బెంగళూరు: ఐదు రోజులపాటు అలుపెరగకుండా చర్చించింది. చివరకు.. కర్ణాటక ముఖ్యమంత్రి అంశం ఓ కొలిక్కి వచ్చిందని కాంగ్రెస్ అధిష్టానం ఊపిరి పీల్చుకుంది. ఈ తరుణంలో కొత్త తలనొప్పులు సిద్ధం అవుతున్నాయా?. సామాజిక వర్గాల వారీగా పలు డిమాండ్లు తెర మీదకు రాబోతున్నాయా?.. కర్ణాటక సీనియర్ నేత ఒకరు చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే అవుననిపిస్తోంది. దళితుడ్ని గనుక డిప్యూటీ సీఎం చేయకపోతే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయంటూ హెచ్చరించారాయన.
కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత జి. పరమేశ్వర పార్టీ అధిష్టానానికి ముందస్తుగా ఈ హెచ్చరికలు పంపారు. సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా, డీకకే శివకుమార్‌ను ఏకైక డిప్యూటీ సీఎంగా ప్రకటించిన తరుణంలోనే.. పరమేశ్వర మీడియా ముందు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తానే ఏకైక సీఎంగా ఉండాలని శివకుమార్ పెట్టిన షరతును కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించిందా? అని మీడియా అడిగిన ప్రశ్నకు పరమేశ్వర స్పందిస్తూ.. ‘‘శివకుమార్ కోణంలో ఆయన కోరింది సరైందే కావొచ్చు. కానీ, హైకమాండ్ ఆలోచన భిన్నంగా ఉండాలి. అదే మేం ఆశిస్తున్నాం’’ అని పేర్కొన్నారాయన. డిప్యూటీ సీఎం పదవితోనే దళితులకు న్యాయం జరుగుతుందా? అని మీడియా ప్రశ్నించగా.. దళిత వర్గం భారీ అంచనాలు పెట్టుకోవడం సహజమే కదా అని పేర్కొన్నారు.
‘‘ఈ అంచనాలను అర్థం చేసుకుని.. మా నాయకత్వం ఓ నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నాం. ఒకవేళ అది జరగకపోతే.. సాధారణంగానే ప్రతికూల స్పందన వస్తుంది. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత మేల్కొనే బదులు.. ఇప్పుడే ఆ సమస్యను పరిష్కరిస్తే సరిపోతుంది. లేకుంటే పార్టీ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొవాల్సి వస్తుంది. అదే అర్థం చేసుకోమని నేను హైకమాండ్‌ను కోరుతున్నా’’ అని పరమేశ్వర కాంగ్రెస్ అధిష్టానానికి సున్నితంగా హెచ్చరికలు పంపించారు.
అలాగే.. తానూ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పదవులను ఆశించిన వాళ్లలో ఉన్నట్లు చెబుతున్నారాయన. కానీ, హైకమాండ్ నిర్ణయాన్ని కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది కదా అని పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతానికి వాళ్లిద్దరి పోస్టులను ప్రకటించారు. చూద్దాం.. కేబినెట్ ఏర్పాటులో దళితులకు ఏమాత్రం న్యాయం జరుగుతుందో’’ అని వ్యాఖ్యానించారాయన.
దళిత సామాజిక వర్గానికి చెందిన 71 ఏళ్ల వయసున్న జి. పరమేశ్వర, కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పని చేశారు. అంతేకాదు.. సుదీర్ఘకాలం కర్ణాటక పీసీసీగా పని చేసిన రికార్డు కూడా(ఎనిమిది ఏళ్లు) ఈయన పేరిట ఉంది. 2013లో కేపీసీసీ ప్రెసిడెంట్ హోదాలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన పరమేశ్వర.. ఓటమి పాలయ్యారు. ఆ సమయంలో సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ ఎంచుకుంది ఈయన్నే. కానీ, ఓడిపోవడంతో సిద్ధరామయ్యకు సీఎం పగ్గాలు అప్పజెప్పింది. ఆ తర్వాత పరమేశ్వరని ఎమ్మెల్సీని చేసి.. తన ప్రభుత్వంలో మంత్రిని చేశారు సిద్ధరామయ్య. ఇక మొన్న జరిగిన ఎన్నికల్లో మాత్రం పరమేశ్వర కొరటగెరె స్థానం నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు.
ఇదీ చదవండి: డీకే శివకుమార్ నిజంగానే తలొగ్గాడా?
Comments
Please login to add a commentAdd a comment