రుణమాఫీ కోసం రైతుల ఎదురుచూపు | Farmers waiting for waiver | Sakshi
Sakshi News home page

రుణమాఫీ కోసం రైతుల ఎదురుచూపు

Published Fri, May 30 2014 12:48 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

రుణమాఫీ కోసం రైతుల ఎదురుచూపు - Sakshi

రుణమాఫీ కోసం రైతుల ఎదురుచూపు

  •      రుణగ్రస్తులు 8,70,321 మంది
  •      బకాయిలు రూ.7693.75 కోట్లు
  •      ఖరీఫ్ వచ్చినా కొత్త రుణాలివ్వరా ?
  •  సాక్షి ప్రతినిధి, తిరుపతి: జిల్లాలో రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. అధికారంలోకి రాగానే రైతుల రుణాలు మాఫీ చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం రైతులు తీసుకున్న రుణాలు రీషెడ్యూల్ చేయడం, తరువాత కొత్తరుణాలు ఇవ్వడం జరుగుతోంది. అయితే ఈ సంవత్సరం ఆ పరిస్థితి కనిపించడం లేదు.

    కొత్త ప్రభుత్వం రుణాలు మాఫీ చేస్తుందనే ఆశతో రైతులు ఉన్నారు. ప్రతి ఏడాది ఖరీఫ్ సీజన్ జూన్‌లో ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం రోహిణి కార్తెలో ఎండలు తీవ్రంగా ఉన్నప్పటికీ సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా రెండు రోజులుగా ఎండలు తగ్గాయి. వర్షాలు పడుతున్నాయి. దీంతో రైతులు ముందుగానే దుక్కులు దున్ని ఖరీఫ్‌కు సిద్ధమవుతున్నారు.
     
    జిల్లాలో వ్యవసాయ రుణ బకాయిలు మార్చి నెలాఖరు వరకు రూ.7693.75 కోట్లు ఉన్నట్లు బ్యాంకు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు రుణ బకాయిల జాబితాను వారు తయారు చేశారు. జిల్లా వ్యాప్తంగా 8 లక్షలా 70 వేల 321 మంది చిన్న, సన్నకారు, మధ్య, పెద్ద రైతులు రుణాలు తీసుకున్నట్లు బ్యాంకు అధికారులు చెబుతున్నారు.

    జిల్లా వ్యాప్తంగా 40 ప్రధాన బ్యాంకుల కింద 478 బ్రాంచీలు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ వ్యాపార బ్యాంకులు 291 కాగా, ప్రైవేటు వ్యాపార బ్యాంకులు 52 ఉన్నాయి. చిత్తూరు జిల్లా కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు కింద 30 బ్రాంచీలు ఉండగా, సప్తగిరి గ్రామీణ బ్యాంకు కింద 104 బ్యాంకులు ఉన్నాయి. ఈ బ్యాంకులన్నింటిలో భూముల పాస్‌పుస్తకాలు తనఖాపెట్టి రైతులు రుణాలు పొందారు. 8,70,321 మంది రైతుల పాస్ పుస్తకాలు ప్రస్తుతం బ్యాంకుల్లో ఉన్నాయి.
     
    మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రైతులకు రుణమాఫీ చేశారు. ఆ తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు రైతుల రు ణాలను పట్టించుకోలేదు. ప్రతి సంవత్సరం రుణాల రీషెడ్యూల్ మాత్రం జరుగుతోంది. అంటే తీసుకున్న అప్పును కంతుల వారీగా చెల్లించేందుకు గడువు ఇస్తున్నారు. రుణాలపై వడ్డీ పడుతూనే ఉంది. అటు రుణం, వడ్డీపై వడ్డీ, తరువాత కొత్త రుణాలు తీసుకోవడం కలిసి రైతులకు తడిసి మోపెడైంది. ఒక్కో రైతు లక్షల్లో రుణాలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. చంద్రబాబు రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పడంతో ఆశతో ఎదురు చూస్తున్నారు.
     
    బ్యాంకు అధికారులు ఏమంటున్నారంటే...
     
    ఇంతవరకు తమకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాలేదని, కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసిన తరువాత ఉత్తర్వులు వస్తాయేమోనని ఎదురు చూస్తున్నామని అధికారులు చెబుతున్నారు. గతంలో తీసుకున్న రుణాలు చెల్లించేవారికి ఇప్పుడు కొత్తగా ఇవ్వడానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, అయితే రుణం చెల్లించకుండా, మాఫీ కాకుండా కొత్త రుణాలు ఇవ్వలేమని చెప్పారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement