రైతు మెడపై కత్తి !
ఖరీఫ్ ముంచుకొస్తోంది.. పంట వేసుకునేందుకు చేతిలో చిల్లిగవ్వలేక..అప్పు పుట్టే దారి తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతన్న మెడపై బకాయిల కత్తి వేలాడుతోంది. అధికారంలోకొస్తే పంట రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు తీరా గద్దెనెక్కాక హామీల అమలుకు కాలయాపన చేస్తున్నారు. రుణమాఫీపై కమిటీని ఏర్పాటు చేసి రైతన్నకు మొండిచేయి చూపారు. మాఫీ సంగతి దేవుడెరుగు గడువు మీరిన బకాయిలు కట్టి తీరాల్సిందేనని బ్యాంక ర్లు రైతులపై ఒత్తిడి తెస్తున్నారు.
చీమకుర్తి: ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు రైతుల రుణాలు మాఫీ చేస్తానని కమిటీ వేసి ఉంటే దాని రిపోర్ట్ రాకముందే బ్యాంకు అధికారులు గడువు మీరిన బకాయిలు వెంటనే చెల్లించాలని నోటీసులు జారీ చేస్తున్నారు. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. చీమకుర్తి ఆంధ్రాబ్యాంకు పరిధిలో వ్యవసాయ ఆధారంగా అన్ని రకాల రుణాలు తీసుకున్న రైతులు 2,823 మంది ఉండగా..వారంతా రూ.29 కోట్ల బకాయిలున్నారు. ఈనెల 12న రూ.80 లక్షల విలువైన బకాయిలు చెల్లించాలని 119 మంది రైతులకు బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేశారు. పంట రుణాలకు చెందిన రైతులు 63 మంది, సీసీఏటీఎల్ రుణాలున్న రైతులు 33 మంది, వ్యవసాయ ట్రాక్టర్ రుణాలు తీసుకున్న వారు పది మంది, వ్యవసాయ బంగారం రుణాలున్న వారు 40 మంది రైతులున్నట్లు తెలిసింది.
ఆ నోటీసులు శనివారం కొంత మంది రైతులకు, సోమవారం మరికొంత మందికి చేరాయి. రుణమాఫీ చేయబోతున్న తరుణంలో నోటీసులిచ్చి రైతులను ఇబ్బందులకు గురిచేయడం ఏంటని బ్యాంకు అధికారులను ఁసాక్షి* ప్రశ్నించగా గడువు మీరిన రుణాలు చెల్లించాలని బ్యాంకు నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేశామని చెప్పారు. రుణమాఫీ కాకుండా ప్రభుత్వం కాలక్షేపం చేస్తున్న కారణంగానే బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేశారని రైతులు వాపోతున్నారు.