
సాగు లేదు .. పరిహారమూ రాదు
- మారని ‘బతుకు’
- బీటీపీ ఆయకట్టు రైతుల దుర్భర జీవితాలు
- ప్రత్యామ్నాయం చూపడంలో చంద్రబాబు విఫలం
- ఊరిస్తున్న సీఎం హామీలు
పేరుకే తరిభూములు.. ఐదేళ్లకోసారి కూడా సాగులోకిరావు. మెట్ట రైతులతో సమానంగా అన్నింటా నష్టపోతున్నా పైసా కూడా పరిహారం దక్కదు. ప్రభుత్వం అందించే సబ్సిడీ విత్తన వేరుశనగ సైతం ముందుగా మెట్ట ప్రాంత రైతులకు పంపిణీ చేసిన తర్వాత ఏదైనా మిగిలితే ఇస్తారు. తమ బాధలు అర్థం చేసుకుని మెట్ట ప్రాంత రైతుల్లాగే ప్రభుత్వ రాయితీలు దక్కేలా చూడాలంటూ అధికారులు, ప్రజాప్రతినిధుల కాళ్లావేళ్లా పడుతున్నా ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. ఇది జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టుల్లో ఒకటైన బైరవాని తిప్ప ప్రాజెక్ట్ (బీటీపీ) పరిధిలోని వేలాది మంది ఆయకట్టు రైతుల ఆవేదన. దుర్భర జీవితాలను అనుభవిస్తున్న బీటీపీ ఆయకట్టుదారులకు ప్రత్యామ్నాయ వ్యవస్థ చూపడంలో సీఎం చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారు. ఇదిగో.. అదిగో.. అంటూ హామీలతో ఊరిస్తూ కాలం వెల్లదీస్తుండడంతో ఆయకట్టుదారుల బతుకులు మారడం లేదు.
గుమ్మఘట్ట మండలం బైరవాని తిప్ప సమీపంలోని వేదావతి నదిపై రూ.1.5 కోట్ల వ్యయంతో 2.5 టీఎంసీల సామర్థ్యంతో 1954లో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. సుదీర్ఘంగా సాగిన ఈ పనులు 1961లో పూర్తి అయ్యాయి. ఈ ప్రాజెక్టుకు 4.9 టీఎంసీల నీటిని కేటాయించి కుడి, ఎడమ కాలువల ద్వారా రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లోని గుమ్మఘట్ట, బ్రహ్మసముద్రం మండలాల్లో 12,400 ఎకరాలకు సాగునీరందించాలని నిర్ణయించారు. అయితే ప్రాజెక్ట్ క్యాచ్‌మెంట్ ఏరియా మొత్తం కర్ణాటకలోనే ఉండడం, అంతేకాక అక్కడి ప్రభుత్వం అక్రమ బ్యారేజీలు నిర్మించి నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడంతో సమస్య మొదలైంది. ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి అక్కడి చెరువులు, చెక్‌డ్యామ్‌లు తెగితే తప్ప బీటీపీకు నీరుచేరని దుస్థితి నెలకొంది. దీంతో ఈ ప్రాంతాల్లోని రైతులు జీవనోపాధి పూర్తిగా దెబ్బతింది. క్యాచ్‌మెంట్ ఏరియాలో ఎలాంటి కట్టడాలూ ఉండరాదన్న బ్రిజేష్‌కుమార్, బచావత్ ట్రిబ్యునల్ తీర్పులను ధిక్కరిస్తూ కర్ణాటక ప్రభుత్వం నిర్మాణాలు పూర్తి చేయడంతో ఐదేళ్లుగా బీటీపీకు చుక్క నీరు చేరలేదు. ఫలితంగా రిజర్వాయర్ బీటలు వారింది.
ప్రత్యామ్నాయం చూపని సీఎం : ఆరేళ్లుగా బీటీపీ పరిధిలోని ఆయకట్టు బీడుపడిపోయి రైతులంతా కూలీలుగా మారిపోయారు. గ్రామాలు వదిలి పట్టణ ప్రాంతాల్లో సెక్యూరిటీగార్డులు గాను, దుకాణాల్లో పనులకు చేరిపోయి పొట్టపోసుకుంటున్నారు. బీటీప్రాజెక్టుకు శాశ్వత నీటి మోక్షం కల్పించే వరకూ తరి పేరును మార్చి ప్రభుత్వ రాయితీలు అందిస్తే తప్ప తమ బతుకులు మారవని వేలాది మంది రైతులు కోరుతున్నా.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. ఆఖరుకు బీటీప్రాజెక్ట్ ఆయకట్టుదారులకు ప్రత్నామ్నాయ మార్గాలను సైతం ఆయన చూడం లేదంటూ పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కనికరించడం లేదు
ఆరేళ్లలో ప్రాజెక్ట్ గేట్ల వరకు ఒక్కసారి కూడా నీరు చేరలేదు. పచ్చగా కళకళలాడాల్సిన ఆయకట్టు భూములు కంపచెట్లు, పిచ్చిమొక్కలు పెరిగి కళావిహీనంగా మారాయి. అన్నింటా నష్టపోతున్న మాకు ప్రభుత్వ రాయితీలు మాత్రం అందడం లేదు. మా బాధలు ఎందరితో చెప్పినా ఏ ఒక్కరూ కనికరించలేదు. ఈసారైనా మా గోడును పరిగణనలోకి తీసుకుని న్యాయం చేయాలి.
– అంగడి తిప్పేస్వామిరెడ్డి, రైతు, బీటీపీ
కలెక్టర్‌ను కలుస్తాం
బీటీప్రాజెక్ట్ ఆయకట్టు రైతులకు రాయితీల మంజూరులో జరుగుతున్న అన్యాయంపై కలెక్టర్‌ను కలిసి వివరిస్తాం. ప్రాజెక్టుకు శాశ్వత నీటి లభ్యత లభించే వరకూ అన్ని రకాల రాయితీలనూ వర్తింపచేయాలని కోరుతాం. ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే రైతులతో కలసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం. అవసరమైతే ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి సైతం ఈ విషయాన్ని తీసుకెళ్లి అసెంబ్లీలో చర్చించేలా చూస్తాం.
– కాపు రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, రాయదుర్గం