బ్యాంకు అధికారుల జబర్‌దస్త్..
అప్పు తీర్చలేదని ఇంటికి తాళం.. మరో ఇంట్లో సామగ్రిని తీసుకెళ్లిన వైనం
దౌల్తాబాద్/దేవరకద్ర: రుణం చెల్లించలేదని బ్యాంకు అధికారులు ఓ ఇంటికి తాళం వేయడంతోపాటు, మరోఇంట్లో సామగ్రిని బలవంతంగా తీసుకెళ్లారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ రెండు సంఘటనలు వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్నాయి. దౌల్తాబాద్ మండలంలోని గోకఫసల్‌వాద్ కు చెందిన చాకలి సాయన్న, సొండె చిన్నసాయప్ప కొడంగల్ సహకార బ్యాంకులో 2012లో రుణం తీసుకున్నారు. సాయన్న రూ.53 వేలు,, సొండె చిన్నసాయప్ప రూ.61వేల అప్పు ఉన్నాడు.
బకాయిలను చెల్లించాలని నాలుగేళ్లుగా నోటీసులు పంపుతన్నా స్పందించకపోవడంతో శనివారం బ్యాంకు అధికారులు వారి ఇంట్లో ఉన్న టీవీ, ఇతర సామగ్రిని తమ వాహనంలో తీసుకెళ్లారు. దేవరకద్ర మండల కేంద్రానికి చెందిన బైండ్ల రాములు, మల్లేశ్వరి దంపతులు 2011లో ఇంటి నిర్మాణం కోసం స్థానిక గ్రామీణ బ్యాంకులో రూ. 3 లక్షల రుణం తీసుకున్నారు. అయితే కేవలం 4 నెలల రుణం బకాయిలు చెల్లించినందున బ్యాంకు అధికారులు ఇంటిని సీజ్‌చేసి వెళ్లారు.