పార్టీ విస్తరణే లక్ష్యం!
- తమిళనాడు నుంచి బెంగాల్ వరకు బీజేపీ బలోపేతానికి కృషి చేస్తా
- ఏపీ, తెలంగాణలోనూ అధికారం దిశగా వ్యూహం
- బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్
సాక్షి, న్యూఢిల్లీ: తాజా అసెంబ్లీ ఎన్నికల్లో అస్సాంను గెలుచుకుని, ఓటుశాతం పరం గా కేరళ, పశ్చిమబెంగాల్లో పుంజుకున్న ఉత్సాహంలో ఉన్న బీజేపీ.. తమిళనాడు నుంచి బెంగాల్ వరకు విస్తరించిన కోరమాండల్ బెల్ట్‌లో పాగా వేయడాన్ని తదుపరి లక్ష్యంగా పెట్టుకుంది. తాజాగా అ స్సాంలో సొంతంగా, అంతకుముందు జమ్మూకశ్మీర్‌లో పీడీపీతో కలసి బీజేపీ అధికారంలోకి రావడంలో కీలక భూమిక వహించిన వ్యూహకర్త, బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ.. తన శక్తిసామర్థ్యాలను ఇకపై ఆ ప్రాంతంలోని రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతానికి వినియోగిస్తానన్నారు. అస్సాం సీఎం అభ్యర్థి శర్బానంద్ సోనోవాల్‌తో భేటీ అనంతరం రాం మాధవ్ మీడియాతో తన ఆలోచనలను పంచుకున్నారు.ఆ వివరాలు..
విస్తరణ దిశగా..
తమిళనాడు నుంచి బెంగాల్ వరకు గల కోరమాండల్ బెల్ట్‌లో మా పార్టీని పటిష్టం చేసుకుంటాం. అందులో ఆంధ్రప్రదేశ్, తె లంగాణలు కూడా ఉన్నాయి. 2019 నాటికి మరిన్ని లోక్‌సభ స్థానాలు పెంచుకునేందు కు ప్రయత్నిస్తాం. మోదీ నాయకత్వంపై ప్రజలు ఆశాభావంతో ఉన్నారు. బెంగాల్, కేరళలో ఓట్ల శాతం పెరిగింది. రాబోయేరోజుల్లో ఈ ప్రాంతంలో పార్టీ విస్తరణకు నా శక్తి సామర్ధ్యాలు వినియోగిస్తాను. దేశభద్రతకు సంబంధించిన సవాళ్లు తలెత్తే రాష్ట్రాల్లో ఒకటి జమ్మూకశ్మీర్ అయితే రెండోది ఈశాన్య భారతం. కశ్మీర్లో బీజేపీ అధికారం పంచుకుంటుండగా, ఇప్పుడు అస్సాంలో అధికారంలోకి రాబోతోంది. దేశభద్రతకు సంబంధించిన సమస్యలు తలెత్తే రెండు కీలక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండటం శుభ పరిణామం. ఆ సమస్యల పరిష్కారం లక్ష్యంగా కృషి చేస్తాం.
దిగువకు కాంగ్రెస్: ప్రజలు కాంగ్రెస్‌ను పూర్తిగా తిరస్కరించారు. అస్సాం, కేరళలో ప్రభుత్వం నుంచి దించేశారు. తమిళనాడు, బెంగాల్లో ఎవరి భుజాలపై ఎక్కి ప్రభుత్వంలోకి వద్దామనుకున్నారో.. వాళ్లనూ ముంచేశారు. కాంగ్రెస్.. ప్రాంతీయ పార్టీల స్థాయి కన్నా దిగువకు చేరింది.
నేను మహామంత్రిని..: నన్ను కేంద్రంలో మంత్రిని చేయబోతున్నారంటూ తెలుగు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. నేను ఇప్పటికే బీజేపీలో మహా మంత్రిని(నవ్వుతూ).
ఏపీకి ప్రత్యేక హోదాపై..
ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా అంశం ప్రజల హృదయాల్లో బలంగా ఉన్న మాట వాస్తవం. అన్ని రకాల సాయం అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. ఇప్పటి వరకు అందించింది.. ఇక ముందూ అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడి నియామకంపై త్వరలోనే జాతీయ అధ్యక్షుడు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఏపీలో బీజేపీలో చేరిన నేతల్లో అసంతృప్తి ఉంటే.. వారితో మాట్లాడి వారిని ఉత్సాహపరుస్తాం. తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెడ్తాం. ఏపీలో మేం అధికార పార్టీ. టీడీపీతో కలసి అధికారంలో ఉన్నాం. ప్రజల మన్నన పొందుతూ పార్టీని ఎలా విస్తరించాలన్న అం శంపై దృష్టిపెడతాం. తెలంగాణలో ఒక మంచి ప్రతిపక్ష పార్టీగా ఎదగడానికి ప్రయత్నం చేస్తాం. తెలంగాణలో ఇవాళ ప్రతిపక్ష పార్టీ స్థానంలో శూన్యత ఉంది. ఆ స్థానాన్ని మేం భర్తీ చేస్తాం. 2019 నాటికి ఈ రెండు రాష్ట్రాల్లో కీలక శక్తిగా ఎదుగుతాం.