ఆయన చేరికతో అదనంగా 40 సీట్లు గెలుస్తాం
బెంగళూరు: ఉత్తరప్రదేశ్‌లో ఘనవిజయం సాధించడంతో జోష్ మీదున్న బీజేపీ.. దక్షిణాది రాష్ట్రం కర్ణాటకలో కాషాయ జెండా ఎగరేయాలని దృష్టిసారిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ చేరికతో తమకు విజయావకాశాలు మరింత పెరిగాయని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కర్ణాటకలో 224 అసెంబ్లీ సీట్లకు గాను 150 సాధించడం తమకు కష్టంకాదని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు. కృష్ణ చేరిక వల్ల తమ పార్టీ అదనంగా 40 సీట్లు గెలుస్తుందని చెప్పారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్‌లో పనిచేసిన కృష్ణ ఇటీవల బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.
బీజేపీలోకి కృష్ణ చేరడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని యడ్యూరప్ప ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ముఖ్యమంత్రిగా పనిచేసినపుడు ఎస్ఎం కృష్ణ బెంగళూరు అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, ఆయన హయాంలోనే ఐటీ రంగం అభివృద్ధి చెందిందని తెలిపారు. దీంతో బెంగళూరు ప్రజల్లో ఆయనకు మంచి ఇమేజ్ ఉందని, ఇది తమ పార్టీకి ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో కర్ణాటకలో బీజేపీని గెలిపిస్తామని చెప్పారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే తానే ముఖ్యమంత్రిని అవుతానని, ఇందులో సందేహం లేదని యడ్యూరప్ప చెప్పారు.