
కర్ణాటక డిప్యూటీ సీఎం జి. పరమేశ్వర, సీఎం కుమారస్వామి
సాక్షి, బెంగళూరు : తాను దళితుడినైన కారణంగానే మూడు సార్లు సీఎం పదవి చేజారిందంటూ కర్ణాటక డిప్యూటీ సీఎం జి.పరమేశ్వర సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం దావణగెరెలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘నేను అయిష్టంగానే ఉప ముఖ్యమంత్రిగా పని చేస్తున్నాను. అసలు నాకు ఆ పదవిపై ఏమాత్రం ఆసక్తి లేదు. దళితుడినైన కారణంగానే మూడుసార్లు సీఎం పదవి చేజారింది. కొంతమంది కావాలనే రాజకీయంగా నన్ను అణచివేయాలని చూస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు.
వాళ్లకి కూడా అందుకే మొండిచేయి..!
రాజకీయాల్లో ఎదిగేందుకు ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారని.. అందువల్లే అర్హులైన నాయకులకు కూడా పదవులు దక్కవని పరమేశ్వర అన్నారు. ‘పీకే బసవలింగప్ప, కేహెచ్ రంగనాథ్ సీఎం పదవి చేపట్టలేకపోయారు. కలబురగి ప్రస్తుత ఎంపీ మల్లికార్జున ఖర్గే కూడా ముఖ్యమంత్రి కాలేకపోయారు. నేను కూడా ఆ పదవి నిర్వహించలేకపోయాను. ఇదంతా మేము దళితులమనే కారణంగానే జరిగింది. ప్రభుత్వం కూడా మమ్మల్ని చిన్న చూపు చూస్తోంది. రిజర్వేషన్ ఉన్నా ప్రమోషన్లలో మా వర్గానికి అన్యాయం జరుగుతోంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా దళితులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, అందుకు డిప్యూటీ సీఎం వ్యాఖ్యలే నిదర్శనమని కర్ణాటక మాజీ సీఎం, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప విమర్శించారు. ఇక పరమేశ్వర వ్యాఖ్యలపై స్పందించిన కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య మాట్లాడుతూ.. పరమేశ్వర వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, కాంగ్రెస్ పార్టీ తప్ప మిగతా పార్టీలన్నీ దళితులను నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment