రుణ మాఫీపై కౌలు రైతు గంపెడాశ
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన రుణమాఫీపై కౌలు రైతులు డోలాయమానంలో పడ్డారు. తమ రుణాలు పోతాయే లేదోననే ప్రశ్న వారిని వేధిస్తోంది. జిల్లాలో పలువురు కౌలు రైతులు గ్రూపులుగా ఏర్పడి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. ఆ సమయంతో భూయజమానుల సర్వే నంబర్లను దరఖాస్తులో పేర్కొన్నారు. ఇవే సర్వే నంబర్లుతో భూయజమానులు కూడా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. ఈ రెండింటిలో ఏ రుణాన్ని రద్దు చేస్తారో అంతుచిక్కక కౌలు రైతులు ఆందోళన చెందుతున్నారు. గ్రామాల్లో నలుగురు రైతులు గుమిగూడినా రుణమాఫీ పైనే చర్చిస్తున్నారు.
ముదినేపల్లి రూరల్, న్యూస్‌లైన్ : అధికారంలోకొస్తే రుణాలు రద్దుచేస్తామన్న టీడీపీ అధినేత చంద్రబాబు హామీపై కౌలు రైతులు గంపెడాశతో ఉన్నారు. మండలంలోని పలువురు సంయుక్త గ్రూపులుగా (జేఎల్జీ) ఏర్పడి వివిధ బ్యాంకుల నుంచి పంట రుణాలు పొందారు. మూడేళ్లుగా పంటలు నష్టపోయి చెల్లించలేక అవస్థలు పడుతున్నారు. బాబు ప్రకటించిన రుణాల రద్దు ప్రకటన వారిలో ఆశలు రేకెత్తిస్తోంది.
మండలంలో 1.64 కోట్ల రుణాలు
మండలంలో 2వేల మంది వరకు కౌలు రైతులు 209 గ్రూపులుగా ఏర్పడ్డారు. గతేడాది సార్వా సీజన్లో 1.64 కోట్ల రుణాలు పొందారు. ముదినేపల్లి ఎస్‌బీఐ నుంచి 32గ్రూపులు రూ. 16లక్షలు, ముదినేపల్లి సప్తగిరి గ్రామీణ బ్యాంకు బ్రాంచి నుంచి 39గ్రూపులు రూ. 29లక్షలు, అల్లూరు బ్రాంచి నుంచి 4 గ్రూపులు రూ. 1.8లక్షలు రుణాలు పొందాయి. శ్రీహరిపురం ఆంధ్రాబ్యాంక్ నుంచి 7గ్రూపులు రూ. 10.25లక్షలు, ఇండియన్ బ్యాంక్ పెదగొన్నూరు బ్రాంచి నుంచి 101గ్రూపులు రూ. 90.5లక్షలు, పెదతుమ్మిడి బ్రాంచి నుంచి 9గ్రూపులు రూ. 13.5లక్షలు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు మోటూరు బ్రాంచి నుంచి 17గ్రూపులు రూ. 3లక్షలు పంట రుణాలు పొందాయి. ఇవి కాకుండా 2011, 2012 సంవత్సరాల్లో 73 గ్రూపులు వివిధ బ్యాంకులకు గడువు మీరిన బాకీలు రూ. 35లక్షలు చెల్లించాల్సి ఉంది.
ఆచరణ సాధ్యమేనా?
రుణాలు పొందిన కౌలు రైతుల్లో ఎక్కువ మందికి గుర్తింపు కార్డులు లేవు. వీరంతా గ్రూపులుగా ఏర్పడి వ్యవసాయాధికారుల సిఫారసుతో బ్యాంకుల నుంచి రుణాలు పొందుతున్నారు. వీటిని తిరిగి చెల్లించిన వెంటనే అధికారులు రెన్యువల్ చేస్తున్నారు. రుణాలు పొందే సమయంలో యజమాని భూమి సర్వే నంబర్లను తెలపాలి. వాటిని తనఖాగా ఉంచి యజమాని కూడా పంట రుణం పొందుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకే భూమిపై రెండు పంట రుణాలు ఏవిధంగా రద్దు చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. కౌలు రైతుల రుణాలకు, భూయజమానికి ఎలాంటి సంబంధం ఉండదు. రద్దు చేసే పక్షంలో యజమానికే ప్రాధాన్యత ఇస్తే కౌలు రైతులు నష్టపోయే ప్రమాదముంది.
పరిహారం తంతే!
పంటలు నష్టపోయిన సమయంలో ప్రభుత్వం రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ రూపంలో పరిహారం అందిస్తోంది. భూములు కౌలుకు ఇచ్చినప్పటికీ పరిహారం మాత్రం కౌలు రైతులకు దక్కకుండా యజమానులకే అందుతోంది. ఇందుకు అనేక నిబంధనలు అడ్డుగా నిలుస్తున్నందున అధికారులు సైతం ఏమీ చేయలేక పోతున్నారు. యజమాని దయతలచి కౌలు రైతు పేరును నష్టపోయిన రైతుల జాబితాలో చేర్చేందుకు అంగీకరిస్తేనే పరిహారం వస్తోంది. రుణాల రద్దు సైతం ఇదే విధంగా ఉండే అవకాశం లేకపోలేద నే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కౌలు రైతులను ఆదుకోవాలనే పట్టుదల ప్రభుత్వంలో ఉంటేనే తప్ప రుణాల రద్దుతో మేలు జరిగే అవకాశం పెద్దగా ఉండదని బ్యాంకర్లు పేర్కొంటున్నారు.