సహకార బ్యాంకులకు కేంద్రం షాక్!
గరీబ్ కల్యాణ్ యోజన డిపాజిట్ల స్వీకరణపై నిషేధం
• కో–ఆపరేటివ్ బ్యాంకుల్లో అవకతవకలపై ఐటీ నివేదిక నేపథ్యం
న్యూఢిల్లీ: కొత్త పన్ను క్షమాభిక్ష పథకం– ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (పీఎంజీకేవై), 2016 కింద సహకార బ్యాంకులు డిపాజిట్లను స్వీకరించరాదని కేంద్రం నిర్దేశించింది. ఈ మేరకు పథకం నోటిఫికేషన్‌ను సవరించింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం కొన్ని సహకార బ్యాంకుల్లో అకౌంట్ల అవకతవకలను గుర్తించినట్లు ఆర్థికశాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)లకు ఆదాయపు పన్ను శాఖ నివేదిక నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. పాత కరెన్సీల డిపాజిట్లు తీసుకోడానికి తొలుత సహకార బ్యాంకులకు అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే పెద్ద నోట్ల రద్దు ప్రకటన ఆరు రోజుల తరువాత, ఈ డిపాజిట్లను స్వీకరించడం నుంచి సహకార బ్యాంకులను కేంద్రం మినహాయించింది. అయితే అప్పటికే దాదాపు రూ.16,000 కోట్లు సహకార బ్యాంకుల్లోని పలు అకౌంట్లలో డిపాజిట్ అయినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపు పన్ను శాఖలు గుర్తించాయి.
ఏమిటీ పథకం...
రూ.500, రూ.1,000 నోట్ల రద్దు తరువాత కేంద్రం పీఎంజీకేవై పథకాన్ని తీసుకువచ్చింది. నల్లకుబేరులకు సంబంధించి తాజాగా, చివరి అవకాశంగా కేంద్రం ఈ స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకాన్ని ప్రకటించింది. దీని ప్రకారం పథకానికి దరఖాస్తు పెట్టుకునే ముందే ‘వెల్లడి మొత్తానికి’ సంబంధించిన మొత్తంలో మొదట 49.9 శాతం పన్ను చెల్లించాలి. దరఖాస్తులో ఇలా పన్ను చెల్లించినట్లు ఆధారం ఉండాలి. అలాగే ఈ దరఖాస్తుకు ముందే ‘వెల్లడి మొత్తం’లో 25 శాతాన్ని వడ్డీరహిత రీతిలో నాలుగేళ్ల కాలానికి ‘లాక్–ఇన్’ విధానంలో డిపాజిట్ చేయాలి. కట్టిన పన్నును ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఇవ్వడం జరగదు.
అవినీతి, బినామీ ఆస్తుల నిర్వహణ, అక్రమ ధనార్జన, విదేశీ మారకద్రవ్య నిల్వల ఉల్లంఘనలు, ఫారిన్ బ్లాక్ మనీ, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఈ పథకం వర్తించదు. డిసెంబర్ 17న ప్రారంభమైన ఈ పథకం డిక్లరేషన్లు, డిపాజిట్ల నిమిత్తం 2017 మార్చి 31 వరకూ అందుబాటులో ఉంటుంది. బ్యాంకుల్లో తప్ప సహకార బ్యాంకులను ఈ డిపాజిట్ల సేకరణ నుంచి నిషేధించినట్లు తాజాగా కేంద్రం పేర్కొంది.
ఇప్పటివరకూ రూ.300 కోట్ల డిక్లరేషన్లు!
ఇదిలావుండగా, ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా రూ.300 కోట్ల విలువైన డిక్లరేషన్లు వచ్చినట్లు ఆదాయపు పన్ను శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే డిక్లరేషన్ల విలువ తెలియనప్పటికీ, మహారాష్ట్రలోని 16 నగరాలకు చెందిన దాదాపు 36 మంది ఆభరణ వర్తకులు దాదాపు రూ.140 కోట్ల విలువైన డిక్లరేషన్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఐటీ అధికారుల దాడుల అనంతరం కూడా పలువురు ఈ డిక్లరేషన్లు ఇచ్చినట్లు సమాచారం. హైదరాబాద్‌కు చెందిన ఒక ప్రముఖ ఆభరణాల సంస్థ కూడా దాదాపు రూ.100 కోట్ల డిక్లరేషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. పశ్చిమ రాష్ట్రానికి చెందిన ఒక వైద్యుడు కూడా రూ.11.50 కోట్లకు సంబంధించి డిక్లరేషన్‌కు ఆదాయపు పన్ను అధికారులను సంప్రదించినట్లు తెలుస్తోంది. ముంబైకి చెందిన ఒక చిత్ర దర్శకుడు రూ.40 కోట్ల డిక్లరేషన్‌తో ముందుకు వచ్చినట్లు సమాచారం.