాం. అప్పులు చెల్లించని వారికి కొత్తగా రుణాలు ఇచ్చే అవకాశం లేదు.
     -వెంకటేశ్వరరెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement