‘మాఫీ’కి మరో కొర్రీ
* ‘రెండో ప్రపంచ యుద్ధంలో ఎంతమంది మరణించారు?’
* ‘2,37, 148 మంది.’ ‘వాళ్ల పేర్లేమిటి?’ ‘....???????’
ఆ మధ్య వచ్చిన ఒక సినిమాలోని సంభాషణ ఇది. ఎదుటివారు అవాక్కయ్యేలా చేయడమే ధ్యేయంగా పెట్టుకుంటే ఇలాంటి ప్రశ్నలే సంధిస్తారు. అదేవిధంగా రైతులను అవాక్కయ్యేలా చేసి వారు రుణమాఫీ ఊసెత్తకుండా చూద్దామని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుంది. అందుకే రుణమాఫీ అంశంలో కొత్తగా మరో అంకానికి తెరలేపింది. మెజార్టీ శాతం నిరక్షరాస్యులైన లబ్ధిదారులను రోజుకో విధంగా విసిగించేలా కొత్త కొత్త నిబంధనలు విధిస్తూ వారి సహనాన్ని పరీక్షిస్తోంది. ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, ఓటరు కార్డు, రుణాలు తీసుకున్న రైతు కుటుంబంలోని సభ్యుల వివరాలు, బ్యాంకు ఖాతాల నంబర్లు రెండ్రోజుల్లో అందజేయాలని తాజాగా ఆదేశించింది.
గణపవరం: రైతు రుణాల మాఫీ హామీతో గద్దెనెక్కిన చంద్రబాబునాయుడు అమలుకొచ్చేసరికి సవాలక్ష కొర్రీలు పెడుతున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ విధిస్తున్న వివిధ నిబంధనలను పరిశీలిస్తే లబ్ధిదారుల జాబితాను కుదించే ప్రయత్నం చేస్తున్నారని ఎవరికైనా అర్థమవుతుంది. తొలుత కుటుంబానికి రూ. 1.50 లక్షలు మాత్రమే మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అనంతరం వివిధ నిబంధనలు విధించారు. రుణం తీసుకున్న రైతులందరూ తమ బ్యాంకు ఖాతా, ఆధార్‌కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ కాపీలు, రుణం తీసుకున్న బ్యాంకుశాఖలో అందజేయాలని అదేశించింది.
అనేకమంది రైతులు సకాలంలో ఆధార్‌కార్డు జిరాక్స్ కాపీలు కూడా ఇవ్వలేకపోయారు. నిన్నా, మొన్నటి వరకు త్వరలోనే అర్హులైనవారి జాబితా ప్రకటిస్తామని ప్రకటనలు గుప్పించిన ప్రభుత్వం మరో కొత్త నిబంధన విధిస్తూ శుక్రవారం సర్క్యులర్ జారీచేసింది. అదనపు సమాచారం అందించాలంటూ అర్హత పొందిన వారి జాబితాను మండల రెవెన్యూ కార్యాలయానికి పంపింది. రుణం పొందిన వ్యక్తి ఆధార్‌కార్డు నెంబరు, రేషన్ కార్డు నెంబరు, ఓటు గుర్తింపు కార్డు నెంబరు వీటితో పాటు భార్య ఓటు గుర్తింపుకార్డు నెంబరు, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డుల నెంబర్లు (ఒకవేళ భార్య రుణం తీసుకుంటే భర్త తాలూకా వివరాలు) వారి కుటుంబీకుల్లో మేజరు కుమారుడు లేదా కుమార్తె ఓటు గుర్తింపు, ఆధార్‌కార్డు, రేషన్ కార్డు నెంబరు ఇవ్వాలంటూ ఆ సర్క్యులర్‌లో పేర్కొంది.
దీనితోపాటు ఆయా గ్రామాల్లో ఎంతమందైతే దీనికి అర్హత పొందారో వారి జాబితాను పేరు, బ్యాంకు ఖాతా నెంబరుతో సహా వివరాలతో లిస్టులను ప్రభుత్వం రెవెన్యూ కార్యదర్శులకు అందజేసింది. దీనితో ఆ లిస్టులు పట్టుకుని రెవెన్యూ కార్యదర్శులు గ్రామాల్లో పడ్డారు. ఈ లిస్టులో వివరాలు 10వ తేదీ లోపుగా అందజేయాలంటూ ఆదేశాలు కూడా జారీచేశారు. రుణం తీసుకున్నప్పుడు బ్యాంకులో ఇచ్చిన అడ్రస్‌ల ఆధారంగా లిస్టులు అందాయి. దీంతో రెవెన్యూ కార్యదర్శులు అడ్రస్‌లు సేకరించేందుకు నానా అవస్థలు పడుతున్నారు.
8,901మంది రైతుల వివరాలు సేకరించండి
గణపవరం మండలంలో రుణమాఫీకి 8,901 మంది రైతులు అర్హత పొందారని వారి నుంచి అదనపు వివరాలు సేకరించి నమోదు చేయాలని గ్రామాల వారీగా జాబితాలను రెవెన్యూ కార్యదర్శులకు అందజేశారు.
తలలు పట్టుకుంటున్న అధికారులు
జాబితాలో పలు త ప్పులు దొర్లడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఆ జాబితా ఏ ప్రాతిపదికన రూపొందించారో తెలియడం లేదని అధికారులంటున్నారు. ఆధార్‌కార్డులో అడ్రస్ ప్రకారం మండలాల కేటాయింపు జరిగిందా? మరే ఇతర విధానంలోనా ? అర్థం కావడం లేదని చెబుతున్నారు. అయిదుశాతం మంది అడ్రస్‌లు తెలియడంలేదని, ఆ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళాతామని చెప్పారు.
రెండు రోజుల్లో పూర్తి సమాచారం అందేనా?
కొన్ని గ్రామాల్లో రుణం తీసుకున్న వారు ఎక్కువగా ఉన్నారు. ఉదాహరణకు గణపవరంలో 2,591 మంది, పిప్పరలో 1,611 మంది, మొయ్యేరులో 764 మంది ఉన్నారు. ఇంతమంది సమాచారం కేవలం రెండు రోజుల్లో సేకరించడం సాధ్యం కాద ని రెవెన్యూ సిబ్బందే అంటున్నారు. గణపవరంలో శ్రీ కన్యకాపరమేశ్వరి వర్తక సంఘ భవనంలో నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేసి ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ఇదే తరహాలో ఎక్కువ మంది అర్హులున్న గ్రామాల్లో అదనపు సిబ్బందితో వివిధ కౌంటర్లు ఏర్పాటు చేసి ఈ ప్రక్రియపై కసరత్తులు చేస్తున్నారు. మరొకపక్క జిల్లా అధికారులు తక్షణం సమాచారం అందజేయాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో సిబ్బంది ఉరుకులు, పరుగులు తీస్తున్నారు.
కుటుంబీకుల ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు లేకపోతే అర్హత కోల్పోయినట్టేనా ?
కుటుంబ సభ్యులకు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు లేకపోతే రుణమాఫీ అర్హత కోల్పోయినట్టేనా? అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వివిధ నిబందనలతో రుణమాఫీ జాబితాలో కోతకు పన్నాగాలు పన్నుతోందని రైతుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో బ్యాంకు ఖాతా నెంబరు, ఇతర పత్రాలు ఇవ్వడానికి బ్యాంకులు చుట్టూ తిరిగి నానా అవస్థలు పడ్డామని, మళ్లీ ఇప్పుడు కుటుంబ సభ్యుల వివిధ పత్రాల వివరాలు తక్షణం ఇవ్వమంటే ఎలా సాధ్యమంటూ రైతులు వాపోతున్నారు.