- రాష్ట్ర మహిళా కమిషనర్ చైర్‌పర్సన్ త్రిపురాన వెంకటరత్నం
విజయవాడ : బాలికల్లో ప్రశ్నించే తత్వం ఉండాలని, అప్పుడే జీవితంలో ధైర్యంగా రాణించగలరని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ త్రిపురాన వెంకటరత్నం అన్నారు. ఐద్వా 13వ మహాసభలను పురస్కరించుకుని ఐద్వా, సిద్ధార్థ మహిళా కళాశాల ఉమెన్ సెల్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం ‘బాలికలు- భద్రత’ అనే అంశంపై సదస్సు జరిగింది.
సిద్ధార్థ మహిళా కళాశాలలో జరిగిన ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న త్రిపురాన వెంకటరత్నం మాట్లాడుతూ గర్భస్థ దశ నుంచి చనిపోయే వరకూ మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు ప్రభుత్వాలు ప్రకటనలు చేస్తున్నాయని, అసలు స్త్రీలకు భద్రత లేన ప్పుడు ఆ పథకాలు ఎందుకని ప్రశ్నించారు. ఎక్కడ చూసినా మహిళలపై హింస, మోసాలు, భ్రూణ హత్యల గురించి వింటూనే ఉన్నామని ఆవేదన వ్యక్తంచేశారు.
డ్వాక్రా మహిళల విషయంలో అధికార యంత్రాంగ వివక్ష చూపారని ఆమె పేర్కొన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కలగానే మిగిలిందని, అయితే 50 శాతం రిజర్వేషన్లు క ల్పించాల్సిన అవసరం ఉందన్నారు. వరకట్న నిసేధ చట్టం 1961లో అమలులోకి వచ్చినా, ఇప్పటికీ ఆ చట్టం కోమాలోనే ఉందన్నారు. 2008లో కట్నం లేకుండా చేసుకున్న వివాహాల వివరాలను చట్టపరంగా నమోదు చేసేవారని తెలిపారు. మంచి చట్టాలు ఉన్నాయని, ప్రభుత్వం సక్రమంగా అమలు చేయకపోవడం వల్లే సమస్యలు వస్తున్నాయన్నారు.
విద్యార్థినులందరూ ఐకమత్యంతో మెలగాలని, నిర్భయంగా వేధింపులు ప్రతిఘటించాలని సూచించారు. అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. కళాశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థినులు చట్టాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఐద్వా నగర కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ స్త్రీలకు జరిగే అన్యాయాలను ప్రశ్నించి, పరిష్కార దిశగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఉమెన్స్ సెల్ కన్వీనర్ ఎస్.కల్పన, కె.ఉషారాణి, శైలజ పాల్గొన్నారు.