త్వరలో మా పార్టీలోకి 20మంది బీజేపీ నేతలు!
బెంగళూరు: కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో వరుస వలసలు దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే పార్టీ అగ్రనేత, మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి.. బీజేపీ గూటిలోకి చేరగా.. మాజీ మంత్రులైన శ్రీనివాస్ ప్రసాద్, కుమార్ బంగారప్ప, కే జయప్రకాశ్ హెగ్డే వంటి నేతలు కూడా హస్తాన్ని వీడి.. కాషాయ కండువాను కప్పుకున్నారు. ఈ వలసల్లో కాంగ్రెస్ పార్టీలో గుబులు రేపుతున్న నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర హోంమంత్రి జీ పరమేశ్వర కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు.
త్వరలోనే దాదాపు 20 మంది బీజేపీ నేతలు, మరికొందరు జేడీఎస్ నేతలు త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారట. గతంలోనే ఈ విషయాన్ని చెప్పిన పరమేశ్వర తాజాగా గురువారం తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. బీజేపీ నేతలు, జేడీఎస్ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, ఈ విషయాన్ని ప్రజలకు తెలిపేందుకు తాను ఆ వ్యాఖ్యలు చేసినట్టు తెలిపారు. ఎవరెవరు పార్టీలో చేరబోతున్నారు? వారు ఏ ప్రాంతానికి చెందినవారు? అన్నది త్వరలోనే క్లారిటీ ఇస్తామని ఆయన చెప్పారు. ఇంతకు ఎంతమంది బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి చేరబోతున్నారు? వారు చోటామోటా నేతలా? లేక బడా నేతలా? అంటు కర్ణాటక కాంగ్రెస్‌లో చర్చ జరుగుతున్నది.