
అధికారంలోకి వస్తే... రుణమాఫీ
బళ్లారి : రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుపొంది బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే రైతు రుణాలు మాఫీ చేస్తామని బళ్లారి లోకసభ సభ్యుడు బి.శ్రీరాములు పేర్కొన్నారు. బళ్లారి నగర శివారులోని అల్లీపురం మహాదేవ తాత మఠంలో శుక్రవారం నిర్వహించిన ఉచిత సామూహిక వివాహా వేడుకల్లో ఆయన ప్రసంగించారు. దేశానికి వెన్నుముక లాంటి రైతులు నిత్యం ఆత్మహత్యలు చేసుకుంటున్నా... నియంత్రించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరి వల్ల 350 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు.
రైతు సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వమే అయితే తక్షణమే రుణ మాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఇది సాధ్యం కాకపోతే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణాలను మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. ఎన్ని కష్టాలు వచ్చినా రైతులు మనోనిబ్బరం కోల్పోరాదని అన్నారు. తుంగభద్ర జలాశయంలో పూడిక పెరిగిపోవడం వల్ల 33 టీఎంసీలు నీరు సామర్థ్యం తగ్గి రెండు రాష్ట్రాల రైతులకు ఎంతో నష్టం ఏర్పడుతుందన్నారు. ఇప్పటికైనా పూడికతీతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గాలి జనార్దనరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు బళ్లారికి ప్రత్యేక నిధులు తీసుకురావడంతోనే నగరం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. 2018లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు.