అప్పు.. ముప్పు
బ్యాంకు అప్పు ఆ రైతన్న కుటుంబానికి ముప్పు తెచ్చిపెట్టింది. తీసుకున్న రుణం తీర్చలేదని వడ్డీవ్యాపారులను తలపించేరీతిలో సహకార బ్యాంక్ సిబ్బంది హంగామా సృష్టించి అన్నదాత పరువును బజారుకీడ్చింది. అప్పుచెల్లించలేదని మండలంలోని బునియాదిపురం గ్రామంలో అధికారులు ఓ రైతు కొడుకుల ఇంటి సామానును స్వాధీనం చేసుకున్నారు.
బాధితుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన రైతు బాలయ్య గౌడ్ 1993లో వ్యవసాయ బావి మరమ్మతుల కోసం రూ.23,400, డీజిల్ ఇంజన్ కోసం మరో రూ.11,500 చొప్పున మొత్తం రూ.34,900 మండలంలోని రంగాపూర్ సింగిల్‌విండో బ్యాంకు ద్వారా రుణం తీసుకున్నాడు. అప్పు తీసుకుని రెండేళ్లు దాటకముందే అనారోగ్యంతో బాలయ్యగౌడ్ మృతిచెందాడు. ఆయనకు ఐదుగురు కొడుకులు ఉండగా, ఇద్దరు మృతిచెందారు. తండ్రి చేసిన అప్పు విషయాన్ని కొడుకులు మరిచిపోయారు. అప్పుకు వడ్డీతో కలిపి 2014 ఫిబ్రవరి నాటికి రూ.2.40లక్షలు చెల్లించాలని అధికారులు రికార్డుల్లో కెక్కించారు.
ఇదిలాఉండగా, గురువారం వనపర్తి డీసీబీ బ్యాంక్ మేనేజర్ సత్యప్రకాశ్, పెబ్బేరు సింగిల్ విండో సిబ్బందితో కలిసి బునియాదిపురం గ్రామానికి వెళ్లారు. బాలయ్యగౌడ్ కొడుకుల ఇళ్ల వద్దకు చేరుకున్న వారు అప్పు తీర్చనందుకు మీ సామానులను జప్తుచేస్తున్నట్లు చెప్పి దౌర్జన్యంగా వారి ఇళ్ల తలుపులు, టీవీ ఇతర సామగ్రిని జీపులోకి ఎక్కించుకుని పెబ్బేరు సింగిల్ విండో కార్యాలయానికి వెళ్లారు. ఈ విషయమై పెబ్బేరు సింగిల్ విండో కార్యాలయంలో ఉన్న డీసీసీబీ బ్యాంక్ మేనేజర్ సత్యప్రకాశ్‌ను వివరణ కోరగా.. సమాధానం దాటవేశారు. రైతుల వద్ద నుంచి నిర్బంధంగా అప్పులు వసూలు చేయరాదని జీఓ ఉన్నా సామగ్రిని ఎందుకు తీసుకొచ్చారన్న ప్రశ్నకు సమాధానం కరువైంది. తండ్రి పేర ఉన్న అప్పును ఆయన కుమారులు చెల్లించేందుకు అంగీకార పత్రం రాసిచ్చారని అధికారులు చూపించిన పత్రం బోగస్‌గా తేలడం కొసమెరుపు.