ప్చ్.. మాఫీ రూపాయే!
విశాఖపట్నం: రుణమాఫీలోని డొల్లతనం మరోసారి బయటపడింది. సుమారు రూ.35 వేలకుగాను ఒక్క రూపాయి రుణాన్ని మాఫీ చేస్తున్నట్లు రైతుకు అందిన రుణవిముక్తి పత్రం చూస్తే రుణమాఫీ తీరు ఎలా ఉండో తెలుస్తోంది. విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం మజ్జిపేటకు చెందిన మజ్జి సూర్యారావుకు అక్షరాల ఒక్క రూపాయికి రుణవిముక్తి పత్రం ఇచ్చారు. సూర్యారావు రెండేళ్ల కిందట మజ్జివలస పీఏసీఎస్‌లో సుమారు రూ.32 వేల రుణం పొందాడు.
దీనికి రెండు సంవత్సరాలుగా మరో రూ.3 వేలు వడ్డీ పడింది. మొత్తం కలసి అతడికి సుమారు రు.35 వేలు రుణమాఫీ కావలసి ఉంది. అధికారులు ‘ఒక్క రూపాయి’ విలువ చేసే రుణవిముక్తి పత్రం ఇచ్చారు.
సూర్యారావుకు మజ్జిపేట పంచాయతీలో 5/4, 6/4, 96/3 సర్వే నంబర్లలో ఉన్న 1.97 ఎకరాల మెట్ల భూమిలో మామిడి, టేకు, బంతి తోటలు, తన సిమెంటు రేకుల షెడ్డు కూడా గత ఏడాది అక్టోబరులో సంభవించిన హుద్‌హుద్ తుపానులో పూర్తిగా దెబ్బతిన్నాయి. వాటికి కూడా పైసా పరిహారం అందలేదని సూర్యారావు చెప్పారు. ఈ పత్రం పట్టుకుని బ్యాంకు వద్దకు వెళ్లినా ప్రయోజనం లేకపోయిందన్నాడు.