- సన్నద్ధమవుతున్న జనం
- నేటి నుంచి జన్మభూమి-మన ఊరు
- ప్రత్యేకాధికారిగా జేసీ శర్మ
‘తరలుదామురండి...మనం జన్మభూమికి’ అని పదేళ్ల కిందట ఊరువాడ మార్మోగిన పాట మళ్లీ గురువారం నుంచి పల్లెసీమల్లో వినిపించనుంది. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ‘జన్మభూమి-మన ఊరు’ పేరుతో ప్రజాప్రతినిధులు, అధికారులను పల్లెబాట పట్టిస్తోంది. అయితే అధికారం చేపట్టిన నాలుగు నెలల్లో ఒక్క ప్రజా ఉపయోగ కార్యక్రమం కూడా చేపట్టని ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీసేందుకు ప్రజలు సన్నద్ధమై ఉన్నారు. ముఖ్యంగా రుణమాఫీ, కొత్తగా బ్యాంకర్లు రుణాలు ఇవ్వకపోవడం, పింఛన్లు తీసివేత, ఆదర్శరైతుల తొలగింపు, మంచినీరు, ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల పెండింగ్.. ఇలా ప్రతి సమస్యపై జన్మభూమిలో గళం విప్పనున్నారు.
సాక్షి, చిత్తూరు: ‘జన్మభూమి-మనఊరు’ కార్యక్రమాన్ని అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చిత్తూరులో ర్యాలీ ద్వారా ప్రారంభించనున్నారు. జన్మభూమి ప్రత్యేకాధికారిగా ఐఏఎస్ అధికారి ఎస్‌ఎస్ రావత్ బదులు జేసీ శర్మ నియమితులయ్యారు. 20వ తేదీ వరకూ జరిగే ఈ కార్యక్రమాన్ని జేసీ శర్మ పర్యవేక్షించనున్నారు. ప్రజలకు బోలెడు హామీలిచ్చి అధికారంలో వచ్చిన చంద్రబాబు సర్కారు ఒక్కహా మీని కూడా నిలబెట్టుకోలేకపోయింది.
రైతులు, డ్వాక్రా మహిళల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు బాబు హామీ ఇచ్చారు. అధికారం దక్కిన తర్వాత సవాలక్ష ఆంక్షలు విధించి రూ.1.50లక్షల వరకూ మాత్రమే మాఫీ చేస్తామన్నారు. కనీసం ఈ హామీనైనా నిలబెట్టుకున్నారా? అంటే అదీ లేదు. దీంతో కొత్త రుణాలు అందక రైతులు తీ వ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటసాగుకు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జన్మభూమి పేరుతో ప్రజాప్రతినిధులు, అధికారులు పల్లెల్లోకి వెళితే ప్రజల నుంచి నిరసనలు, ప్రతిఘటనలు అనివార్యమయ్యే పరిస్థితులు కన్పిస్తున్నాయి.
పింఛన్ల తొలగింపుపై నిలదీత
జన్మభూమిలో ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీని తీసుకోవాలని సీఎం సూచించారు. అయితే తీసుకున్న అర్జీలకు న్యాయం జరిగే పరిస్థితులు కన్పించడం లేదు. తనిఖీల పేరుతో జిల్లా వ్యాప్తంగా 34,459 మందికి పింఛన్లు తొలగిం చారు. మరో 10 వేల మంది తీసివేత జాబితా లో చేరనున్నారు. వీరిలో సింహభాగం అర్హులే ఉన్నారు. అక్టోబర్ 2 నుంచి పెంచిన పింఛను సొమ్ము అందిస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే ఇప్పటికీ పింఛనుదారుల జాబితా సిద్ధం కాలేదు.
ఈ క్రమంలో నామమాత్రంగా ఒకరిద్దరికి పెంచిన పింఛను ఇవ్వడం మినహా అర్హులందరికీ పింఛన్ అందే పరిస్థితులు లేవు. అలాగే జిల్లావ్యాప్తంగా 1846 మంది ఆదర్శరైతులను తొలగించారు. ‘బాబు వస్తే జాబు’ అని ఉన్న ఉద్యోగాలను తీసేయడంపై ఆదర్శరైతులు జన్మభూమిని అడ్డుకోనున్నారు. అలాగే ఇందిర్మబిల్లులు చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీనిపై కూడా ప్రశ్నాస్త్రాలను సంధిం చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మాట తప్పిన ప్రభుత్వాన్ని మహిళలు నిలదీయనున్నారు.
ప్రతీ ‘సారీ’ మాట తప్పడం ఏంటీ ‘బాబూ..!’
జిల్లాలో ప్రతిగ్రామానికీ అక్టోబర్ 2 నుంచిస్వచ్ఛమైన తాగునీటి అందిస్తామని రాష్ట్ర కేబినెట్ రెండు నెలల కిందట ప్రకటించింది. అయితే ప్రభుత్వం కాకుండా ప్రైవేటు భాగస్వామ్యంతో నడపాలని నిర్ణయించడంతో ఎవరూ ముందుకు రాక ‘సుజల’ ఆరంభశూరత్వమైంది. చివరకు నియోజకవర్గంలో ఒక్క గ్రామంలో అయినా ప్రారంభించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
ఇదికూడా సాధ్యం కాక అధికారులు చేతులెత్తేశారు. కేవలం కుప్పం, తంబళ్లపల్లె, శ్రీకాళహస్తి, చిత్తూరు మండలాల్లోని ఒక్కొక్క గ్రామం చొప్పున పథకాన్ని ప్రారంభిస్తున్నారు. అలాగే అక్టోబర్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల కరెంటు సరఫరా చేస్తామని ప్రకటించారు. అయితే తిరుపతి కార్పొరేషన్‌కు మాత్రమే పరిమితం చేశారు. దీంతో తక్కిన ప్రాంతాల్లో కోతలు యాథావిధిగా ఉండే పరిస్థితి. మొత్తానికి అరచేతిలో స్వర్గం చూపించేలా మాటలు కోటలు దాటేలా చెప్పి ప్రతి అంశంలోనూ మాట తప్పుతున్న చంద్రబాబు సర్కారు జన్మభూమిలో ఊరు దాటి రావడం కత్తిమీద సామే!