Waiver of loans to farmers
-
అధికారంలోకి వస్తే... రుణమాఫీ
బళ్లారి : రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుపొంది బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే రైతు రుణాలు మాఫీ చేస్తామని బళ్లారి లోకసభ సభ్యుడు బి.శ్రీరాములు పేర్కొన్నారు. బళ్లారి నగర శివారులోని అల్లీపురం మహాదేవ తాత మఠంలో శుక్రవారం నిర్వహించిన ఉచిత సామూహిక వివాహా వేడుకల్లో ఆయన ప్రసంగించారు. దేశానికి వెన్నుముక లాంటి రైతులు నిత్యం ఆత్మహత్యలు చేసుకుంటున్నా... నియంత్రించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరి వల్ల 350 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. రైతు సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వమే అయితే తక్షణమే రుణ మాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఇది సాధ్యం కాకపోతే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణాలను మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. ఎన్ని కష్టాలు వచ్చినా రైతులు మనోనిబ్బరం కోల్పోరాదని అన్నారు. తుంగభద్ర జలాశయంలో పూడిక పెరిగిపోవడం వల్ల 33 టీఎంసీలు నీరు సామర్థ్యం తగ్గి రెండు రాష్ట్రాల రైతులకు ఎంతో నష్టం ఏర్పడుతుందన్నారు. ఇప్పటికైనా పూడికతీతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గాలి జనార్దనరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు బళ్లారికి ప్రత్యేక నిధులు తీసుకురావడంతోనే నగరం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. 2018లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు. -
అర్హులైనా అంతే!
అర్హత ఉన్న ప్రతి రైతుకూ రుణాలు మాఫీ చేస్తాం.. ఆదుకుంటాం.. ఇది సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ.. కుటుంబానికి రూ. 1.50 లక్షల రుణాలు మాఫీ చేస్తాం.. ఇది సీఎం బాధ ్యతలు చేపట్టిన తర్వాత ఇచ్చిన హామీ.. పోనీ అదైనా పూర్తిస్థాయిలో మాఫీ చేశారా అంటే లేదు.. పైగా ఆధార్ నెంబర్, డాక్యుమెంట్లు సరిగా లేవంటూ అర్హత ఉన్న రైతుల రుణమాఫీ దరఖాస్తులను సైతం తిరస్కరిస్తుండడం గమనార్హం. కర్నూలు(అగ్రికల్చర్): ఆలూరుకు చెందిన రాజేంద్ర కుమార్(ఆధార్ :779962279939) స్థానిక పీఎసీఎస్‌లో 2013 జూన్‌లో నాలుగెకరాల భూమిపై రూ.1.20 లక్షలు రుణం తీసుకున్నారు. గతంలో డాక్యుమెంట్లు ఇవ్వలేదనే కారణంతో అర్హత లభించలేదు. తర్వాత తగిన డాక్యుమెంట్లతో గ్రీవెన్స్ ఇచ్చుకోవాలని సూచించగా 1.బి, అడంగల్, టైటిల్‌డీడ్, పట్టాదారు పాసుపుస్తకం, అప్పు ధృవీకరణ పత్రం నకళ్లతో గత మే నెలలో దరఖాస్తు ఇచ్చారు. అయినా తిరస్కరణే. దీంతో రైతుపై రూ.28,200 వడ్డీ భారం పడుతోంది. ఆలూరుకు చెందిన శాంతమ్మ (ఆధార్ నెంబరు 437895065733)దీ ఇదే పరిస్థితి. 2013 జూలైలో స్థానిక పీఎసీఎస్‌లో మూడెకరాలపై లక్ష రూపాయల పంట రుణం తీసుకున్నారు. అన్ని డాక్యుమెంట్లతో జూన్‌లో గ్రీవెన్స్ ఇచ్చినా అర్హత లేదు. ఈమెపై కూడా రూ.23500 వడ్డీ భారం పడింది. వేలాది మంది రైతులు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మొదటి రెండు విడతల్లో రుణమాఫీ కానీ రైతుల నుంచి తగిన డాక్యుమెంట్లతో తిరిగి దరఖాస్తులు ఇచ్చుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు మే, జూన్‌లో ప్రత్యేక కౌంటర్లు పెట్టి గ్రీవెన్స్ స్వీకరించడంతో దాదాపు 40వేల మంది వినతులు సమర్పించారు. అయితే ఈ దరఖాస్తులను కనీసం పరిశీలించిన దాఖలాలు కూడా లేవు. మళ్లీ పాతకారణాలనే చూపుతూ తిరస్కరించడం ఇందుకు నిదర్శన ం. 81,845 మందికి మాఫీ నిల్: జిల్లా వ్యాప్తంగా 5,23,615 మంది రైతులకు రుణమాఫీ అర్హత ఉందని చెబుతూ వివరాలను బ్యాంకర్లు ప్రభుత్వానికి అప్లోడ్ చేశారు. మొదటి విడతలో 2,87,565 మంది, రెండో విడతలో 1,39,455 మందికి మాఫీ లభించింది. మూడో విడతకు గ్రీవెన్స్ ఇచ్చిన వారే 40వేల మంది ఉండగా 14,750 మందికి మాత్రమే అర్హత లభించింది. మొత్తంగా 4,41,770 మందికి ఉపశమనం లభించగా, 81,845 మంది మొండి చెయి ఎదురైంది. వీరందరూ బ్యాంకర్ల దృష్టిలో డిపాల్టర్లయ్యారు. 2013లో రుణం తీసుకున్న రోజు నుంచి ఇప్పటి వరకు వడ్డీ, అపరాధ వడ్డీతో సహా చెల్లించాల్సి వస్తోంది. డీసీసీబీలో.. జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో రుణమాఫీకి అర్హత కల్గిన రైతులు 91,288 మంది ఉండగా మొదటి విడతలో 58,972 మంది, రెండో విడతలో 16,991 మంది, 3వ విడతలో 1,835 మంది ప్రకారం 77,798 మందికి ఉపశమనం లభించింది. మిగతావారికి మొండి చేయి చూపారు. -
‘మాఫీ’కి మరో కొర్రీ
* ‘రెండో ప్రపంచ యుద్ధంలో ఎంతమంది మరణించారు?’ * ‘2,37, 148 మంది.’ ‘వాళ్ల పేర్లేమిటి?’ ‘....???????’ ఆ మధ్య వచ్చిన ఒక సినిమాలోని సంభాషణ ఇది. ఎదుటివారు అవాక్కయ్యేలా చేయడమే ధ్యేయంగా పెట్టుకుంటే ఇలాంటి ప్రశ్నలే సంధిస్తారు. అదేవిధంగా రైతులను అవాక్కయ్యేలా చేసి వారు రుణమాఫీ ఊసెత్తకుండా చూద్దామని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుంది. అందుకే రుణమాఫీ అంశంలో కొత్తగా మరో అంకానికి తెరలేపింది. మెజార్టీ శాతం నిరక్షరాస్యులైన లబ్ధిదారులను రోజుకో విధంగా విసిగించేలా కొత్త కొత్త నిబంధనలు విధిస్తూ వారి సహనాన్ని పరీక్షిస్తోంది. ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, ఓటరు కార్డు, రుణాలు తీసుకున్న రైతు కుటుంబంలోని సభ్యుల వివరాలు, బ్యాంకు ఖాతాల నంబర్లు రెండ్రోజుల్లో అందజేయాలని తాజాగా ఆదేశించింది. గణపవరం: రైతు రుణాల మాఫీ హామీతో గద్దెనెక్కిన చంద్రబాబునాయుడు అమలుకొచ్చేసరికి సవాలక్ష కొర్రీలు పెడుతున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ విధిస్తున్న వివిధ నిబంధనలను పరిశీలిస్తే లబ్ధిదారుల జాబితాను కుదించే ప్రయత్నం చేస్తున్నారని ఎవరికైనా అర్థమవుతుంది. తొలుత కుటుంబానికి రూ. 1.50 లక్షలు మాత్రమే మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అనంతరం వివిధ నిబంధనలు విధించారు. రుణం తీసుకున్న రైతులందరూ తమ బ్యాంకు ఖాతా, ఆధార్‌కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ కాపీలు, రుణం తీసుకున్న బ్యాంకుశాఖలో అందజేయాలని అదేశించింది. అనేకమంది రైతులు సకాలంలో ఆధార్‌కార్డు జిరాక్స్ కాపీలు కూడా ఇవ్వలేకపోయారు. నిన్నా, మొన్నటి వరకు త్వరలోనే అర్హులైనవారి జాబితా ప్రకటిస్తామని ప్రకటనలు గుప్పించిన ప్రభుత్వం మరో కొత్త నిబంధన విధిస్తూ శుక్రవారం సర్క్యులర్ జారీచేసింది. అదనపు సమాచారం అందించాలంటూ అర్హత పొందిన వారి జాబితాను మండల రెవెన్యూ కార్యాలయానికి పంపింది. రుణం పొందిన వ్యక్తి ఆధార్‌కార్డు నెంబరు, రేషన్ కార్డు నెంబరు, ఓటు గుర్తింపు కార్డు నెంబరు వీటితో పాటు భార్య ఓటు గుర్తింపుకార్డు నెంబరు, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డుల నెంబర్లు (ఒకవేళ భార్య రుణం తీసుకుంటే భర్త తాలూకా వివరాలు) వారి కుటుంబీకుల్లో మేజరు కుమారుడు లేదా కుమార్తె ఓటు గుర్తింపు, ఆధార్‌కార్డు, రేషన్ కార్డు నెంబరు ఇవ్వాలంటూ ఆ సర్క్యులర్‌లో పేర్కొంది. దీనితోపాటు ఆయా గ్రామాల్లో ఎంతమందైతే దీనికి అర్హత పొందారో వారి జాబితాను పేరు, బ్యాంకు ఖాతా నెంబరుతో సహా వివరాలతో లిస్టులను ప్రభుత్వం రెవెన్యూ కార్యదర్శులకు అందజేసింది. దీనితో ఆ లిస్టులు పట్టుకుని రెవెన్యూ కార్యదర్శులు గ్రామాల్లో పడ్డారు. ఈ లిస్టులో వివరాలు 10వ తేదీ లోపుగా అందజేయాలంటూ ఆదేశాలు కూడా జారీచేశారు. రుణం తీసుకున్నప్పుడు బ్యాంకులో ఇచ్చిన అడ్రస్‌ల ఆధారంగా లిస్టులు అందాయి. దీంతో రెవెన్యూ కార్యదర్శులు అడ్రస్‌లు సేకరించేందుకు నానా అవస్థలు పడుతున్నారు. 8,901మంది రైతుల వివరాలు సేకరించండి గణపవరం మండలంలో రుణమాఫీకి 8,901 మంది రైతులు అర్హత పొందారని వారి నుంచి అదనపు వివరాలు సేకరించి నమోదు చేయాలని గ్రామాల వారీగా జాబితాలను రెవెన్యూ కార్యదర్శులకు అందజేశారు. తలలు పట్టుకుంటున్న అధికారులు జాబితాలో పలు త ప్పులు దొర్లడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఆ జాబితా ఏ ప్రాతిపదికన రూపొందించారో తెలియడం లేదని అధికారులంటున్నారు. ఆధార్‌కార్డులో అడ్రస్ ప్రకారం మండలాల కేటాయింపు జరిగిందా? మరే ఇతర విధానంలోనా ? అర్థం కావడం లేదని చెబుతున్నారు. అయిదుశాతం మంది అడ్రస్‌లు తెలియడంలేదని, ఆ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళాతామని చెప్పారు. రెండు రోజుల్లో పూర్తి సమాచారం అందేనా? కొన్ని గ్రామాల్లో రుణం తీసుకున్న వారు ఎక్కువగా ఉన్నారు. ఉదాహరణకు గణపవరంలో 2,591 మంది, పిప్పరలో 1,611 మంది, మొయ్యేరులో 764 మంది ఉన్నారు. ఇంతమంది సమాచారం కేవలం రెండు రోజుల్లో సేకరించడం సాధ్యం కాద ని రెవెన్యూ సిబ్బందే అంటున్నారు. గణపవరంలో శ్రీ కన్యకాపరమేశ్వరి వర్తక సంఘ భవనంలో నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేసి ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ఇదే తరహాలో ఎక్కువ మంది అర్హులున్న గ్రామాల్లో అదనపు సిబ్బందితో వివిధ కౌంటర్లు ఏర్పాటు చేసి ఈ ప్రక్రియపై కసరత్తులు చేస్తున్నారు. మరొకపక్క జిల్లా అధికారులు తక్షణం సమాచారం అందజేయాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో సిబ్బంది ఉరుకులు, పరుగులు తీస్తున్నారు. కుటుంబీకుల ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు లేకపోతే అర్హత కోల్పోయినట్టేనా ? కుటుంబ సభ్యులకు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు లేకపోతే రుణమాఫీ అర్హత కోల్పోయినట్టేనా? అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వివిధ నిబందనలతో రుణమాఫీ జాబితాలో కోతకు పన్నాగాలు పన్నుతోందని రైతుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో బ్యాంకు ఖాతా నెంబరు, ఇతర పత్రాలు ఇవ్వడానికి బ్యాంకులు చుట్టూ తిరిగి నానా అవస్థలు పడ్డామని, మళ్లీ ఇప్పుడు కుటుంబ సభ్యుల వివిధ పత్రాల వివరాలు తక్షణం ఇవ్వమంటే ఎలా సాధ్యమంటూ రైతులు వాపోతున్నారు. -
రైతుల రుణాలు మాఫీ
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రైతు రుణమాఫీ విధి విధానాలపై బ్యాంకర్లతో చర్చించిన జిల్లా యంత్రాంగం షెడ్యూల్‌ను ఖరారు చేసింది. రుణమాఫీ సొమ్మును ఆన్లైన్ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాలో వేయాలని నిర్ణయించింది. జిల్లా కలెక్టర్లతో బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రుణమాఫీ వర్తింపు, లబ్ధిదారుల జాబితా ప్రకటనపై మార్గదర్శకాలను విడుదల చేశారు. సామూహికంగా (జేఎల్‌జీ) తీసుకున్న రుణాల విషయంలో ఎలా వ్యవహరించాలనే అంశంపై స్పష్టత ఇవ్వాలని కలెక్టర్ శ్రీధర్ కోరగా, రుణమొత్తాన్ని వ్యక్తుల వారీగా విభజించి రూ.లక్షలోపు అప్పును మాఫీ చేయాలని సూచించారు. నిర్ణీత వ్యవధిలో రుణమాఫీ ప్రక్రియను పూర్తిచేయడం వల్ల కొత్తగా పంట రుణాలు తీసుకోవడానికి, పంటల బీమా వర్తింపజేసుకోవడానికి మార్గం సుగమమవుతుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. సమావేశంలో జేసీ-2 ఎంవీ రెడ్డి, డీఆర్ఓ సుర్యారావు, వ్యవసాయశాఖ జేడీ విజయ్‌కుమార్, ఎల్డీఎం సుబ్రమణ్యం, జెడ్పీ సీఈఓ చక్రధర్‌రావు పాల్గొన్నారు. ఈ ఏడాది మార్చి 31 వరకు తీసుకున్న పంట రుణాలు, బంగారంపై తీసుకున్న అప్పులకు రుణమాఫీ వర్తిస్తుంది. గరిష్టంగా రూ.లక్షవరకే మాఫీ అవుతుంది. రైతులు పలు బ్యాంకుల్లో రుణాలు పొందినా.. రుణమాఫీ మాత్రం లక్ష రూపాయలకే వర్తిస్తుంది. సాధ్యమైనంతవరకు రైతుల ఖాతాలను ఆధార్‌కార్డుతో అనుసంధానం చేయాలి. అయితే ఇది తప్పనిసరి కాదు. మార్చి 31 తర్వాత రైతులు రుణాలు చెల్లించినా మాఫీ వర్తిస్తుంది. రైతుల జాబితాను రూపొందించి ఈ నెల 23లోగా బ్యాంకర్లు తహసీల్దార్లకు అందజేయాలి. 25, 26వ తేదీల్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల పర్యవేక్షణలో జరిగే మండలస్థాయిలో బ్యాంకర్ల సమావేశం జాబితాకు తుది రూపు ఇస్తారు. ఈ జాబితాను 27, 28వ తేదీల్లో గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించి అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరిస్తారు. 29న ఫిర్యాదులను తహసీల్దార్, ఎంపీడీఓ, బ్యాంకు ప్రతినిధులు పరిశీలిస్తారు. 30న జిల్లాస్థాయిలో జరిగే బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ (డీసీసీ) సమావేశంలో రుణమాఫీకి అర్హులైన జాబితాపై చర్చించి.. ఎస్ఎల్బీసీకి నివేదిస్తారు. -
వడ్డీతో కలిపి రూ. లక్షలోపు రుణాలకు వర్తింపు
-
రుణమాఫీ రూ.లక్ష
* మార్గదర్శకాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం * వడ్డీతో కలిపి రూ. లక్షలోపు రుణాలకు వర్తింపు * కొత్త రుణాలివ్వండి.. బ్యాంకర్లకు ఆదేశం సాక్షి, హైదరాబాద్: రైతుల రుణాల మాఫీ కి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. 2014 మార్చి 31వ తేదీ నాటికి రైతులు తీసుకున్న రుణాల అసలు, వడ్డీ కలిపి కుటుంబానికి లక్ష రూపాయలలోపు ఉన్న పంట రుణాలకు మాత్రమే ఈ మాఫీ వర్తిస్తుందని పేర్కొంది. పంట దిగుబడిని తాకట్టు పెట్టి ముందస్తుగా తీసుకున్న రుణాలు, ఒప్పంద రుణాలు, క్లోజ్డ్ క్రాప్లోన్లకు ఈ రుణమాఫీ వర్తించదని పేర్కొంది. రైతుల రుణాలను ప్రభుత్వమే చెల్లిస్తుందని, వారికి వెంటనే కొత్త రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బుధవారం రాత్రి వ్యవ సాయ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య ఉత్తర్వులు జారీ చేశారు. ఇవీ మార్గదర్శకాలు... * గ్రామాల వారీగా బ్యాంకు రుణాలు, రైతుల వివరాల జాబితా రూపొందిం చాలి. 2014 మార్చి 31 నాటికి ఉన్న మొత్తం బకాయిలు ఎంతో లెక్కించాలి. * పంట, బంగారం రుణాలు ఎంత అనేది నమూనా పత్రంలో పేర్కొనాలి. గరిష్టంగా లక్ష రూపాయల దాకా రుణం ఉన్న రైతుల జాబితాను బ్యాంకు మేనేజర్ రూపొందించాలి. * ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల నుంచి పంట, బంగారం తాకట్టు రుణాలు తీసుకున్నవారిని తొలగించడానికి వీలుగా... కుటుంబానికి లక్ష రూపాయల గరిష్ట రుణం ఉన్నవారి జాబితాను మండల స్థాయి బ్యాంకర్ల సమావేశంలో పెట్టి అర్హుల జాబితాను రూపొందించాలి. * ఆ జాబితా ఆధారంగా తహసీల్దార్లు పట్టాదారు పాసు పుస్తకాలను పరిశీలించి.. బోగస్‌లను గుర్తించాలి. రుణం తీసుకున్న రైతులకు భూమి ఉందా? లేదా ? అనేది పరిశీలించి.. తప్పుడు క్లెయిములు ఉంటే తొలగించాలి. * ఒక కుటుంబం ఎన్ని బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుందనే విషయాన్ని జేఎల్ఎంబీసీ గుర్తించాలి. ఈ జేఎల్ఎంబీసీ సమావేశాలను డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులు పర్యవేక్షించాలి. వీటిని జిల్లా సహకార సంస్థ ఆడిటర్లు తనిఖీ చేయాలి. * ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో రుణా లు తీసుకున్న వారి రుణ మొత్తం లక్ష రూపాయల లోపు ఉంటే వారి పేరు తొలగించవద్దు. లక్ష కంటే ఎక్కువ దాటిన పక్షంలో ఏదో ఒక బ్యాంకు రుణాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. * గ్రామాల వారీగా రుణ మాఫీ లబ్ధిదారు ల పేర్లను ప్రచురించాలి. ఆ జాబితాపై సామాజిక తనిఖీ నిర్వహించాలి. సామాజిక తనిఖీ సభ్యుల్లో ఎంపీడీవో, తహసీల్దార్, బ్యాంకు బ్రాంచి మేనేజర్, ఏఆర్ (ఎస్‌డీఎల్‌సీవో) సభ్యులుగా ఉంటారు. ఈ తనిఖీలో వచ్చిన అభ్యంతరాల అనంతరం అర్హుల జాబితాను రూపొందించాలి. * రుణమాఫీ అర్హుల జాబితా, మాఫీ అయ్యే రుణ మొత్తం ఎంతనేది జాబితాగా రూపొందించి బ్యాంకు నోటీసు బోర్డులో ప్రదర్శించాలి. ఆ జాబితాను జిల్లా కలెక్టరుకు, లీడ్ బ్యాంకు జిల్లా మేనేజరుకు పంపించాలి. ఈ జాబితాల ఆధారంగా జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించాలి. బ్యాంకుల వారీగా రుణమాఫీ, రైతుల వివరాలను నమోదు చేసి ఎస్ఎల్బీసీకి పంపించాలి. * జిల్లాల నుంచి వచ్చిన అర్హుల జాబితా, రుణమాఫీ మొత్తాన్ని లెక్కించి ఆ మేరకు ప్రభుత్వం నుంచి రీయింబర్స్మెంట్ పొందే విధంగా నివేదికను సమర్పించాలి. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం రుణమాఫీ మొత్తాన్ని బ్యాంకులకు సర్దుబాటు చేస్తుంది. ప్రభుత్వం చెల్లించిన డబ్బును రైతుల ఖాతాలకు జమచేసినట్లు బ్యాంకులు సర్టిఫై చేయాలి. * రైతుల ఖాతాల్లో నిధులను సర్దుబాటు చేసే ముందు రైతుల నుంచి హామీ పత్రం తీసుకోవాలి.మోసంతో రుణమాఫీ పొందలేదని, మోసం చేసినట్లు తేలితే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తానని రైతుల నుంచి హామీపత్రం తీసుకోవాలి. * మండల స్థాయి బ్యాంకర్ల కమిటీలు నెల రోజుల్లోగా సమావేశమై బ్యాంకుల వారీగా, గ్రామాల వారీగా రైతుల జాబి తాను, రుణాల మొత్తాన్ని తేల్చాలి. అనంతరం ఆడిటర్లు బ్యాంకర్లు ఇచ్చిన దాన్ని ఆడిట్ చేసి చీఫ్ ఆడిటర్‌కు సమర్పించాలి. * రుణమాఫీ పొందే రైతుల జాబితా కరక్టేనన్న బాధ్యతను బ్యాంకులు స్వీకరించాలి. * ఈ రుణమాఫీ ఫిర్యాదులకు సంబంధించి వచ్చే ప్రతీ దరఖాస్తును నెల రోజుల్లోగా పరిష్కరించేందుకు మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో పర్యవేక్షక, ఫిర్యాదు కమిటీలు ఏర్పాటు చే యాలి. * రుణమాఫీకి ఎవరు అర్హులన్న మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసినందున ఆ రుణ భారం మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. కాబట్టి తక్షణమే బ్యాంకర్లు కొత్త పంట రుణాలు రైతులకు ఇవ్వాలి. రైతులు ఎప్పుడు రుణాలు రెన్యువల్ చేసుకున్నా... దానితో సంబంధం లేకుండా 2014 మార్చి 31 నాటికి ఉన్న రూ. లక్ష లోపు రుణాలను బ్యాంకులకు రీయింబర్స్ చేయనున్నట్లు వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య స్పష్టం చేశారు. * బ్యాంకులు సమర్పించే నివేదికలకు సంబంధించి ఆరు ఫార్మాట్లను రూపొందించారు. ఎ) పంట రుణాల వివరాలు బి) బంగారం తాకట్టు రుణాల వివరాలు సి) పంట, బంగారం తాకట్టు రుణాలు డి) ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో రుణాలున్న రైతుల జాబితా ఇ) తుది నివేదిక ఎఫ్) రుణమాఫీ చేసినట్లుగా రైతులకు బ్యాంకులు ఇచ్చే సర్టిఫికెట్. -
మాఫీ ఎలాగో తేల్చని బాబు
* రుణాల మాఫీపై నెలాఖరు వరకు ఆగాలని బ్యాంకర్లకు సూచన * కోటయ్య కమిటీ, బ్యాంకర్లు, అధికారులతో సమావేశం * ఆర్బీఐ లేఖపైనా చర్చ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రుణాల మాఫీ ఎలా చేస్తారో ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చలేదు. రుణాల మాఫీకి విధివిధానాలపై వారం రోజులుగా కసరత్తు చేస్తున్న కోటయ్య కమిటీతో పాటు ముగ్గురు మంత్రులు, బ్యాంకర్ల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం సమావేశమయ్యారు. అయినప్పటికీ రుణ మాఫీ ఎలాగో బాబు తేల్చలేదు. పైగా మాఫీపై స్పష్టత కోసం ఈ నెలాఖరు వరకు వేచి చూడాలని బ్యాంకర్లకు చెప్పారు. చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ సమావేశంలో కోటయ్య కమిటీలోని తొమ్మిది మంది సభ్యులు, ఆర్థిక, వ్యవసాయ, సహకార శాఖల మంత్రులు, బ్యాంకర్లు పాల్గొన్నారు. రైతుల రుణాల మాఫీపై ఆర్బీఐ రాసిన లేఖలోని అంశాలు, బంగారం రుణాలపై వేలం పాటలకు బ్యాంకులు ఇస్తున్న నోటీసులు తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఏ పరిస్థితుల్లో రుణాల మాఫీకి హామీ ఇచ్చామో వివరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, ఆర్బీఐ గవర్నర్‌కు వేర్వేరుగా లేఖలు రాయాలని నిర్ణయించారు. రైతులను ఆదుకోవడానికే రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించినట్లు వివరించాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. వీటిపై ఈ నెల 25, 26 తేదీల్లో ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రితో, ఆర్బీఐ గవర్నర్‌తో చర్చించనున్నట్లు చంద్రబాబు చెప్పారు. బ్యాంకుల ప్రతినిధులు మాత్రం సమావేశంలో ఆందోళన వ్యక్తంచేశారు. ఈ నెలాఖరు వరకు రుణ మాఫీ ఎలాగో తేల్చకపోతే రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటనను వస్తుందని, అంతేకాకుండా రుణాలు మొత్తం నిరర్ధక ఆస్తులుగా మారతాయని వారు చెప్పారు. ఖరీఫ్‌లో రైతులకు మళ్లీ రుణాలు ఇవ్వాలంటే తొలుత రుణాలను చెల్లించాలని, ఆ తరువాత మాఫీ వర్తింపజేస్తామని ప్రభుత్వం తరఫున రైతులకు సందేశమివ్వాలని కూడా బ్యాంకుల ప్రతినిధులు సూచిం చారు. దీనిపై చూద్దాం అంటూ చంద్రబాబు సమాధానాన్ని దాటవేశారు. వీలైనంత ఎక్కువ మంది రైతులకు రుణ మాఫీ ని వర్తింపజేయాలని అనుకుంటున్నామని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని, కేంద్రాన్ని, ఆర్బీఐని ఒప్పించేందుకు ప్రయత్నిస్తామని బాబు చెప్పినట్లు తెలిసింది. -
రైతు మెడపై కత్తి !
ఖరీఫ్ ముంచుకొస్తోంది.. పంట వేసుకునేందుకు చేతిలో చిల్లిగవ్వలేక..అప్పు పుట్టే దారి తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతన్న మెడపై బకాయిల కత్తి వేలాడుతోంది. అధికారంలోకొస్తే పంట రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు తీరా గద్దెనెక్కాక హామీల అమలుకు కాలయాపన చేస్తున్నారు. రుణమాఫీపై కమిటీని ఏర్పాటు చేసి రైతన్నకు మొండిచేయి చూపారు. మాఫీ సంగతి దేవుడెరుగు గడువు మీరిన బకాయిలు కట్టి తీరాల్సిందేనని బ్యాంక ర్లు రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. చీమకుర్తి: ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు రైతుల రుణాలు మాఫీ చేస్తానని కమిటీ వేసి ఉంటే దాని రిపోర్ట్ రాకముందే బ్యాంకు అధికారులు గడువు మీరిన బకాయిలు వెంటనే చెల్లించాలని నోటీసులు జారీ చేస్తున్నారు. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. చీమకుర్తి ఆంధ్రాబ్యాంకు పరిధిలో వ్యవసాయ ఆధారంగా అన్ని రకాల రుణాలు తీసుకున్న రైతులు 2,823 మంది ఉండగా..వారంతా రూ.29 కోట్ల బకాయిలున్నారు. ఈనెల 12న రూ.80 లక్షల విలువైన బకాయిలు చెల్లించాలని 119 మంది రైతులకు బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేశారు. పంట రుణాలకు చెందిన రైతులు 63 మంది, సీసీఏటీఎల్ రుణాలున్న రైతులు 33 మంది, వ్యవసాయ ట్రాక్టర్ రుణాలు తీసుకున్న వారు పది మంది, వ్యవసాయ బంగారం రుణాలున్న వారు 40 మంది రైతులున్నట్లు తెలిసింది. ఆ నోటీసులు శనివారం కొంత మంది రైతులకు, సోమవారం మరికొంత మందికి చేరాయి. రుణమాఫీ చేయబోతున్న తరుణంలో నోటీసులిచ్చి రైతులను ఇబ్బందులకు గురిచేయడం ఏంటని బ్యాంకు అధికారులను ఁసాక్షి* ప్రశ్నించగా గడువు మీరిన రుణాలు చెల్లించాలని బ్యాంకు నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేశామని చెప్పారు. రుణమాఫీ కాకుండా ప్రభుత్వం కాలక్షేపం చేస్తున్న కారణంగానే బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేశారని రైతులు వాపోతున్నారు. -
రైతుల రుణాలన్నీ మాఫీ చేయాలి
పినపాక, న్యూస్‌లైన్: ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రైతుల రుణాలన్ని మాఫీ చేయాలని పినపాక ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఏడూళ్లబయ్యారం క్రాస్‌రోడ్డులోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో రైతుల రుణాలన్ని మాఫీ చేస్తామని చెప్పి, ప్రభుత్వం ఏర్పాటు అనంతరం టీఆర్ఎస్ పార్టీ మాట మార్చడం పద్ధతి కాదన్నారు. రైతుల కష్టాలను గుర్తించి ప్రభుత్వం వెంటనే రైతుల రుణాలను మాఫీ చేయాలన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో రైతుల రుణమాఫీ కోసం ప్రజావాణి వినిపించనున్నట్లు తెలిపా రు. రైతుల పక్షాన న్యాయం జరిగే వరకు అసెంబ్లీలో పోరాడనున్నట్లు తెలిపారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులకు సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు సకాలంలో అంది చాలన్నారు. సాగునీటి సమస్యల పరిష్కారానికి, పులుసుబొంత ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రభుత్వంపై పోరాడుతామన్నారు. గోదావరి నది, పెదవాగుపై ఎత్తిపోతల పథకాలు నిర్మించేందుకు కృషి చేస్తానన్నారు. అమరారం-కొత్తూరు గ్రామాల లిఫ్ట్ నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేపిం చినట్లు తెలిపారు. విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాలపై పూర్థిస్థాయిలో దృష్టిసారించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ముంపు ప్రాంతాలను తెలంగాణ లోనే ఉంచాలి.. పోలవరం ముంపు ప్రాంతాలను తెలంగాణ లోనే ఉంచాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. ప్రాజెక్టు నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ముంపు గ్రామాలను తెలంగాణ లో ఉంచాలని పార్లమెంట్, అసెంబ్లీలో ప్రజావాణి వినిపిస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం అంశాల వారీగా మద్దతు ఇస్తామన్నారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు ఉడుముల ల క్ష్మీరెడ్డి, వట్టం రాంబాబు, మండల కన్వీనర్ గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సర్పంచ్‌లు వాగుబోయిన చందర్రావు, ఇర్పా సారమ్మ, నాయకులు గంగిరెడ్డి వెంకటరెడ్డి, తోలెం అర్జున్, గట్ల శ్రీనివాసరెడ్డి, మద్దెల సమ్మయ్య, కీసర సుధాకర్‌రెడ్డి, పంతగాని వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
అధికారంలోకి రాగానే రైతుల రుణాలు మాఫీ
మర్పల్లి, న్యూస్‌లైన్: తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, అధికారంలోకి రాగానే రైతుల రుణాలను మాఫీ చేస్తామని వికారాబాద్ అసెంబ్లీ టీఆర్ఎస్ అభ్యర్థి బి.సంజీవరావు పేర్కొన్నారు. మోమిన్‌పేట్ మండల పరిధిలోని ఎన్కతల, దేవరాంపల్లి, చీమలదరి, రాంనాథ్గుడుపల్లి, వనంపల్లి, అమ్రాదికుర్ధు, కోల్‌కుందా, రావులపల్లి, మోమిన్‌పేట్ గ్రా మాల్లో సోమవారం ఎన్నికల ప్రచా రం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఆయన మాట్లాడుతూ రైతులు బ్యాంకుల్లో తీసుకున్న రూ.లక్షలోపు పంట రుణాలతోపాటు, పొదుపు సంఘాల్లో మహిళలు తీసుకున్న రుణాలు సైతం మాఫీ చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజల ఆకాంక్ష నేరవేరాలంటే సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులను గెలిపించుకొనేందుకు కారు గుర్తుకే ఓట్లు వేయాలన్నారు. చెవెళ్ల లోక్‌సభ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్‌రెడ్డికి, వికారాబాద్ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీచేస్తున్న తనను గెలిపించేందుకు కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ప్రజల ఆకాంక్ష మేరకు బంగారు తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకొనేందుకు వీలుంటుందన్నారు. ఆదర్శంగా ఉండే విధంగా వికారాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మల్లారెడ్డి, మండల ఇన్చార్జి మహంత్‌స్వామి, నాయకులు నరేందర్‌రెడ్డి, విఠల్, నరోత్తంరెడ్డి, బుజంగ్రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, ఆనందం, శంకరప్ప, మోహన్‌రెడ్డి, అంజిరెడ్డి, గోపాల్‌రెడ్డి, మమిపాల్రెడ్డి తదితరులు ఉన్నారు. మర్పల్లిలో... ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవా రం మర్పల్లిలో టీఆర్ఎస్ నాయకులు సుడిగాలి పర్యటన నిర్వహించారు. బూచన్‌పల్లి, కొత్లాపూర్, కల్‌ఖోడ, పట్లూర్, పంచలింగాల, తుమ్మలపల్లి. గుండ్లమర్పల్లి గ్రామాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించి టీఆర్ఎస్ చేవెళ్ల లోక్‌సభ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్‌రెడ్డికి, వికారాబాద్ అసెంబ్లీ అభ్యర్థి సంజీవరావులను గెలిపించేందుకు కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు మల్లయ్య, మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, నాయకులు కొండల్‌రెడ్డి, నాయబ్‌గౌడ్, బాల్‌రెడ్డి, రవివర్మ, అబ్రహం, మల్లారెడ్డి, రాంరెడ్డి, మల్లేశం, సురేష్ తదితరులున్నారు. ఈ సందర్భంగా గుండ్ల మర్పల్లి గ్రామంలోని పలువురు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన యువకులు టీఆర్ఎస్లో చేరినట్లు కొండల్‌రెడ్డి తెలిపారు.