నాకు ఇప్పుడే మంత్రి పదవి కావాలి... | Congress Leader MB Patil Still Unhappy Says On CM Kumaraswamy | Sakshi
Sakshi News home page

పట్టు వీడని పాటిల్‌

Published Sat, Jun 9 2018 7:42 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Congress Leader MB Patil Still Unhappy Says On CM Kumaraswamy - Sakshi

ఎంబీ పాటిల్‌

సాక్షి, బెంగళూరు : మాజీ మంత్రి, బీదర్‌ జిల్లా బబలేశ్వర్‌ ఎమ్మెల్యే ఎంబీ పాటిల్‌కు మంత్రివర్గంలో తాజా కేబినెట్‌లో చోటు దక్కలేదు. దీంతో ఆయన అనుచరులు పలు ప్రాంతాల్లో ఆందోళనకు దిగారు. ఆయన కూడా మరో రెండు రోజుల్లో తుది నిర్ణయం ప్రకటిస్తానని హెచ్చరించారు. దీంతో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు బెంగళూరులోని ఎంబీ పాటిల్‌ నివాసానికి క్యూ కట్టారు.

సీఎం కుమారస్వామితో సహా ఎంతో మంది సీనియర్‌ నాయకులు, మంత్రులు వెళ్లి మాజీ మంత్రి ఎంబీ పాటిల్‌కు నచ్చజెప్పడానికి ప్రయత్నించినా ఫలించలేదు. ఆయన ఒక్క మెట్టు కూడా దిగలేదు. ఈనేపథ్యంలో శుక్రవారం ఉదయం మంత్రులు డీకే శివకుమార్, ఆర్‌వీ దేశపాండే వెళ్లి ఎంబీ పాటిల్‌తో మాట్లాడారు. అనంతరం ఉపముఖ్యమంత్రి డాక్టర్‌ జి.పరమేశ్వర్, మంత్రి కేజే జార్జ్‌ తదితరులు వెళ్లి నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. అయితే ఎంబీ పాటిల్‌ మాత్రం ఎవ్వరి మాట వినకుండా పట్టిన పట్టు వదలడం లేదు.

ఎంబీ పాటిల్‌ ఇంటికి సీఎం

అనంతరం శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు బెంగళూరు నగరంలోని సదాశివనగర్‌లో ఉన్న మాజీ మంత్రి ఎంబీ పాటిల్‌ ఇంటికి కర్ణాటక సీఎం హెచ్‌డీ కుమారస్వామి స్వయంగా వెళ్లారు. సుమారు గంటన్నర పాటు సమావేశమై చర్చించారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. ఎంబీ పాటిల్‌ కుటుంబ సభ్యులకు తనకు ఎంతోకాలం నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు.

ఎంబీ పాటిల్‌కు మంత్రి పదవి రాలేదని అసమ్మతి వ్యక్తం చేశారని చెప్పారు. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ నాయకులతో మాట్లాడుతానని సీఎం అన్నారు. కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీ నాయకులు హైకమాండ్‌తో మాట్లాడితే అన్ని సర్దుకుంటాయని సీఎం కుమారస్వామి అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్‌ పార్టీ అన్నీ గమనిస్తోందని.. సీఎం కుమారస్వామి ఎంబీ పాటిల్‌కు సూచించారు.

వచ్చే జాబితాలో చోటు

త్వరలో మంత్రివర్గం విస్తరణ ఉండే అవకాశం ఉంది. అప్పుడు ఎంబీ పాటిల్‌కు కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉందని కాంగ్రెస్‌ నాయకులు చెబుతున్నారు. అయితే ఆయన మాత్రం తనకు ఇప్పుడే మంత్రి పదవి కావాలని పట్టుబట్టారు. తాజా జాబితాలో తన పేరు ఎందుకు లేదో సమాధానం చెప్పాలని ఎంబీ పాటిల్‌ కోరారు. లింగాయత్‌– వీరశైవుల ప్రత్యేక మతం కోసం పోరాటాలు చేసినా ఫలితం లేకపోయిందని పాటిల్‌ ఆవేదన చెందారు.

చెప్పడానికి వచ్చిన మంత్రులతో మాట్లాడుతూ మీకు (మంత్రులకు) పదవులు ఇచ్చారు. ఏమైనా మాట్లాడుతారు. కానీ నాకు మంత్రి పదవి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం పరమేశ్వర్‌ మీడియాతో మాట్లాడారు. ఎవరు చెప్పినా ఎంబీ పాటిల్‌ వినే పరిస్థితిలో లేరన్నారు. ఆయనతో జరిపిన చర్చలన్నీ విఫలమైనట్లు తెలిపారు.

మద్దతుదారుల ఆందోళన
మాజీ మంత్రి ఎంబీ పాటిల్‌తో మాట్లాడటానికి వచ్చిన కాంగ్రెస్‌ నాయకులపై ఆయన మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 నేను ఒక్కడిని కాను..

ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎంబీ పాటిల్‌ మీడియాతో మాట్లాడుతూ... తాను ఒక్కడినే పార్టీకి వ్యతిరేకంగా లేరన్నారు. తనతో పాటు సుమారు 20 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసేందుకు సిద్ధమైనట్లు చెప్పారు. సీఎం కుమారస్వామి తన ఇంటికి వచ్చి మాట్లాడిన సంగతి వాస్తవమే అన్నారు. కానీ కాంగ్రెస్‌ పార్టీలోని వ్యవహారాలపై సీఎం ఏం చెప్పలేరు కదా అన్నారు. గత రెండు రోజుల నుంచి అసంతృప్త ఎమ్మెల్యేలందరు చర్చించినట్లు తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement