సాక్షి, కర్నూలు/అగ్రికల్చర్ : రైతులకు కన్నీటి కష్టాలు తప్పేలాలేవు. ఎన్నికల ముందు నుంచే రుణాల చెల్లింపులు నిలిపివేసిన రైతులు గడిచిన సంవత్సర కాలానికి 14 శాతం వడ్డీతోపాటు ప్రభుత్వం అందించే వడ్డీ రాయితీని కోల్పోనున్నారు. ఇంటికొక రైతుకు రూ. 1.50 లక్ష వరకు మాత్రమే రుణ మాఫీ చేస్తామని ప్రభుత్వం తేల్చేయడంతో బ్యాంకులు తమ పనిని కానిచ్చేస్తున్నాయి. ప్రస్తుతం రుణాలు చెల్లించినా వడ్డీ రాయితీకి అర్హత కోల్పోనున్నారు.
ప్రస్తుతం రుణ మాఫీ అంశంలో ప్రభుత్వం రోజుకో నిర్ణయం తీసుకుంటుండడంతో రుణమాఫీపై మరింత గందరగోళం నెలకొంది. ప్రభుత్వం రుణ మాఫీ ఇదిగో.. అదిగో.. అంటూ ఊరించి ఉసూరుమనిపిస్తోంది. రుణమాఫీ ప్రక్రియను ఎప్పటికి పూర్తి చేస్తుందనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోయినా రైతుల జాబితాలు మాత్రం అటు ఇటు తిరుగుతున్నాయి. ప్రభుత్వం కోరిన విధంగా మార్పులు, చేర్పులు చేయడంలో ఇటు అధికారులు, అటు బ్యాంకర్లకు తల ప్రాణం తోకకు వస్తోంది. రుణమాఫీ అర్హత కల్గిన రైతుల జాబితాలను ప్రభుత్వం బ్యాంకులకు ఇటీవలనే పంపింది.
ఇందులోను తిరకాసు పెట్టడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. రైతుల లోన్ అమౌంట్, అవుట్ స్టాండింగ్ అమౌంట్‌లో మార్పులు ఉంటే సర్దుబాటు చేసి జాబితాలను తిరిగి పంపాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. సర్దుబాట్లు చేయాలని ప్రభుత్వం సూచించడంతో ఇవి రుణ మాఫీకి అర్హత కల్గిన జాబితాలా... వెనక్కి వచ్చిన జాబితాలా అనేది బ్యాంకర్లు సైతం చెప్పలేకపోతున్నారు. అవి అర్హత కల్గిన రైతుల జాబితాలు కాదని, సవరణల కోసం వచ్చినవి మాత్రమేనని ఎల్‌డీసీఎం నరసింహారావు స్పష్టం చేశారు. దీంతో రుణ మాఫీ వ్యవహారం మరింత గందరగోళంలో పడింది.
మొదటి దశలో 2.50 లక్షల మందికే రుణ మాఫీ?
జిల్లాలో 5.24 లక్షల మంది రైతుల వివరాలను బ్యాంకర్లు పంపగా, ఇందులో ఆధార్ నెంబర్ల, రేషన్ కార్డుల వివరాలు పూర్తిగా లేనివి, ఎస్‌ఆర్‌డీహెచ్‌లో చెల్లుబాటు కానివి దాదాపు 3.68 లక్షల రైతుల జాబితాలను ప్రభుత్వం వెనక్కి పంపింది. దీనిపై తహశీల్దార్లు, వీఆర్వోలు వారం రోజుల పాటు కుస్తీ పట్టి వెరిఫికేషన్ చేసి జాబితాలను బ్యాంకులకు ఇచ్చారు.
కాగా, మళ్లీ 2.5 లక్షల మంది రైతులతో మొదటి దశ జాబితా అంటూ ప్రభుత్వం బ్యాంకులకు పంపింది. ఇందులో మార్పులు, సవరణలు చేసి పంపాలని సూచించింది. దీనిని కూడా ప్రభుత్వం 2 రోజులు మాత్రమే గడువు ఇచ్చింది. ఇది కూడా శనివారం మధ్యాహ్నంతో పూర్తి అయింది. అయితే తహశీల్దార్లు చేపట్టిన వెరిఫికేషన్ సమయంలో దాదాపు 30 వేల మంది రైతులను విచారించలేకపోయారు. వీరి పరిస్థితి ఏమిటన్నది తెలియడం లేదు. అదేవిధంగా ఓర్వకల్లు సహకార సంఘంలో మొదటి ఫేజ్‌లో 43.45 శాతం రైతుల వివరాలను డీసీసీబీకి పంపింది.
గార్గేయపురం సొసైటీలో 45.37 శాతం రైతుల వివరాలను సవరణల కోసం పంపింది. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ద్వారా 91,288 రైతుల వివరాలు పంపగా 60,600 మంది రైతుల వివరాల్లో సవరణల కోసం జాబితాలను పంపింది. ఇక ఆలూరు నియోజకవర్గం పరిధిలో 57 వేల మంది రైతులున్నారు. వీరంతా రుణమాఫీ కోసం ఆధార్‌కార్డులు, ఓటర్ ఐడెంటిటి కార్డులను సంబంధిత అధికారులకు అందజేశారు. అయితే దాదాపు 20 వేల మంది రైతుల పేర్లు రుణమాఫీ జాబితాలలో లేకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గందరగోళం
Published Sun, Nov 30 2014 3:52 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement
Advertisement