పాతనోట్ల పై ఆర్‌బీఐ విచారణ
►రెండు రోజులుగా సహకార బ్యాంకుల శాఖల్లో తనిఖీలు
►డీసీసీబీలో ఉండిపోయిన రూ.11.27 కోట్లు
మోర్తాడ్ (బాల్కొండ): జిల్లా సహకార బ్యాంకులో నిల్వ ఉండిపోయిన పాతనోట్ల వ్యవహారంలో నిజానిజాలను తేల్చడానికి రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా, నాబార్డు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. రూ.1,000, రూ.500 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయగా ఆ నోట్లను బ్యాంకుల్లో డిసెంబర్ 31, 2016వరకు డిపాజిట్ చేయడానికి కేంద్రం గడువు విధించిన విషయం విదితమే. నవంబర్ 9 నుంచి రద్దు అయిన నోట్ల డిపాజిట్‌కు అంగీకరించిన కేంద్రం సహకార బ్యాంకుల్లో అదే నెల 13 నుంచి స్వీకరణను నిలిపివేసింది. నిర్వహణ సరిగా లేక పోవడం, రాజకీయ నాయకుల జోక్యంతో ఎక్కువ జమ అయిన విషయాన్ని గుర్తించిన కేంద్రం సహకారం బ్యాంకుల్లో రద్దు అయిన నోట్ల డిపాజిట్‌కు బ్రేక్ వేసింది. నవంబర్ 9, 10, 11, 12 తేదిల్లో పాత నోట్లను స్వీకరించగా జిల్లా సహకార బ్యాంకు బ్రాంచీల నుంచి రూ.43 కోట్లను సేకరించారు.
ఈ నోట్ల సేకరణపై ఆర్‌బీఐ అనుమానాలు వ్యక్తం చేస్తూ అప్పట్లోనే విచారణ నిర్వహించింది. చివరకు రూ.43 కోట్ల విలువ చేసే నోట్లను ఆర్‌బీఐ స్వీకరించింది. కాగా చివరి రోజున మొదట చెప్పిన లెక్క కంటే ఎక్కువ పాత నోట్లను పలు బ్రాంచీల నుంచి సేకరించారు. ఆలా సేకరించిన నోట్లు రూ.11.27 కోట్ల వరకు ఉన్నాయి. సహకార బ్యాంకుల్లో పాత నోట్ల స్వీకరణకు బ్రేక్ వేస్తు ఆర్‌బీఐ ఉత్తర్వులు జారీ చేసిన సమయంలో కొన్ని బ్రాంచీల నుంచి హడావిడిగా పాత నోట్లను స్వీకరించినట్లు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. బ్లాక్ మనీని వైట్‌గా మార్చుకోవడానికి పలువురు సహకార బ్యాంకు శాఖలను ఎంచుకున్నారని, అదే నేపథ్యంలోనే నోట్ల స్వీకరణకు బ్రేక్ వేసే సమయానికి లెక్కకు మించి నోట్లను తీసుకున్నట్లు ఆర్‌బీఐ ఉన్నతాధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో పాతనోట్లను ఆర్‌బీఐ తీసుకోకపోవడంతో జిల్లా సహకార బ్యాంకు వద్ద రూ.11.27 కోట్ల విలువ చేసే నోట్లు ఉండిపోయాయి.
ఈ నోట్లను ఆర్‌బీఐ తీసుకోకపోవడంతో సహకార బ్యాంకు నష్టాల్లో కూరుకు పోవాల్సిన దుస్థితి ఏర్పడింది. బ్యాంకులోని ఒక ఉన్నతాధికారి నిర్వాకం మూలంగానే లెక్కకు మించిన నోట్ల సేకరణ జరిగింది. ఇది ఇలా ఉండగా తాము నిబంధనల ప్రకారమే పాత నోట్లను స్వీకరించామని ఇందులో ఎలాంటి తప్పులు లేవని బ్యాంకు ఉన్నతాధికారులు, పాలకవర్గం స్పష్టం చేస్తూ ఈ నోట్లను తీసుకోవాల్సిందిగా నాబార్డు, ఆర్‌బీఐ అధికారులకు లేఖ రాసింది. ఈ వివాదాన్ని తేల్చడానికి ఆర్‌బీఐ నుంచి ఇద్దరు, నాబార్డు నుంచి పదిమంది ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. సోమవారం నుంచి బ్యాంకుల్లో విచారణను అధికారులు నిర్వహిస్తున్నారు. బ్యాంకుల్లో డిపాజిట్లు చేసిన వ్యక్తుల ఆధార్ కార్డు జిరాక్సు కాపీలను, వారి లావాదేవీల వ్యవహారాలను ఆర్‌బీఐ, నాబార్డు అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. జిల్లాలోని 41 సహకార బ్యాంకుల శాఖలలో విచారణ నిర్వహిస్తున్నారు. కొత్తగా ఏర్పడిన శాఖలను తనిఖీల నుంచి మినహాయించారు.