రుణమాఫీ భారం రూ.23 వేల కోట్లు
- రెండోదశ అర్హుల జాబితా పరిశీలించాం
- రూ.50 వేల వరకు పూర్తి మాఫీ
- ఆపైన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్
- రుణ ఉపశమన పథకంపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీ రెండోదశకు అర్హులైన వారి ఖాతాలను రాష్ట్ర కేబినెట్ పరిశీలించిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. రైతులకు అవసరమైన వివరాలను ఇచ్చేందుకు గ్రామ జన్మభూమి కమిటీలకు సూచనలిచ్చినట్టు తెలిపారు. రుణ ఉపశమన పథకంపై ఆయన సోమవారం అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు. రుణమాఫీ వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.23 వేల కోట్ల భారం పడుతుందని తెలిపారు. రెండు దశల రుణ ఉపశమన పథకం వల్ల 33.19 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.
పంటల బీమా పరిహారం ద్వారా వచ్చే రూ.600 కోట్లను రైతుల ఖాతాల్లోనే జమచేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రూ.50 వేల వరకు ఉన్న రుణాలు ఏక కాలంలో మాఫీ అవుతాయని, ఆ పైన ఉన్నవాటికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెట్టామని చెప్పారు. పట్టాదారు, కౌలు రైతుల్లో కేవలం కౌలు రైతుకే పథకాన్ని వర్తింపజేసినట్టు పేర్కొన్నారు. తొలి విడత రుణమాఫీని అమలు చేశామని, అవసరమైన డాక్యుమెంట్లు, సమాచారం ఇవ్వని వారిని రెండో జాబితాలో చేర్చామని చెప్పారు. ఫిర్యాదుల కోసం ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. వ్యవసాయం కోసం తీసుకున్న బంగారు తాకట్టు రుణాల విషయంలోనూ.. అది తీసుకున్న సమయం, బ్యాంకుల స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను పరిగణనలోకి తీసుకున్నామని తెలిపారు.
కాంగ్రెస్ హయాంలోనే ఆత్మహత్యలు
2004-2014 మధ్య కాలంలో 24,012 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు లెక్కల్లో తేలిందని, కాంగ్రెస్ హయాంలో రైతు ఆత్మహత్యల శాతం 20.4 శాతం నుంచి 36.2 శాతానికి చేరిందని చెప్పారు. అదే కర్ణాటకలో 40.5 నుంచి 30.8 శాతానికి తగ్గిందన్నారు. తాజాగా కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి మోహన్ కుందారియా రైతు ఆత్మహత్యలపై సమాధానమిస్తూ.. దేశవ్యాప్తంగా 1,109 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే అందులో 986 మంది మహారాష్ట్రలో, 29 మంది జార్ఖండ్‌లో, 84 మంది తెలంగాణలో ఉన్నట్టు చెప్పారని, ఆంధ్రప్రదేశ్‌లో రైతుల ఆత్మహత్యలు లేవని పేర్కొన్నారని చెప్పారు.
ప్రాజెక్టులకు రూ.25 వేల కోట్లు కావాలి
నాలుగేళ్లలో పోలవరం ప్రాజెక్టుతో పాటు పలు నీటి ప్రాజెక్టులు నిర్మించి తీరతామని ముఖ్యమంత్రి చెప్పారు. దీనికోసం రూ.25 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశామన్నారు. ఇందులో రూ.11,300 కోట్లు ఎస్కలేషన్‌కు, రూ.18 వేల కోట్లు ప్రాజెక్టుకు, రూ.3,500 కోట్లు భూసేకరణకు, రూ.1,500 కోట్లు అటవీభూముల సేకరణకు ఖర్చవుతుందని అంచనా వేశామని, దీనికోసం కమిటీ వేసి పరిశీలిస్తున్నామని వివరించారు. రూ.1,300 కోట్లతో పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మిస్తామన్నారు. రుణమాఫీ చేయడంతోనే తమ ప్రభుత్వానికి బాధ్యత తీరిపోలేదని, రాష్ట్రంలో ఒక్క ఎకరా కూడా నీళ్లు లేకుండా ఎండిపోకూడదన్నదే తమ అభిమతమని చెప్పారు.