అనుసంధానం..నత్తగమనం
సాక్షి, కాకినాడ :రుణమాఫీ హామీతో తమను ఊరించిన చంద్రబాబు గద్దెనెక్కాక తమ ఆశలతో క్రూరంగా పరిహాసమాడుతున్నారని అన్నదాతలు వాపోతున్నారు. ఎన్నికల ముందు రైతురుణాలన్నీ మాఫీ చేస్తానని నమ్మించి, ఇప్పుడు రకరకాల షరతులు విధించిన బాబు చివరికి..తమలో కొందరికైనా కనీస మాఫీని వర్తింపజేస్తారో లేక ఎవరికీ ఏమీ మేలు చేయకుండానే ఈ నాటకానికి తెరదించుతారోనన్న అనుమానం వారిలో రోజురోజుకూ బలపడుతోంది. మార్గదర్శకాలు జారీ అయి రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఎందరు రైతులు, ఎంత మేర రుణమాఫీకి అర్హులో తేల్చే ప్రక్రియ కొలిక్కి రాకపోవడం, దానిపై అటు అధికారులకు గానీ, ఇటు బ్యాంకర్లకు గానీ స్పష్టత కొరవడం ఇందుకు కారణం.
జిల్లాలో రైతుల రుణాలు.. 3,12,823 పంట రుణ ఖాతాల్లో రూ.2,844 కోట్లు, 4,88,630 బంగారు రుణాల ఖాతాల్లో రూ.3945 కోట్లు, 1,81,141 కన్వర్టెడ్ క్రాప్ లోన్ ఖాతాల్లో రూ.876 కోట్లు, 71,744 టెర్మ్ లోన్ ఖాతాల్లో రూ.1022 కోట్ల వరకు ఉన్నాయి. వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల నిమిత్తం వివిధ రూపాల్లో తీసుకున్న రుణాలకు సంబంధించి 1,29, 355 ఖాతాల్లో మరో రూ.2,243 కోట్లు ఉన్నాయి. మొత్తం రైతులకు 10,83,693 ఖాతాల ద్వారా రూ.10,930 కోట్ల రుణాలున్నాయి. ప్రభుత్వం రుణమాఫీని పూర్తిగా పంట, బంగారు రుణాలకే పరిమితం చేయడంతో జిల్లాలో రూ.7665 కోట్లకు సంబంధించిన 8,82,594 ఖాతాలను పరిశీలిస్తే తప్ప ఏ మేరకు ఎంతమంది లబ్ధి పొందుతారో చెప్పలేని పరిస్థితి నెలకొంది.
జిల్లాలో 90 శాతం చిన్న, సన్నకారు రైతులకు సంబంధించి రూ.3,500 కోట్ల నుంచి రూ.4 వేల కోట్ల వరకు రుణాలు మాఫీ అవుతాయని ప్రాథమిక అంచనా. రుణమాఫీకి అర్హులుగా భావిస్తున్న 8,82,594 ఖాతాల వివరాలు (ఏ అవసరానికి ఎంత రుణం తీసుకున్నారు..తనఖా పెట్టిన భూమి లేదా బంగారం వివరాలు, భూమి రికార్డులు, పట్టాదార్ పాస్‌పుస్తకాలు, ఆధార్, రేషన్‌కార్డులు) సేకరించాల్సి ఉంది. ఇందుకోసం తొలుత 30 కాలమ్‌లతో ఒక ఫార్మాట్‌ను పంపిన ప్రభుత్వం తర్వాత మరో ఐదు కాలమ్‌లను చేర్చింది. ఉన్న కొద్దిపాటి సిబ్బంది, మొరాయించే ఇంటర్నెట్ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని 35 కాలమ్‌లతో కూడిన ఈ ఫార్మాట్ ను నింపి ఆన్‌లైన్‌తో అనుసంధానించడం బ్యాంకర్లకు కత్తిమీద సాములా మారింది. వీటిలో 14 కాలమ్‌లను బ్యాంకులు పూర్తి చేస్తున్నాయి. మిగిలిన వివరాల్లో సగం వారి రుణ డాక్యుమెంట్ల నుంచి, తక్కినవి రైతుల నుంచి సేకరించాల్సి ఉంది.
క్షేత్రస్థాయిలో తప్పని ఇబ్బందులు
జిల్లాలో సహకార రంగంతో కలిపి 40 జాతీయ, గ్రామీణ బ్యాంకుల శాఖలు ఉన్నాయి. వీటిలో 20 బ్యాంకులు వెబ్ ల్యాండ్ పోర్టల్‌లో ఈ వివరాలన్నీ అప్‌లోడ్ చేస్తుండగా మరో 20 బ్యాంకులు ఎక్సెల్ ఫార్మెట్‌లో పొందుపరుస్తున్నాయి. ఒక్కో ఖాతా వివరాలు సేకరించి, ఆన్‌లైన్‌లో ఉంచడానికి కనీసం 15 నిముషాలు పడుతుంది. రుణమాఫీ వర్తించే అవకాశం ఉన్న 8,82,594 లక్షల ఖాతాల్లో 3.35 లక్షల ఖాతాల వివరాలను మాత్రమే ఇంతవరకూ అప్‌లోడ్ చేయగలిగారు. సేకరణ మొదలు పెట్టి నెలరోజులైనా 30 శాతం ఖాతాల వివరాలను కూడా ఆన్‌లైన్‌లో ఉంచలేక పోయారు. ఈ ప్రక్రియను నిత్యం కలెక్టర్ నీతూప్రసాద్‌తో పాటు లీడ్ బ్యాంక్ మేనేజర్ జగన్నాథస్వామి పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 25లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించినా క్షేత్రస్థాయి ఇబ్బందుల దృష్ట్యా తీవ్ర జాప్యం తప్పడం లేదు. ఈ నెలాఖరుకు కాదు కదా కనీసం అక్టోబర్ నెలాఖరుకైనా ఈ ప్రక్రియ పూర్తి కావడం కష్టమని బ్యాంకర్లే అంగికరీస్తున్నారు. ఒక పక్క రోజువారీ కార్యకలాపాలు, మరొక వైపు జన్‌ధన్ ఖాతాల లక్ష్యాలతో ఒత్తిడికి గురవుతున్నందున రుణమాఫీ ఖాతాల వివరాల సేకరణ, ఆన్‌లైన్ లో అప్‌లోడ్ చేయడం కష్టతరమంటున్నారు. అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి మరింత గడువునిస్తే తప్ప ఈ ప్రక్రియను పూర్తి చేయలేమంటున్నారు.
ఇంకెంత కాలం ఈ ‘త్రిశంకు నరకం’
కాగా ఇలా తాత్సారం చేయడం వెనుక రుణమాఫీ భారాన్ని విరగడ చేసుకోవాలన్న సర్కారు ఎత్తుగడ ఉందని, ప్రభుత్వం సూచనల మేరకే బ్యాంకర్లు జాప్యం చేస్తున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. కాగా జాప్యం జరిగే కొద్దీ వడ్డీ భారం తడిసిమోపెడైపోతుందని ఆందోళన చెందుతున్నారు. చివరికి తమకు మాఫీ వర్తించినా.. సర్కారు చేకూర్చే లబ్ధి.. ఆనాటికి పేరుకునే వడ్డీలకు సరిపోదేమోనని నిట్టూరుస్తున్నారు. భారం తగ్గుతుందని ఆశపడ్డ పాపానికి ఇంకెంత కాలం ఈ ‘త్రిశంకు నరకం’లో చిక్కుకుని ఉండాలని ఆక్రోశిస్తున్నారు.