చెల్లిస్తే.. మాఫీకి చెల్లుచీటే | Chandrababu Naidu Cheating Farmers On Loan Waiver | Sakshi
Sakshi News home page

చెల్లిస్తే.. మాఫీకి చెల్లుచీటే

Published Tue, Aug 19 2014 1:37 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

చెల్లిస్తే.. మాఫీకి చెల్లుచీటే - Sakshi

చెల్లిస్తే.. మాఫీకి చెల్లుచీటే

సాక్షి ప్రతినిధి, కాకినాడ :వ్యవసాయ రుణాల మాఫీపై చంద్రబాబు హామీ.. అనేక మలుపులు, మెలికలతో చివరికి ఎక్కువమంది రైతులకు.. అదీ సకాలంలో రుణాలు చెల్లించిన వారికి నిరాశానిస్పృహలనే మిగిల్చేలా ఉంది. రుణాల మాఫీ అమలుకు సర్కార్ విధించిన సవాలక్ష షరతులు చాలవన్నట్టు ఈ నెల 14న విడుదల చేసిన జీఓ :174 జిల్లాలో సన్న, చిన్నకారు రైతులకు శాపంగా పరిణమించింది. గత డిసెంబరు 31కి ముందు తీసుకుని గత మార్చి 31 నాటికి రుణగ్రస్తులైన రైతులకే రుణమాఫీ వర్తిస్తుందని ఆ జీఓ స్పష్టం చేస్తోంది. డిసెంబరు 31లోపు రుణం తీసుకున్న రైతులకే మాఫీ వర్తిస్తుందనేనిబంధన సహకార సంఘాల్లో రుణాలు పొందిన మెజారిటీ రైతులను నట్టేట ముంచేస్తోంది.
 
 సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఆప్‌కాబ్ సమావేశంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ సీఈఓ హేమసుందర్ కటాఫ్ డేట్ కారణంగా రైతులు నష్టపోతున్న విషయాన్ని ప్రస్తావించడం గమనార్హం. ఈ విషయంపై ఈ నెల 20న హైదరాబాద్‌లో జరిగే స్టేట్ లెవెల్ బ్యాంకర్ల సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు.ఈ జీఓ కారణంగా పంటరుణాలను సకాలంలో చెల్లించిన రైతులు రుణ మాఫీ లబ్ధిని కోల్పోయే పరిస్థితి నెలకొంది. ఈ రకంగా లక్షన్నర మంది రైతులుసుమారు రూ.500 కోట్ల మేర లబ్ధికి దూరమవుతారని రైతు సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీపై మొదటి నుంచీ చంద్రబాబు సర్కారు భారం తగ్గించుకునే ఎత్తులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఆ వ్యూహంలో భాగమే ఈ జీఓ అని రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లాలోని సహకార సంఘాల అధ్యక్షులు ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించారు. 2014 మార్చి 31 నాటికి ఔట్ స్టాండింగ్ (రుణం ఉండాలి)గా ఉన్న రుణాలు 2013 డిసెంబరు 31 లోపు తీసుకుని ఉండాలని ఈ జీఓ సారాంశంగా ఉంది.
 
 సన్న, చిన్నకారు రైతులకు మొండిచెయ్యి..
 సహకార సంఘాల్లోని రైతులు డీసీసీబీ నిబంధనలను అనుసరించి ఏటా రెండు పర్యాయాలు.. అంటే 0 శాతం వడ్డీ రాయితీ, పావలా వడ్డీ పథకాలు ఉపయోగించుకునేందుకు మార్చి 31 లోపు ఒక పర్యాయం, ఖరీఫ్‌లో పంటల బీమా పథకం పొందేందుకు జూన్ 30 లోపు మరో పర్యాయం రుణాలు చెల్లిస్తుంటారు. అదీ కూడా చాలా వరకు బుక్ అడ్జస్ట్‌మెంట్ (పుస్తకంలో రుణం చెల్లించినట్టు, తిరిగి తీసుకున్నట్టు) చేసి మళ్లీ తీసుకోవడం పరిపాటి. ఈ జీఓ ప్రకారం జిల్లాలో సకాలంలో రుణాలు చెల్లించిన రైతులకు రుణమాఫీ ప్రయోజనం చేకూరనట్టే. 2013 డిసెంబరు 31నాటికి చాలా మంది రైతులు తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించేశారు. ఈ రకంగా జిల్లాలో సహకార సంఘాల ద్వారా సుమారు రూ.500 కోట్ల వరకు చెల్లించారని అంచనా. వీరంతా సన్న, చిన్నకారు రైతులే కావడంతో జీఓతో నష్టపోయేది కూడా వారే. వీరంతా రుణాలు సకాలంలో చెల్లించకపోతేమాఫీకి అర్హులై ఉండేవారు. నిజాయితీగా రుణాలు చెల్లించడమే తాము చేసిన తప్పా అని సన్న, చిన్నకారు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోనసీమకు చెందిన సహకార సంఘాల అధ్యక్షులు సోమవారం అమలాపురంలో సమావేశమై జీఓ : 174ను సవరించాలని డిమాండ్ చేశారు.
 
 కోనసీమ సహకార సంఘాల అధ్యక్షుల డిమాండ్
 అమలాపురం టౌన్ : రుణమాఫీకి సంబంధించి ఈనెల 14న జారీ చేసిన జీఓ :174లోని రెండో నిబంధనను సవరిస్తేనే సకాలంలో రుణాలు చెల్లించిన రైతులకు మాఫీ వర్తిస్తుందని కోనసీమ డివిజన్ సహకార సంఘాల అధ్యక్షుల సమాఖ్య సమావేశం ప్రభుత్వానికి సూచించింది. సహకార సంఘాల అధ్యక్షులు అమలాపురంలో సోమవారం సమావేశమై జీఓ :174పై సుదీర్ఘంగా చర్చించారు. ఆ జీఓను సవరిస్తే జిల్లాలో సకాలంలో రుణాలు చెల్లించిన వేలాది మంది రైతులకు మేలు జరుగుతుందన్నారు. సమాఖ్య ప్రతినిధులు జున్నూరి బాబి, గోకరకొండ విజయరామారావు, ఆర్.వి.రామారావు, మెట్ల రమణబాబు, యాళ్ల బ్రహ్మానందం తదితరులు మాట్లాడుతూ జీఓ:174లోని రెండో  నిబంధన ప్రకారం సహకార సంఘాల్లో అప్పులు తీసుకుని సకాలంలో చెల్లించిన రైతులకు రుణమాఫీ వర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో పలువురు రైతులు రూ.500 కోట్ల పైచిలుకు రుణాలను సకాలంలో చెల్లించారని తెలిపారు. జీఓను తప్పనిసరిగా సవరించి, వారికి కూడా మేలు జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు.
 
 జీఓ సవరించకుంటే రైతులకు
 తీరని అన్యాయమే..
 ఏ ప్రభుత్వమైనా సకాలంలో చెల్లించిన రైతులకు బాసటగా నిలవాలి. జీఓ:174 వల్ల నిజాయితీగా రుణాలు చెల్లించిన రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ప్రభుత్వం పునరాలోచించి, జీఓ :174ను సవరించి జిల్లాలో ఇప్పటికే చెల్లించిన రూ.500 కోట్ల రుణాలకు మాఫీ వర్తించేలా చేయాలి.
 - జున్నూరి బాబి, డీసీసీబీ మాజీ డెరైక్టర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement