
అధికారమే లక్ష్యం
వచ్చే ఎన్నికల్లో 150 స్థానాలను కైవసం చేసుకుంటాం ప్రతి కార్యకర్త చమటోర్చాలి
బీజేపీ కర్ణాటక శాఖ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన యడ్యూరప్ప
బెంగళూరు: రానున్న శాసనసభ ఎన్నికల్లో 224 నియోజకవర్గాలకు 150 చోట్ల విజయం సాధించడాన్ని లక్ష్యంగా నిర్ధేశించుకున్నట్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నూతన అధ్యక్షుడు బి.ఎస్.యడ్యూరప్ప వెల్లడించారు. ఇందుకోసం అవసరమైన ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. బెంగళూరులోని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం జగన్నాథభవన్‌లో గురువారం జరిగిన అంబేడ్కర్ 125వ జయంతి కార్యక్రమంలో ప్రహ్లాద్‌జోషి నుంచి బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా యడ్యూరప్ప బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కర్ణాటకలో తొమ్మిది జిల్లాల్లో ఒక్క బీజేపీ ఎమ్మెల్యే కూడా లేరన్నారు. ఇక పదమూడు జిల్లాల్లో బీజేపీకు చెందిన ఒక్కొక్క శాసనసభ్యుడు మాత్రమే ఉన్నారని గుర్తు చేశారు. మొత్తంగా ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 47 మంది బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్యను వచ్చే శాసనసభ ఎన్నికల్లో 150కు చేర్చడం తన ముందున్న ఏకైక లక్ష్యమన్నారు. అయితే నిర్దేశించుకున్న లక్ష్యాన్ని రానున్న రెండేళ్లలో చేరుకొని కర్ణాటకలో బీజేపీని తిరిగి అధికారంలోకి తీసుకురావడం తన ఒక్కడి వల్ల సాధ్యం కాదని...ప్రతి కార్యకర్త చమటోర్చినప్పుడు ఫలితం సాధ్యమన్నారు.
కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల వారికి అనుకూలంగా రూపొందించి అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రతి ఇంటి గడపకు చేర్చాల్సి ఉందన్నారు. ఇందు కోసం తాలూకా, బూత్ స్థాయి కార్యకర్తలు అలుపు లేకుండా పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రాధ్యక్షుడిగా నియామకం కావడం ఎన్నో జన్మల ఫలం అని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా తనపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ముచేయనని ప్రతి క్షణం పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని యడ్యూరప్ప పునరుద్ఘాటించారు. కాగా, కార్యక్రమంలో భాగంగా ప్రహ్లాద్‌జోషి మాట్లాడుతూ... యడ్యూరప్ప రాష్ట్రాధ్యక్షుడు కావడంతో బీజేపీ కర్ణాటక శాఖకు వెయ్యి ఏనుగుల బలం వచ్చిందన్నారు. ప్రస్తుత సీఎం సిద్ధరామయ్య ‘ఎప్పుడూ నిద్ర నుంచి మేలుకోడు అయితే యడ్యూరప్ప ఎప్పుడూ నిద్రపోడు’ అని పేర్కొన్నప్పుడు కార్యకర్తల్లో నవ్వులు విరబూశాయి. కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి జగదీశ్‌షెట్టర్, కేంద్ర మంత్రులు అనంతకుమార్, సిద్దేశ్వర్, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్.అశోక్ తదితరలు పాల్గొన్నారు. ఇక కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి, పార్లమెంటు సభ్యురాలు శోభకరంద్లాజే ఓ ఫొటో గ్రాఫర్ నుంచి కెమరా తీసుకుని సరదాగా పాత్రికేయుల ఫొటోలను తీశారు.
యడ్డీ మొహంపై నవ్వు ఉండబోదు: మురళీధర్‌రావు
ఇక పై యడ్యూరప్ప మొహంలో మరో రెండేళ్ల పాటు నవ్వు ఉండబోదని బీజేపీ కర్ణాటకశాఖ రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జ్ మురళీధర్‌రావు సరదాగా వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ...‘కార్యక్రమం మొదట్లో కొంతమంది ఫొటోగ్రాఫర్లు ఫొటో కోసం యడ్యూరప్పను నవ్వాల్సిందిగా అభ్యర్థించారు. వారికి నేను ఒకటే చెబుతున్నా. ఒకవేళ మీకు యడ్యూరప్ప నవ్వే మొహం కావాల్సి వస్తే ఇప్పుడే తీసుకుండి. మరో రెండేళ్లు ఆ నవ్వు మొహం కనిపించబోదు. ఎందుకంటే అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలపై ఆయన ఉగ్రరూపంలో ప్రజల మధ్యకు వెళ్లనున్నారు.’ అని వ్యాఖ్యానించారు.