Women dvakra
-
సమస్యలు చెప్పేందుకు..తరలుదాము రండి!
సన్నద్ధమవుతున్న జనం నేటి నుంచి జన్మభూమి-మన ఊరు ప్రత్యేకాధికారిగా జేసీ శర్మ ‘తరలుదామురండి...మనం జన్మభూమికి’ అని పదేళ్ల కిందట ఊరువాడ మార్మోగిన పాట మళ్లీ గురువారం నుంచి పల్లెసీమల్లో వినిపించనుంది. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ‘జన్మభూమి-మన ఊరు’ పేరుతో ప్రజాప్రతినిధులు, అధికారులను పల్లెబాట పట్టిస్తోంది. అయితే అధికారం చేపట్టిన నాలుగు నెలల్లో ఒక్క ప్రజా ఉపయోగ కార్యక్రమం కూడా చేపట్టని ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీసేందుకు ప్రజలు సన్నద్ధమై ఉన్నారు. ముఖ్యంగా రుణమాఫీ, కొత్తగా బ్యాంకర్లు రుణాలు ఇవ్వకపోవడం, పింఛన్లు తీసివేత, ఆదర్శరైతుల తొలగింపు, మంచినీరు, ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల పెండింగ్.. ఇలా ప్రతి సమస్యపై జన్మభూమిలో గళం విప్పనున్నారు. సాక్షి, చిత్తూరు: ‘జన్మభూమి-మనఊరు’ కార్యక్రమాన్ని అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చిత్తూరులో ర్యాలీ ద్వారా ప్రారంభించనున్నారు. జన్మభూమి ప్రత్యేకాధికారిగా ఐఏఎస్ అధికారి ఎస్ఎస్ రావత్ బదులు జేసీ శర్మ నియమితులయ్యారు. 20వ తేదీ వరకూ జరిగే ఈ కార్యక్రమాన్ని జేసీ శర్మ పర్యవేక్షించనున్నారు. ప్రజలకు బోలెడు హామీలిచ్చి అధికారంలో వచ్చిన చంద్రబాబు సర్కారు ఒక్కహా మీని కూడా నిలబెట్టుకోలేకపోయింది. రైతులు, డ్వాక్రా మహిళల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు బాబు హామీ ఇచ్చారు. అధికారం దక్కిన తర్వాత సవాలక్ష ఆంక్షలు విధించి రూ.1.50లక్షల వరకూ మాత్రమే మాఫీ చేస్తామన్నారు. కనీసం ఈ హామీనైనా నిలబెట్టుకున్నారా? అంటే అదీ లేదు. దీంతో కొత్త రుణాలు అందక రైతులు తీ వ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటసాగుకు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జన్మభూమి పేరుతో ప్రజాప్రతినిధులు, అధికారులు పల్లెల్లోకి వెళితే ప్రజల నుంచి నిరసనలు, ప్రతిఘటనలు అనివార్యమయ్యే పరిస్థితులు కన్పిస్తున్నాయి. పింఛన్ల తొలగింపుపై నిలదీత జన్మభూమిలో ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీని తీసుకోవాలని సీఎం సూచించారు. అయితే తీసుకున్న అర్జీలకు న్యాయం జరిగే పరిస్థితులు కన్పించడం లేదు. తనిఖీల పేరుతో జిల్లా వ్యాప్తంగా 34,459 మందికి పింఛన్లు తొలగిం చారు. మరో 10 వేల మంది తీసివేత జాబితా లో చేరనున్నారు. వీరిలో సింహభాగం అర్హులే ఉన్నారు. అక్టోబర్ 2 నుంచి పెంచిన పింఛను సొమ్ము అందిస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే ఇప్పటికీ పింఛనుదారుల జాబితా సిద్ధం కాలేదు. ఈ క్రమంలో నామమాత్రంగా ఒకరిద్దరికి పెంచిన పింఛను ఇవ్వడం మినహా అర్హులందరికీ పింఛన్ అందే పరిస్థితులు లేవు. అలాగే జిల్లావ్యాప్తంగా 1846 మంది ఆదర్శరైతులను తొలగించారు. ‘బాబు వస్తే జాబు’ అని ఉన్న ఉద్యోగాలను తీసేయడంపై ఆదర్శరైతులు జన్మభూమిని అడ్డుకోనున్నారు. అలాగే ఇందిర్మబిల్లులు చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీనిపై కూడా ప్రశ్నాస్త్రాలను సంధిం చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మాట తప్పిన ప్రభుత్వాన్ని మహిళలు నిలదీయనున్నారు. ప్రతీ ‘సారీ’ మాట తప్పడం ఏంటీ ‘బాబూ..!’ జిల్లాలో ప్రతిగ్రామానికీ అక్టోబర్ 2 నుంచిస్వచ్ఛమైన తాగునీటి అందిస్తామని రాష్ట్ర కేబినెట్ రెండు నెలల కిందట ప్రకటించింది. అయితే ప్రభుత్వం కాకుండా ప్రైవేటు భాగస్వామ్యంతో నడపాలని నిర్ణయించడంతో ఎవరూ ముందుకు రాక ‘సుజల’ ఆరంభశూరత్వమైంది. చివరకు నియోజకవర్గంలో ఒక్క గ్రామంలో అయినా ప్రారంభించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇదికూడా సాధ్యం కాక అధికారులు చేతులెత్తేశారు. కేవలం కుప్పం, తంబళ్లపల్లె, శ్రీకాళహస్తి, చిత్తూరు మండలాల్లోని ఒక్కొక్క గ్రామం చొప్పున పథకాన్ని ప్రారంభిస్తున్నారు. అలాగే అక్టోబర్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల కరెంటు సరఫరా చేస్తామని ప్రకటించారు. అయితే తిరుపతి కార్పొరేషన్‌కు మాత్రమే పరిమితం చేశారు. దీంతో తక్కిన ప్రాంతాల్లో కోతలు యాథావిధిగా ఉండే పరిస్థితి. మొత్తానికి అరచేతిలో స్వర్గం చూపించేలా మాటలు కోటలు దాటేలా చెప్పి ప్రతి అంశంలోనూ మాట తప్పుతున్న చంద్రబాబు సర్కారు జన్మభూమిలో ఊరు దాటి రావడం కత్తిమీద సామే! -
బాలికల్లో ప్రశ్నించే తత్వం అవసరం
రాష్ట్ర మహిళా కమిషనర్ చైర్పర్సన్ త్రిపురాన వెంకటరత్నం విజయవాడ : బాలికల్లో ప్రశ్నించే తత్వం ఉండాలని, అప్పుడే జీవితంలో ధైర్యంగా రాణించగలరని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ త్రిపురాన వెంకటరత్నం అన్నారు. ఐద్వా 13వ మహాసభలను పురస్కరించుకుని ఐద్వా, సిద్ధార్థ మహిళా కళాశాల ఉమెన్ సెల్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం ‘బాలికలు- భద్రత’ అనే అంశంపై సదస్సు జరిగింది. సిద్ధార్థ మహిళా కళాశాలలో జరిగిన ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న త్రిపురాన వెంకటరత్నం మాట్లాడుతూ గర్భస్థ దశ నుంచి చనిపోయే వరకూ మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు ప్రభుత్వాలు ప్రకటనలు చేస్తున్నాయని, అసలు స్త్రీలకు భద్రత లేన ప్పుడు ఆ పథకాలు ఎందుకని ప్రశ్నించారు. ఎక్కడ చూసినా మహిళలపై హింస, మోసాలు, భ్రూణ హత్యల గురించి వింటూనే ఉన్నామని ఆవేదన వ్యక్తంచేశారు. డ్వాక్రా మహిళల విషయంలో అధికార యంత్రాంగ వివక్ష చూపారని ఆమె పేర్కొన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కలగానే మిగిలిందని, అయితే 50 శాతం రిజర్వేషన్లు క ల్పించాల్సిన అవసరం ఉందన్నారు. వరకట్న నిసేధ చట్టం 1961లో అమలులోకి వచ్చినా, ఇప్పటికీ ఆ చట్టం కోమాలోనే ఉందన్నారు. 2008లో కట్నం లేకుండా చేసుకున్న వివాహాల వివరాలను చట్టపరంగా నమోదు చేసేవారని తెలిపారు. మంచి చట్టాలు ఉన్నాయని, ప్రభుత్వం సక్రమంగా అమలు చేయకపోవడం వల్లే సమస్యలు వస్తున్నాయన్నారు. విద్యార్థినులందరూ ఐకమత్యంతో మెలగాలని, నిర్భయంగా వేధింపులు ప్రతిఘటించాలని సూచించారు. అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. కళాశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థినులు చట్టాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఐద్వా నగర కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ స్త్రీలకు జరిగే అన్యాయాలను ప్రశ్నించి, పరిష్కార దిశగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఉమెన్స్ సెల్ కన్వీనర్ ఎస్.కల్పన, కె.ఉషారాణి, శైలజ పాల్గొన్నారు. -
‘చంద్ర’జాలం!
రుణాల మాఫీపై మార్గదర్శకాలు అందలేదంటున్న బ్యాంకర్లు ‘రీషెడ్యూలు’పైనా ఎలాంటి ఉత్తర్వులూ జారీచేయని ఆర్బీఐ ఖరీఫ్‌లో కొత్తగా పంటరుణాలు ఇవ్వలేమంటూ బ్యాంకర్ల స్పష్టీకరణ రుణాలు చెల్లించిన డ్వాక్రా సంఘాలకు మాత్రమే కొత్తగా రుణాలు ఇదో పచ్చిమోసం.. పక్కా దగా..! రుణమాఫీ చేసేశాం.. రైతులు, డ్వాక్రా మహిళలను రుణ విముక్తులను చేశామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కానీ.. రుణమాఫీకి సంబంధించి తమకు ఎలాంటి మార్గదర్శకాలు ఇప్పటిదాకా అందలేదని బ్యాంకర్లు అంటున్నారు. కనీసం రుణాల రీషెడ్యూలుపై రిజర్వు బ్యాంకు నుంచి కూడా మార్గదర్శకాలు వెలువడలేదని తేల్చిచెబుతున్నారు. బ్యాంకర్ల నుంచి నిజం తెలుసుకున్న రైతులు, మహిళలు ఉద్యమబాటపట్టారు. వాస్తవాలను దాచి టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలుతుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి ప్రతినిధి, తిరుపతి: జిల్లాలో 7,55,270 మంది రైతులు పంట రుణాలుగా రూ.5,810.84 కోట్లు తీసుకున్నారు. రూ.3,486.50 కోట్లను బంగారు నగలు తాకట్టు పెట్టి పట్టాదారు పాసుపుస్తకాల ఆధారంగా రుణం తీసుకున్నారు. 68,671 మంది రైతులు స్వల్పకాలిక పంట రుణాలుగా రూ.1,129.75 కోట్లు తీసుకున్నారు. వ్యవసాయ అనుబంధ శాఖల ద్వారా 45,780 మంది రైతులు రూ.753.16 కోట్లు రుణాలు తీసుకున్నారు. ఇవన్నీ కలిపితే జిల్లాలో వ్యవసాయ రుణాలు రూ.11,180.25 కోట్లు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇక జిల్లాలో 61,711 స్వయం సహాయక సంఘాలు(ఎస్‌హెచ్‌జీ) ఉన్నాయి. ఇందులో 55,602 సంఘాల్లోని 5.65 లక్షల మంది మహిళలు మార్చి 31, 2014 నాటికి రూ.1611.03 కోట్లను బ్యాంకులకు బకాయిపడ్డారు. వ్యవసాయ రుణాలు, డ్వాక్రా రుణాలు కలిపి జిల్లాలో మొత్తం రూ.12,791.28 కోట్లను మాఫీ చేయాలి. కానీ.. మొత్తం రుణాలను మాఫీ చేయనని చంద్రబాబు చెప్పకనే చెప్పారు. ఒక్కో కుటుంబానికి రూ.1.5 లక్షలోపు మాత్రమే పంట రుణం, ఒక్కో సంఘానికి రూ.లక్ష మాత్రమే డ్వాక్రా రుణం మాఫీ చేస్తామని మెలిక పెట్టారు. మొత్తం రుణం మాఫీ చేస్తామన్న చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక కొసరే మాఫీ చేస్తామని ప్రకటించడంపై రైతులు, మహిళలు మండిపడుతున్నారు. పోనీ.. ఆ రుణమైనా మాఫీ చేయడానికి సంబంధించిన ఉత్తర్వులు జారీచేశారా అంటే అదీ లేదు. రుణమాఫీకి సంబంధించి తమకు ఇప్పటిదాకా ఎలాంటి ఉత్తర్వులు అందలేదని బ్యాంకర్లు స్పష్టీకరిస్తోండటం గమనార్హం. ఉత్తర్వులేవీ..? ఒక్కో కుటుంబానికి రూ.1.5 లక్షలోపు పంట రుణం మాఫీ చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. కానీ.. ఇందుకు సంబంధించి బ్యాంకులకు ఎలాంటి ఉత్తర్వులు జారీచేయలేదు. ఆర్బీఐ నుంచి కూడా రుణమాఫీకి సంబంధించి ఎలాంటి సమాచారం తమకు రాలేదని బ్యాంకర్లు చెబుతున్నారు. రైతులు చెల్లించాల్సిన రుణాన్ని ప్రభుత్వం చెల్లిస్తేనే రుణ మాఫీ చేస్తామని, కొత్తగా రుణం అందించడానికి అవకాశం ఉంటుందని బ్యాంకర్లు తేల్చిచెబుతున్నారు. జిల్లాలో 33 కరవు మండలాల్లో 1.69 లక్షల మంది తీసుకున్న రూ.1,438 కోట్లను రీషెడ్యూలు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. అయితే, రుణాల రీషెడ్యూలుకు సంబంధించి ఆర్బీఐ నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని బ్యాంకర్లు అంటున్నారు. రీషెడ్యూలు చేసిన రుణాన్ని మూడేళ్లలోగా చెల్లిస్తామని ప్రభుత్వం అంగీకరిస్తేనే.. రీషెడ్యూలుకు అంగీకరిస్తామని ఆర్బీఐ స్పష్టం చేసిన విషయం విదితమే. కానీ.. చంద్రబాబు సర్కారు ఆ నిబంధనకు అంగీకరించకపోవడంతో ఆర్బీఐ రుణాల రీ షెడ్యూలుపై చేతులెత్తేసింది. ప్రస్తుతం బ్యాంకర్లు రైతులకు ఏడు శాతం వడ్డీపై పంట రుణాలు ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పంట రుణాలపై నాలుగు శాతం వడ్డీ రాయితీ ఇస్తోంది. తక్కిన మూడు శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించి.. వడ్డీ లేని రుణాలు ఇచ్చేది. ఈ మూడు శాతం వడ్డీని కూడా సకాలంలో చెల్లించిన రైతులకే రీయింబర్స్మెంట్ చేసేది. రుణాలు రీ షెడ్యూలు చేయడం వల్ల అసలు, వడ్డీ కలిపి కొత్త రుణంగా ఇచ్చినట్లు చూపి 13.5 శాతం వడ్డీ వసూలు చేస్తామని బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు. ఇది రైతులకు మోయలేని భారంగా మారనుంది. పంట రుణాల మాఫీ నిధుల చెల్లింపు, రీషెడ్యూలుపై చంద్రబాబు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఉత్తర్వులు లేని నేపథ్యంలో బ్యాంకర్లు ప్రస్తుత ఖరీఫ్‌లో కొత్తగా ఏ ఒక్క రైతుకు పంట రుణం ఇవ్వలేమని తేల్చిచెబుతున్నారు. మహిళలకు టోపీ.. అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణాలను మొత్తం మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు ఒక్కో సంఘానికి రూ.లక్ష మాత్రమే మాఫీ చేస్తానని మోసం చేశారు. చంద్రబాబు తీరు వల్ల కేవలం పది శాతం సంఘాల్లోని మహిళలు మాత్రమే లబ్ధి పొందారు. అదీ.. మాఫీకి సంబంధించిన నిధులను బ్యాంకులకు సమకూర్చినప్పుడే. డ్వాక్రా రుణాలను రీషెడ్యూలు చేయడానికి నిబంధనలు అంగీకరించవు. నిధులను సమకూర్చడంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయడం లేదు. ప్రభుత్వం నిధులను సమకూర్చని పక్షంలో డ్వాక్రా రుణాల మాఫీ చేయడం సాధ్యం కాదని బ్యాంకర్లు తేల్చిచెబుతున్నారు. డ్వాక్రా మహిళలకు కొత్తగా రుణాలు ఇవ్వాలంటే.. ప్రభుత్వం రుణమాఫీ నిధులను సమకూర్చాల్సిందేనంటున్నారు. ఎలాంటి సమాచారం లేదు పంట రుణాలు, డ్వాక్రా రుణాల మాఫీకి సంబంధించి ప్రభుత్వం నుంచీ గానీ.. ఆర్బీఐ నుంచి గానీ ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. రుణాల రీషెడ్యూలుపై ఆర్బీఐ నుంచి ఎలాంటి మార్గదర్శకాలు వెలువడ లేదు. డ్వాక్రా రుణాలను రీషెడ్యూలు చేయడానికి నిబంధనలు అంగీకరించవు. రుణం చెల్లించిన రైతులు, డ్వాక్రా మహిళలకు మాత్రమే కొత్తగా రుణాలు ఇస్తాం. అప్పులు చెల్లించని వారికి కొత్తగా రుణాలు ఇచ్చే అవకాశం లేదు. -వెంకటేశ్వరరెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ -
బిగిసిన పిడికిలి
సాక్షి, మచిలీపట్నం :సమైక్య ఆందోళనలతో జిల్లా అట్టుడుకుతోంది. చల్లపల్లిలో సమైక్యాంధ్రను కాంక్షిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం ఎదురుగా రహదారిపై హోమం నిర్వహించారు. అవనిగడ్డ జేఏసీ ఆధ్వర్యంలో పులిగడ్డలో 216 జాతీయ రహదారిని దిగ్బంధించారు. రోడ్డుపైనే వంటావార్పు నిర్వహించి భోజనాలు ముగించారు. అధికార భాషాసంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్, వైఎస్సార్ సీపీ నియోజకవర్గసమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు దీక్షలో పాల్గొని మద్దతు తెలిపారు. నూజివీడు ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య తన పదవికి రాజీనామా చేశారు. కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కిలో ఉల్లిని రూ.10కే విక్రయించారు. కూరగాయల దుకాణాల అసోసియేషన్ ఆధ్వర్యంలో బంద్ పాటించారు. ఆర్టీసీ కార్మికులు వంటావార్పు నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులు పట్టణంలో అద్దె బస్సులతో ర్యాలీ నిర్వహించారు. జగ్గయ్యపేటలో బంద్ నిర్వహించారు. ముస్లింల ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను పాల్గొన్నారు. నాన్ పొలిటికల్ జేఏసీ పిలుపు మేరకు చేపట్టిన కైకలూరు బంద్ విజయవంతమైంది. ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావులు ర్యాలీలో పాల్గొన్నారు. దేవినేని ఉమామహేశ్వరరావు అరెస్టుకు నిరసనగా మైలవరంలో టీడీపీ నాయకులు మన్నె సాంబశివరావు, షేక్ సుభానీలు తారకరామనగర్‌లోని వాటర్ ట్యాంకు పైకి ఎక్కి నిరసన తెలియజేశారు. గుడివాడలో మున్సిపల్ కార్మికులు విధులు బహిష్కరించి రిలేనిరాహారదీక్ష చేశారు. నెహ్రూచౌక్ సెంటర్లో ఎన్జీవోల దీక్షలు కొనసాగాయి. డ్వాక్రా మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. పామర్రులో బంద్ నిర్వహించారు. వత్సవాయిలో ప్రైవేటు పాఠశాలల ఆధ్వర్యంలో రహదారిపై పాఠాలు బోధించారు. గోపినేనిపాలెం గ్రామంలో సోనియాగాంధీ, కేసీఆర్ దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించి గ్రామ ప్రధాన సెంటర్లో దహనం చేశారు. ఏపీ డాక్టర్స్, ఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో కంకిపాడులో భారీ ప్రదర్శన నిర్వహించారు. కానూరులో వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు, పోరంకిలో టీడీపీ నేతలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త పడమట సురేష్‌బాబు విద్యార్థులతో కలసి బందరురోడ్డుపై రాస్తారోకో చేశారు. నందిగామ నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ, ప్రైవేట్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగాయి. తిరువూరులో భవన నిర్మాణ కార్మికులు పనులు బహిష్కరించి నిరసన ప్రదర్శన చేశారు. న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించగా, న్యాయశాఖ ఉద్యోగులు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా చేశారు. విస్సన్నపేటలో జర్నలిస్టులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పెనుగంచిప్రోలులో ఆటోడ్రైవర్లు, యజమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. న్యాయశాఖ ఉద్యోగుల సంఘం భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పెడనలో పీఏసీఎస్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు రిలే నిరాహార దీక్షను చేపట్టారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు ఉప్పాల రాంప్రసాదు వాకా వాసుదేవరావు మద్దతు ప్రకటించారు. నూజివీడు చిన్నగాంధీబొమ్మ సెంటర్లో చేస్తున్న దీక్షలకు వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కన్వీనర్ మేకా వెంకట ప్రతాప్ అప్పారావు మద్దతు ప్రకటించారు. ఉయ్యూరు రైతుబజార్ కూరగాయల రైతులు కూరగాయల దండలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎన్టీటీపీఎస్ ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు ఇబ్రహీంపట్నంలో భారీ ర్యాలీ నిర్వహించారు. విజయవాడలో.. నగరంలో మున్సిపల్ ఉద్యోగులు రిలే దీక్షలు చేయడంతో పాటు రోడ్లపైనే ఆటలు ఆడుతూ నిరసన తెలిపారు. వన్‌టౌన్‌లోని సెయింట్ థామస్ ఇంగ్లీషు మీడియం స్కూల్ చిన్నారులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రాష్ర్ట విభజన వద్దు... సమైక్యాంధ్ర ముద్దు అంటూ ప్లకార్డులు పట్టుకుని రోడ్లపై నిర్వహించిన తరగతులకు హాజరయ్యారు. చిట్టినగర్ పొలిటికల్ జేఏసీ చేపట్టిన రిలే దీక్షలు తొమ్మిదవ రోజుకు చేరాయి. టీడీపీ నేతల అరెస్టును నిరసిస్తూ బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ అద్దెబస్సుల ఓనర్స్, వర్కర్స్ జేఏసీ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. తెలుగు తల్లి విగ్రహం వద్ద విజయవాడ మాస్టర్ ప్రింటర్స్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ సెంట్రల్ సమన్వయకర్త పి.గౌతమ్‌రెడ్డి పాల్గొన్నారు. విజయవాడ టైలర్స్ జేఏసీ ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. మోటార్ మెకానిక్స్ ఆధ్వర్యంలో జరిగిన మోటార్ సైకిల్ ర్యాలీలో వైఎస్సార్ సీపీ తూర్పు సమన్వయకర్త వంగవీటి రాధాకృష్ణ పాల్గొన్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సమైక్యాంధ్ర ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు జరిగాయి. సిద్ధార్థ మెడికల్ కాలేజీ వద్ద వైద్య ఉద్యోగులు వంటావార్పు నిర్వహించారు.